10, సెప్టెంబర్ 2013, మంగళవారం

ద్వితీయస్కంధం: 13. శుకయోగి చేసిన దైవ ప్రశంశ.

పరీక్షిన్మహారాజు భగవంతుడి సృష్టిని గురించి గుప్పించిన ప్రశ్నలు విని శుకయోగి ఏమీ కంగారు పడలేదు. పైపెచ్చు మంచి ప్రశ్నలు అడిగే శిష్యుడు లభించినందుకు చాలా సంతోషించాడు.  ఇటువంటి  చక్కని ప్రశ్నలకు మంచి జవాబు చెప్పాలని కుతూహలం చెందాడు.  జవాబు చెప్పటానికి పూనుకొనే ముందుగా ఆ మహాయోగి భగవంతుడైన శ్రీహరిని ఈ క్రిందివిధంగా ఎంతో గొప్పగా ప్రశంసించాడు.

మ. పరుఁడై యీశ్వరుఁడై మహామహిముఁడై ప్రాదుర్భవస్థానసం
హరాణక్రీడనుఁడై త్రిశక్తియుతుఁడై యంతర్గతజ్యోతియై
పరమేష్ఠిప్రముఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్తరమార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్
 


అన్నింటికీ ఆయన అతీతుడు. సమస్త విశ్వానికీ ఆయన అధిపతి. ఆయనకన్నా మహిమ కలవారు లేనేలేరు. సృష్టిస్థితిలయాలు మూడూ ఆయనకు ఒక ఆట.  ఇఛ్ఛా జ్ఞాన క్రియాశక్తులు మూడూ ఆయన స్వంతం. చరచరవిశ్వంలోపలా ప్రకాశించే చైతన్య జ్యోతి ఆయనే. ఆయన తేజస్సును బ్రహ్మాది దేవతా ప్రముఖులు కూడా తెలుసుకో లేరు. అటువంటి ఆ మహాత్ముడైన శ్రీహరికి, అయన నిజతత్త్వం  గురించిన విజ్ఞానం కోరి మొక్కుతున్నాను. 

ఆ శ్రీహరి తత్త్వం తెలుసు కోవాలంటే ఆయన అనుగ్రహంతోనే అది సాధ్యపడుతుంది. అంతే కాని జీవుడు తన స్వంత ప్రజ్ఞ చేత ఏమీ తెలుసుకోలేడు. అత్యంత ఉత్తమ జీవి అయిన బ్రహ్మకైనా సరే అది అంతుపట్టదు. నిజానికి జీవులతో సహా సమస్త విశ్వమూ ఆయన వెలుగులో ఒక భాగమే. ఏదైనా భాగం పూర్ణత్వం గురించి స్వయంగా ఎలా తెలుసుకుంటుందీ?

సజ్జనులు విధివశాన చేసిన పాపాల్ని నశింపజేసే శ్రీహరికి నమస్కారం.
అర్థకామాలని నమ్ముకుని దుర్జనులు చెలరేగకుండా ప్రపంచాన్ని రక్షించే శ్రీహరికి నమస్కారం.
ఈ ప్రపంచంలో చరాచరాత్మకమైన సర్వరూపాలలోనూ సంచరించే శ్రీహరికి నమస్కారం.
పరమహంసలైన మునీంద్రుల హృదయకమలాలలోప్రకాశించే శ్రీహరికి నమస్కారం.
సత్వగుణం ప్రధానంగా గలవాడికి నమస్కారం.

(సాత్వతులనే‌ యదుశాఖవారిలో శ్రేష్ఠుడుగా శ్రీకృష్ణావతారం ఎత్తిన శ్రీహరికి నమస్కారం.)
సకలకల్యాణగుణాలకూ ఆలవాలమైన శ్రీహరికి నమస్కారం.
పరమభక్తులకు బహుసులభంగా చిక్కే శ్రీహరికి నమస్కారం.
భక్తి లేని వాళ్ళకు తెలుసుకోవటానికి దుర్లభమైనవాడైన శ్రీహరికి నమస్కారం.
తన కంటే గొప్పవాడెవ్వడూ లేనివాడూ, తనతో మరెవరికీ పోలికే లేని వాడూ ఐన శ్రీహరికి నమస్కారం.
హద్దులేని ప్రభావం గల శ్రీహరికి నమస్కారం.
కేవలం‌ పరబ్రహ్మమే తానైన పరమేశ్వరుడు  శ్రీహరికి నమస్కారం.


