3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ద్వితీయస్కంధం: 08. యోగమూ - ముక్తీ

శుకయోగి ఇలా శ్రీమహావిష్ణువు యొక్క దివ్యస్వరూపాన్ని వివరించిన తరువాత ధారణ గల మానవుడు అంత్యకాలంలో ప్రవర్తించే విధానం వివరిస్తున్నారు. 

మహారాజా, ఈ దేహం‌ ప్రయోజనం చివరికి వచ్చిన దని గ్రహించిన యోగిరాజు దేహాన్ని విడిచి పెట్టటం వాయిదా వెయ్యటానికి సాకులు వెదకడు.  ఇక శరీరంతో‌ పని తీరిందీ అన్న గ్రహింపు రాగానే, భద్రాసనం వేసుకుని కూర్చుంటాడు.  ప్రాణవాయివుల్ని మనస్సులో బంధిస్తాడు.  మనస్సుని బుధ్ధిలో లయం చేస్తాడు. ఆ బుధ్ధిని జీవుడితో యేకం‌ చేస్తాడు. తరువాత జీవుడి ప్రజ్ఞని అత్మలో నిలుపుతాడు.  చివరికి ఆ ఆత్మను పరబ్రహ్మములో విలీనం చేస్తాడు. ఆ పరబ్రహ్మమే శాశ్వతమైన శాంతికీ, సుఖానికీ స్థానం.

ఇక్కడ శుకయోగి అంత్యకాలం అని చెప్పినది ఇంద్రియాలూ వాటి అధిపతి ఐన మనస్సూ లయం ఐపోయి ధారణ సిధ్ధించిన స్థితిని గురించి సంకేతంగా.  ధారణ సిధ్ధించటం అంటే యోగికి దేహంతో సంబంధం తెగిపోవటం కదా. దేహికి సహజంగా ఉండే దేహాభిమానం యోగికి ఇంక ఉండదు కదా.  ఇలా దేహాభిమానం వదలటానికి అవకాశం‌ లభిస్తే యోగి దానిని సంతోషంగా అందిపుచ్చుకుంటాడు. అంతే కాని, ఫలాని సమయం మంచిది కాదనీ, ఫలాని ప్రదేశం యోగ్యమైనది కాదనీ ఆక్షేపణలు చేయడు. 

సాధారణ జీవికి, ఈ దేహం అనేది కర్మబంధం నిలిపి ఉంచినంత కాలమే భూమి మీద ఉంటుంది.  కర్మానుభవం మాత్రమే జీవికి దేహం దేహధారణకు కారణం‌ కదా.  అందు చేత  ఆ కారణం కాస్తా తీరిపోతే ఈ దేహం ఉనికికి ఏమీ‌ ప్రయోజనం ఉండదు.  అప్పుడు ఆ దేహం‌ పడిపోతుంది.  ఐతే, సంచితమైన కర్మలను అనుభవించటానికి ఆ సాధారణ జీవి మళ్ళీ జన్మించవలసిందే.

సాధన సిధ్ధించిన యోగి పరిస్థితి వేరు.  భగవంతునితో యోగం సిధ్ధించిన తరువాత కర్మబంధం అనేది పూర్తిగా తెగిపోతుంది.  సాధారణ జీవికి కర్మబంధం అనేది ఉపాధికి సంబంధించి నంత వరకే తీరిపోతుంది.  యోగికైతే ఆ కర్మబంధం శాశ్వతంగా తీరిపోతుంది.  అందుచేత, సాధారణ జీవికి పునర్జన్మ అనేది తప్పదు.  యోగికి ఇంక పునర్జన్మ అనేది ఉండదు.  సాధన పరిపక్వం కాని యోగ సాధకుడు పునర్జన్మలను స్వీకరించ వలసిందే.  కాని సాధకుడికి కలిగే పునర్జన్మ యోగసాధన కొనసాగింపు కొరకు మాత్రమే భగవంతుడి చేత అనుగ్రహించ బడుతోంది.  సాధారణ జీవుడికి పునర్జన్మలు రావటం అతడి సంచిత పాపపుణ్యాల అనుభవం కోసం.  ఈ‌ తేడాను పాఠకులు బాగా గ్రహించ వలసి ఉంది.

ఈ సందర్భంలో పోతనగారు ఆసన్నమరణార్థి యైన యతీశుండు అని చెప్పారు.  భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు

అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేబరమ్
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః


అని చెప్పటం చూడవచ్చును.