భగవంతుడికి ఆసాధ్యం అంటూ ఏదీ ఉండదు. ఏవో కొన్ని పరిమాణాల్లో చిక్కుకుని ఉన్న సృష్టిలోని సమస్తానికీ ఆయా పరిమాణాల తాహతుకు మించిన సమస్తమూ అసాధ్యాలే.  కాని ఏ  పరిమాణానికీ అందక అన్నింటికీ అతీతంగా ఉండే భగవంతుడికి ఏ పరిమాణమూ ప్రమాణమూ కాదు అడ్డూ కాదు. అందుచేత ఇది కుదురుతుందా ఆయనకు అన్న ప్రశ్నే అసంగతం.  త్రిగుణాలూ ప్రకృతీ అన్నీ అయన ఏర్పరచినవే. వాటికి అతీతుడైన ఆయనకు ఆయా గుణాలలోనూ ఆగుణాలను కలిగి ప్రవర్తించే‌ప్రకృతిలోను చేరి విహరించటమూ అయినా వాటికి అతీతంగా స్వేఛ్ఛగానే ఉండటమే కేవలం లీలామాత్రమే. అయనను  గురించి తెలుసుకోవాలంటే కేవలం భక్తుడికి మాత్రమే సాధ్యం. పరమహంసలైన వారు అటువంటి భక్తిని ఆశ్రయించుకుని తమతమ హృదయాల్లో ఆయనను నిత్యం ఆనందంగా దర్శిస్తూ ఉంటారు. మిగత అందరూ గుణరూపాత్మకమైన ప్రకృతిలో పడి ఆయనను గ్రహించలేకుండా అజ్ఞానంతో ఉంటారు.

ఉ. ఏ విభు వందనార్చనము లే విభు చింతయు నామకీర్తనం
బే విభు లీల  లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో
షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు నే
నా విభు నాశ్రయించెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్


ప్రభువుకు నమస్కరించటం, పూజించటం, ఆయన నామజపం చేయటం, ఆయన అద్భుతమైన లీలాగాథల్ని పెద్దలవలన విని తెలుసుకోవటం అనేవి చాలా మంచి సంగతులు.  వీటి వలన పాపాలన్నీ‌ దూరం అవుతాయి.  అన్నిరకాల శుభాలు పరంపరగా కలుగుతాయి. ఇలా ఏ ప్రభువును గురించి పెద్దలు చెప్పుతున్నారో, పాపసమూహాల్ని నాశనం చేసేవాడూ, క్షేమదాయకం ఐన కీర్తనా ప్రభావం‌కలవాడూ అయిన ఆ ప్రభువుని నేను ఆశ్రయిస్తున్నాను.

ఆత్మసమర్పణ బుధ్ధితో భవవంతుని సేవించిన వారికి పాపనాశనం, జన్మరాహిత్యం అని భావం.

ఉ. ఏ  పరమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్
లోపలి బుధ్ధితో నుభయ లోకములందుల జడ్డుఁ‌  బాసి యే
తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు రే
నా పరమేశు మ్రొక్కెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్


ఇహంలో‌  సుఖం స్వల్పం. దుఃఖం‌ హెచ్చు. అలాగని పరలోకం స్వర్గంలో  సుఖం లావు అందామా అంటే అదికూడా గ్రుడ్డికన్నా మెల్ల మెరుగు అన్న చందమే కాని ఆక్కడా సుఖం స్వల్పమే.  అదీ‌ తాత్కాలికమైన సుఖమే కాబట్టి అది కాస్తా అంతమై పోతుందన్న దుఃఖంఅక్కడా తప్పట్లేదు. ఇలా ఉభయలోకాల్లోనూ‌ ఎక్కడా నమ్మదగిన సుఖం అనేది లేదు. అలాంటి ఇహపరాల్లో  సుఖం వెదుక్కుంటూ జీవితం వ్యర్థం చేసుకునే వాడు అక్షరాలా మంద బుధ్ధి. నిజానికి శాశ్వతమైన సుఖమూ‌శాంతీ అనేవి పరబ్రహ్మం యొక్క లక్షణాలు. ఇది తెలిసిన వాడే నేర్పరి. అంతర్దృష్టి కలవాడికి కాని ఈ‌ తెలివి రాదు.  అది కలిగిన వాడే నేర్పరి. ఆ నేర్పరులు అశాశ్వతాలైన ఇహపరాల కోసం శ్రమపడరు. పరబ్రహ్మాన్ని చేరుకుందుకు పరమేశ్వరుడి పాదాలు ఆశ్రయిస్తారు. ఆయన ఇహపరాలతో సంగం కారణంగా వచ్చే పాపాల పరంపరని నివారిస్తాడు. ఆయనను సంకీర్తనం చేయటం భద్రస్థితి (ఇంక మార్పులేని స్థితి - అంటే మోక్షం) కలిగిస్తుంది. అలా నేర్పరులైన మహాత్ములు ఏ పరమేశ్వరుడి పాదాలను భక్తితో సేవిస్తున్నారో నేనూ ఆ పరమేశ్వరుడికి మొక్కుతున్నాను.

చ. తపముల జేసియైన మఱి దానము లెన్నియుఁ  జేసి యైన నే
జపములఁ జేసి యైన ఫలసంచయ మెవ్వనిఁ‌జేర్ప కున్న హే
యపదములై దురంత విపదంచిత రీతిగ నొప్పుచుండు న
య్యపరిముతున్ భజించెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్


తపస్సు చేసి, ఆ తపస్సు యొక్క ఫలితాన్ని ఈ‌శ్వరుడికి అర్పించకపోతే అదే ఒక బంధహేతువు అవుతుంది.  దాన ధర్మాలు చేసి వాటి వలనకలిగే ఫలితాల్ని ఈశ్వరుడికి అర్పించకపోతే అవి బంధహేతువులే అవుతున్నాయి. ఇలా మంచి పనులు కూడా ఈశ్వరార్పణ బుధ్ధిలేక పోవటం వలన అవి తప్పించుకోవటానికి వీలులేని దుష్ఫలితాలు ఇచ్చి ఆపదలను తెచ్చి పెడుతున్నాయి. అన్ని  ప్రమాణాలకూ అతీతుడైన భగవంతుడికి సమర్పించినవి మాత్రం , సమస్తమైన ప్రాపంచిక సంగాల రూపంలోని పాపాలనూ నివారిస్తున్నాయి, భద్రస్థితికి కారణాలు అవుతున్నాయి.  ఆ పరమేశ్వరుడిని భజిస్తున్నాను. 


భగవంతుడిని సమర్పించటానికి కాక తపస్సు దేనికోసం? ఏదో ఒకటీ ఆశించే కదా. ఆశ అంటే బంధహేతువే కదా. ఆలాగే దానధర్మాలూ  ఏదైన ఆశించే చేసినా ఆ అశాబంధం మోయక తీరదు. సరే కోరిన ఫలాన్ని తపస్సు ద్వారానో, దానాదులవల్లనో పొందాక ఆ ఫలాన్ని తాను అనుభవిస్తున్నాడు. ఒక్కొక్కసారి ఆ ఫలం మరుజన్మలో కలగవచ్చును. అనుభవించిన ఫలం ఎలాంటి దైనా సరే అది తృప్తి కలిగించటం వట్టి మాట. ఈ రోజున పేదవాడు వ్రతాలు చేసి ధనవంతుణ్ణి కావాలీ అని కోరుకున్నాడని అనుకుందాం. ఆట్టే ఆయువులేక, మళ్ళీ జన్మలో కోరిక తీరి డబ్బున ఆసామీగా పుడతాడు. జన్మలక్షణం పోదు.  ఇప్పుడు రాజయోగం కావాలీ అని వ్రతాలు చేయటం, గుళ్ళూ గోపురాలూ కట్టించటం, అన్నదానాలు చేయటం చేస్తాడు. మరుచటి జన్మలో రాజయ్యాక మరింతగా ఎదగాలీ చక్రవర్తిని కావాలీ లాంటి కోరిక కలగదా చెప్పండి.  అందుకే కోరికలు తీర్చటం వలన శాంతించేవి కావు అని తత్త్వవేత్తలు సెలవిస్తుంటారు. ఇలా ఆశామోహాలకు లోనై జన్మపరంపరలో చిక్కుకోవటమే దుష్ఫలితమూ ఆపదా అంటే. ఒక్కో జన్మలో కోరిన కోరిక మరు జన్మలో నో అదే‌జన్మలోనో తీరితేదాన్ని నిలబెట్టుకుందుకు తెగించి పాపాలూ చేస్తూ ఉంటారనీ మరచిపోకూడదు. ఇలా ఆపదలకు మేర ఏదైన ఉందా? అన్ని కష్టాలకీ మూలం కర్మఫలాల్ని ఈశ్వరార్పణం చేయకపోవటమే. ఈశ్వరార్పణం అయిన కర్మ వలన కలిగే ఫలితానికి బంధం కలిగించే శక్తి ఉండదు కదా.  అప్పుడు చివరికి శుభమే కదా!