సాధారణంగా వ్యాఖ్యాతలంతా కూడా ‌ఈ‌ సందర్భంలో అంత్యకాలం అంటే మరణసమయం అనే చెప్పారు. తన భాగవతంలో‌ పోతనగారూ మరణసమయం అనే‌ అన్నారు. అలాంటప్పుడు మనం అంత్యకాలం అంటే ధారణలో సిధ్ధి లభించి, యోగి మనస్సు ఇంద్రియాలతో సహా ధారణలో లయం కావటం అనిచెప్పటం వలన విరోధం వస్తోందా అన్న అనుమానం రావచ్చును. ధారణా మనోలయమూ లేని వాడు కేవలం సాధారణవ్యక్తి.  అటువంటి వాడికి మరణసమయంలో మనస్సులో కర్మసంబంధం ఐన వాసనలే ఉంటాయి.  తదనుగుణంగా కర్మానుభవానికి తగిన వీలు కల్పించే శరీరం వస్తుంది. కేవలం ధారణతో‌ సిధ్ధి లబించిన వాడికి మాత్రం కర్మక్షయం అవుతుంది. అందుచే‌  ఉపాధికి కర్మబంధాల నుండి విముక్తి కలుగుతుంది.  అదే అతడికి అంత్యకాలం.  ఇంక ఉపాధితో పనిలేదని అతడు దాన్ని వదలి పరబ్రహ్మంతో తనను తాను అనుసంధానం చేసుకుంటాడు.

ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది.  ధారణతో హరిపదాన్ని చేరుకున్న యోగి తప్పని సరిగా శరీరాన్ని విసర్జించాలా?  అది ఆత్మహత్య కాదా?   దేహాన్ని విడిచిపెట్టటం అంటే దేహంతో తనకు కల అనుబంధాన్ని విడిచిపెట్టటం అని.  దాని అర్థం, ఉపాధిని (శరీరాన్ని) పడగొట్టి లేచి వెళ్ళి పోవటం అని కాదు.  సాధారణ వ్యక్తి కేవలం‌ తనది అనుకుంటున్న ఉపాధిని ఆశ్రయించుకుని ఉంటాడు.  దానికంటే విడిగా అతడు ఉండటం అనేది ఊహించటానికి వీలు లేదు.  సిధ్ధి కలిగిన యోగికి శరీరం లోపలా, శరీరం వెలుపలా అని కాక సర్వత్రా సమానమైన ఉనికి కలిగి ఉంటాడు.  శరీరం అనే ఇరుకు గదిలో బందీ కాడు అతడు.  ప్రపంచంలో ఏదైన భగవత్సంబంధ మైన ప్రయోజనం ఇంకా ప్రస్తుత ఉపాధికి ఉందీ అని నిర్ణయించుకున్నంతా కాలం అతడా ఉపాధిని ఉంచుకుంటాడు. అటువంటి ప్రయోజనం తీరిన పిదప, ఇంక లోకసంగ్రహార్థం ఉపాధిని నిలిపి ఉంచవలసిన పని లేదు కాబట్టి యధేఛ్చగా దాన్ని వదిలేస్తాడు.  కర్మబంధాన్ని బలవంతంగా తెంచుకుని ఉపాధిని వదలాలీ అనుకోవటం‌ ఆత్మహత్య.  యోగికి కర్మబంధం లేదుకదా సిధ్ధి కలిగాక.

శుకయోగి ఇంకా ఇలా చెబుతున్నాడు. 


పరమాత్మ మీద సత్వమూ, రజస్సూ, తమస్సూ అనే‌ త్రిగుణాలకు పెత్తనం ఏమీ‌లేదు.  అలాగే పరమాత్మ మీద కాలానికీ  యేమీ  అధికారం లేదు.  అహంకారమూ, మహత్తత్త్వమూ, ప్రధానమూ కూడా పరమాత్మ మీద అధికారం చెలాయించ లేవు.  కాబట్టి పరమాత్మకు కంటే గొప్పదనం మరెక్కడా చూడ కూడదు.  అందుచేత పైన చెప్పిన గుణాలూ, అంహంకారాదులతో సంబంధం పెట్టుకోవటం వలనా, వాటిపై మనస్సు నిలపటం వలనా పరమాత్మను పొందలేము. అందుచేత పరమపదం అయిమ విష్ణుపదం మీద మనస్సు ఉంచి సత్పురుషులు పరమాత్మ ఐన విష్ణువును నమ్మి ఆశ్రయించి తమ మనస్సులను ఆయన పరమతత్త్వంలో విలీనం చేస్తారు. అలా వారు సంసారబంధాల్ని దగ్ధం చేసేస్తారు.  వారు తమ మనస్సుల నుండి సంసారానికి సంబంధించిని వాసనలు అన్నీ‌ నిర్మూలిస్తారు.

మహారాజా, ఇప్పుడు యోగాభ్యాసం ఎలా చేయాలో చెబుతాను విను అంటున్నారు శుకయోగి.  


సిధ్ధాసనంలో కూర్చుని అభ్యాసం చేయాలి. పాదం మడమతో మూలాధార చక్రానికి ఒత్తిడి కలిగించాలి.  ప్రాణవాయువులని ప్రాణాయామంతో నియంత్రిచాలి.  ఇలా చేస్తే ప్రజ్ఞకు చలనం కలుగుతుంది.  క్రమంగా దానిని నాభి, హృదయ, కంఠస్థానాలకు చేర్చాలి.  జాగ్రత్తగా దానిని అంగిలికీ, అక్కడ నుండి భ్రూమధ్యస్థానానికి చేర్చాలి.  కోరికలు అన్నీ వదలి నిశ్చలమైన మనస్సుతో ఒక ఘడియ కాలం అక్కడ దాన్ని నిలపాలి.  ఇలా చేస్తే సాధకుడికి దేహంతో సంబంధం తెగిపోతుంది.