మ. యవన వ్యాధ పుళింద హూణ కష కంకాభీర చండాల సం
భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి భా
గవతశ్రేష్ఠుల డాసి శుధ్ధతనులై కల్యాణులై యుందు రా
యవికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మ్రొక్కెదన్


వేదబాహ్యులైన యవనులూ, బోయలూ, పుళిందులూ, హూణులూ, కషులూ,  కంకులూ, ఆభీరులూ, చండాలురూ ; అలాగే ఇతర పాపజీవనులూ కూడా ఏ  శుభస్వరూపుణ్ణి సేవించటం ద్వారా భగవద్భక్తులతో చేరి శారీరకంగా పరిశుధ్ధులూ, మానసికంగా శుభప్రదమైన బుధ్ధీ కలిగి యోగ్యులై పోతున్నారో, ఆ నిర్వికారుడైన సమస్తసృష్టికీ కర్తయైన భగవంతుడిని నిరంతరంగా మొక్కుతున్నాను.

ఇక్కడ చాలా రకాలైన వేదవిరుధ్ధ జీవనం కలవారిని చెప్పటం చూడవచ్చును. వీళ్ళకు వేదజ్ఞానం లేదు కాబట్టి  వేదప్రతిపాద్యుడైన పరమేశ్వరుడి గురించిన జ్ఞానమూ ఉండదు. కాబట్టి అవి నీచ జన్మలూ అన్నారు.  భగవంతుడిని గురించిన స్పృహలేని వీళ్ళు చేసేవి అన్నీ‌ తమపొట్టకోసమే అయిన దుష్కార్యాలు అయినప్పుడు అవి పాపాలే అవుతున్నాయి.

అటువంటి వారికి కూడా ఏ‌కారణం వల్లనైనా సరే, ఈశ్వరుడి మీద గురి కుదిరిందా, ఇంక వాళ్ళు పవిత్రం ఐపోతున్నారు.  భాగవతులు అలాంటి ఈశ్వరస్పృహకల వాళ్ళని ఆదరిస్తారు. వారి వృత్తిజీవితాల కారణంగా వాళ్ళు వేదోక్త సంస్కారాలు కల శరీరాలతో కనిపించకపోవచ్చును.  కాని వాళ్ళ హృదయాల్లోకి భగవంతుడు చేరి కూర్చున్న కారణంగా వాళ్ళ దర్శనం, స్పర్శనం కూడా పరమపవిత్రమైనవి.  భగవంతుడి చేరికతో వాళ్ళ మనస్సులు పరమనిర్మలం ఐపోయాయి కాబట్టి వాళ్ళ చేష్టలూ‌ మాటలూ పరమకల్యాణప్రదాలు అవుతున్నాయి.

దీనికి ఉదాహరణగా వేదధర్మానికి ఆవల జన్మించిన వాళ్ళు మహాభక్తులు యోగివర్యులు ఎందరో మనకు దృష్టాంతాలుగా కనిపిస్తారు. కబీరు ముస్లిం మతస్థుడు.  మల పిచ్చమ్మ అస్పృశ్యురాలు జన్మతః.  కాని వాళ్ళు ప్రాతఃస్మరణీయులు కాదా?

మ. తపముల్ సేసిననో మనో నియతినో దానవ్రతావృత్తినో
జపమంత్రంబులనో శ్రుతిస్మృతులనో సద్భక్తినో యెట్లు ల
బ్ధపదుండౌ నని బ్రహ్మరుద్రముఖరుల్ బావింతు రెవ్వని న
యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుండౌఁ గాక నా కెప్పుడున్


ఆయన పదాలు మన మనస్సులకు ఎలా చిక్కుతాయీ?  తపస్సు చేస్తేనా లభిస్తాయా? మన మనస్సులోంచి అన్ని కోరికలూ తరిమివేసి దాని నియంత్రిస్తే లభిస్తాయా? మనం‌ నిష్ఠగా, దానాలూ వ్రతాలూ అదేపనిగా చేస్తూ ఉంటే లభిస్తాయా? పోనీ అత్యంత ప్రమాణాలూ జ్ఞానభాండాగారాలూ అని పేరున్న వేదాల్నీ శాస్త్రాల్నీ క్షుణ్ణంగా అధ్యానం చేస్తే అవి లభించే విధానం తెలుస్తుందా? ఇలాంటి పనులన్నీ‌ఫలితాలు ఇవ్వటం అనుమానమే అని కేవలం భక్తితో ధ్యానం చేస్తే ఆయన పాదాలు దొరుకుతాయా? ఇలా ప్రశ్నించుకుంటూ బ్రహ్మగారూ శివుడు మొదలైన మహాత్ములంతా ఎవరిని గురించి నిత్యం భావన చేస్తూ ఉంటారో,  ఆ మోక్షస్వరూపుడూ, కేవలం ఆత్మమూర్తి ఐన భగవంతుడు  నన్ను దయతో సులభంగా  అనుగ్రహించు గాక.

సమస్త వేద శాస్త్రాలూ కూడా మనశ్శుధ్ధికే.  సకల ఆచార సంపత్తీ‌దాన్ని సంపాదించటం కోసమే. అది భక్తితో లభిస్తున్నంత సులభంగా మరే ఇతర మార్గాల ద్వారానూ లభించటం లేదు. భక్తితో నిత్యం భగవంతుడిని ధారణ చేయటమే ఉత్తమోత్తమ మార్గం అని ఈ పద్యం నిష్కర్ష చేస్తోంది.

క. శ్రీపతియు యజ్ఞపతియు ప్ర
జాపతియున్ బుధ్ధిపతియు జగదధిపతియున్
భూపతియు యాదవశ్రే
ణీపతియున్ గతియు నైన నిపుణుభజింతున్


ఆయన లక్ష్మీ దేవికి భర్త. అయన సమస్తమైన యజ్ఞాలకీ అధిష్టాన దైవతం.  ఆయన ఈ  సృష్టికి ప్రజాపతి.  జీవుడి బుధ్దికి అయనే అధిపతి.  సమస్తవిశ్వానికీ ఆయన ప్రభువు.  ఈ  భూమికి ఆయనే రక్షకుడు.  యాదవులందరికీ ఆయనే దిక్కు.  ఆయన నైపుణ్యం వల్లనే సృష్టి నడుస్తోంది.  అటువంటి మహాత్ముడిని (శ్రీకృష్ణుణ్ణి) భజిస్తున్నాను.

ఇక్కడ శ్రీ అన్నమాటకు రూఢార్ధంగా నిత్యం చెప్పుకునే‌ లక్ష్మి అనే కాకుండా మోక్షం అని చెప్పుకోవటంతో మరింత పుష్టి కలుగుతుంది పద్యభావానికి.