అప్పుడు బ్రహ్మరంధ్రంలో ధారణ చేస్తే సాధకుడికి పరమాత్మతో అనుసంధానం కలుగుతుంది.  తన ప్రజ్ఞను అతడు పరబ్రహ్మం  యొక్క ప్రజ్ఞలో లీనం చేస్తాడు.

భౌతికమైన ఉపాధిని వదలాలా ఉండనివ్వాలా అన్నది యోగి తాను చేయవలసిన లోక సంగ్రహాన్ని ఉద్దేశించి నిర్ణయించుకుంటాడు. 

ఐతే ఈ‌ స్థితిలో యోగి ఇంద్రియాలతో ఏ‌సంబంధమూ‌ ఉంచుకోరాదు. ఇంద్రియ వాసనలు కూడా వెంటబెట్టుకుని శరీరాన్ని యోగి త్యజించినట్లైతే, ఆతడికి పరబ్రహ్మాను సంధానం అసంపూర్ణమే‌ అవుతుంది.  ఆలాంటి పరిస్థితి వస్తే, ఆ యోగి ఉత్తమస్థితిని ఒకదాన్ని పొందుతాడు కానీ, పరబ్రహ్మంలో లీనం‌ కాడు. వాసనా మాత్రంగా వెంట వచ్చిన ఇంద్రియాల కారణంగా వాళ్ళు అణిమాది అష్టసిధ్ధులూ పొంది, సిధ్ధులూ, ఖేచరుల లోకాల్లో తపస్సమాధి కొనసాగించి మహర్లోకమూ తద్వారా బ్రహ్మలోకమూ చేరుకుంటారు.  అలా వాళ్ళు  బ్రహ్మలోకంతో సహా లింగశరీరంతో సకలలోకాల్లోనూ‌ యధేఛ్ఛగా సంచరిస్తారు.  ప్రళయకాలం దాకా వాళ్ళు ఇలా సంతోషంగా సంచరిస్తారు. ప్రళయకాలంలో మాత్రం వీరు ప్రళయాగ్నిలో ముల్లోకాలూ దహించుకు పోతుంటే,  ఆ తాపానికి ఓర్వలేక బ్రహ్మలోకంలో ఉంటారు. 

లింగశరీరం అంటే తాను అన్న అహంకారం మాత్రమే ప్రజ్ఞగా మిగిలిన స్థితి. ఈ లింగశరీరం‌తో మిగిలిన జీవులు సమస్త బ్రహ్మాండంలోనూ ఎక్కడ కావా లనుకుంటే అక్కడ సంచరించ గలరు.  వారు కర్మఫలాలకి అతీతమైన స్థితి కలిగిన వారు.  కాబట్టి  దివ్యలోకాలన్నింటిలో కూడా విహరిస్తూ ఉంటారు.  ఐన, వాసనా రూపంగా ఇంద్రియాలు మిగిలి ఉన్న కారణంగా వాళ్ళు బ్రహ్మలోకం దాకానే చేరగలరు కాని దానికీ అతీతమైన పరబ్రహ్మను మాత్రం చేరుకోరు. 

దేహం ఉండగా ప్రజ్ఞ అనే జ్యోతితో ఊర్ధ్వయానం చేసిన ఫలంగా నిర్మలత్వం సంపాదించి నందు వలన వాళ్ళు లింగశరీరంలో హరిస్మరణ కలిగి ఉంటారు.  అందు చేత పరబ్రహ్మ నెరిగిన వారికి లభించే‌ మహర్లోకం చేరుకుంటారు.  ఇక్కడ ఉండే ఇటువంటి యోగులే తారకలుగా ప్రకాశిస్తారు.  ప్రళయకాలంలో ముల్లోకాలు నశిస్తాయి.  మూడులోకాలు అంటే, ద్రవ్యం, శక్తి, ప్రజ్ఞలు ఆధారంగా నిర్మితమైన భూలోకం, భువర్లోకం, స్వర్లోకం అన్నమాట.  ఇవి ప్రళయకాలంలో కాలగర్భంలో కలిసిపోవటాన్ని ఈ  మహర్లోక జీవులు వీక్షిస్తారు.  ఆ తాపం వారిని బ్రహ్మలోకం చేరేలా చేస్తుంది.

భూలోకంలో ఒక మనువు పరిపాలనా కాలాన్ని మన్వంతరం అంటారు.  బ్రహ్మగారికి ఒక రోజులో పగటి సమయంలో అలా పద్నాలుగు మంది మనువులు పరిపాలన చేస్తారు.  భూలోకంలో ఉన్నట్లుగా బ్రహ్మలోకంలో అకలి దప్పులూ, చావు పుట్టుకలూ, ముసలితనమూ మరణమూ వంటివి ఉండవు. అవన్నీ భౌతికమైన ద్