మ. అణువో కాక కడున్ మహావిభవుఁడో యఛ్ఛిన్నుఁడో ఛిన్నుఁడో
గుణియో నిర్గుణుఁడో యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వ మా
ర్గణులై యే విభు పాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ
క్షణముం జేసెద రట్టి విష్ణుపరమున్ సర్వాత్ము సేవించెదన్


ఈ భగవంతుడు కేవలం దృశ్యమానం కావటానికి వీల్లేనంతగా అణు సూక్ష్మస్వరూపం ఉన్నవాడా? ఆయన మరెవ్వరికీ ఊహించటానికి కూడా సాధ్యం కానంత వైభవం కలవాడా?  దేశకాలాది పరిమాణాలచేయ విడివిడిగా తెలుసుకోవటానికి వీలైన స్వరూపస్వభావాలు కలవాడా? అలా వీలు పడని అఖండస్వరూపమా?  ఆయనలో త్రిగుణాలకు స్థానం ఉందా?  లేక త్రిగుణాలకూ అతీతమైన స్వభావంతో ఉంటాడా? ఇలా తత్త్వం ఆలోచిస్తూ మహా మహా విజ్ఞానులు కూడా ఆయన గురించి ఏమీ తెలుసుకోలేక చిన్నబోతున్నారు. చివరికి వాళ్ళంతా బుధ్ధిమంతులై ఆ పరమేశ్వరుని పాదపద్మాలను గొప్పగా భజన చేసి తత్త్వజ్ఞానం సంపాదించుకుంటున్నారు. ఆ సర్వాత్ముడూ, తనకంటె అధికం ఏదీ లేని వాడూ, భగవంతుడూ ఐన విష్ణువుని నేను  సేవిస్తున్నాను.

విభుడు అంటే అధిపతి కాబట్టి ఇక్కడ మహావైభవం అంటే అన్నింటికంటే గొప్ప ఆధిపత్యం సృష్టిమీద అని చెప్పుకోవాలి.

బ్రహ్మకు సృష్టి చేయగల బుధ్ధికుశలతని అందించాలని ఏ మహాత్ముడు సరస్వతిని పంపితే ఆమె ఆ బ్రహ్మను భర్తగా వరించి, ఆయనకు సృష్టి చేయగల బుధ్ధిసామర్థతలను అందించిందో, ఆ మహాత్ముడు నారాయణుని నేనూ సేవించటం మొదలు పెడుతున్నాను.

తాను స్వయంగా పరిపూర్ణుడైనా, పంచభూతాలను ఏర్పరచి, వాటినుండి సమస్త సృష్టినీ చేసాడు.  అంతేకాక ఆయన ఆ సృష్టిలోనే తాను ప్రవేశించి క్రీడిస్తున్నాడు.  పంచభూతాల నుండి ఐదు కర్మేంద్రియాలూ, ఐదు జ్ఞానేంద్రియాలూ, మనస్సూ  అని మొత్తం పదకొండు వ్యవస్థలను ఆయన చేసాడు. ఈ  పదకొండింటితో ఆయన జీవుల్ని  పుట్టించి, ఆయా జీవులలో ప్రవేశించీ, ఐనా వాటికి అతీతంగా వాటి బయటా ఉంటూ వినోదిస్తున్నాడు. ఆ మహాత్ముడు, శ్రీహరి ఇప్పుడు నా మనస్సులో నిలిచి అందమైన కుసుమాల వంటి వాక్కులను పలికించు గాక.  ఆ  సద్వాక్య ప్రసూనాల మకరందం రూపంగా ఆయన  తన లీలలు నా నోటి వెంట ప్రకటించు గాక. యోగసమాధి నిష్ఠగల మహాపురుషులు తమ గుండెలోపల నివసించే భగవంతుని  తెలుసుకొని పూజిస్తారు.  అలాంటి  మహాత్ములు ఏ భగవంతుని ముఖపద్మాన్ని ధ్యానం చేస్తూ, ఆ పద్మమకరంద మాదుర్యంతో ఈ ప్రకృతి భయం నుండి విముక్తులై తరిస్తున్నారో అలాంటి మహాత్ములలో తలమానికం ఐన వాడు, అజ్ఞానం అనే చీకటికి సూర్యబింబం వంటివాడు ఐన వేదవ్యాసమహర్షికి నమస్కరిస్తున్నాను.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి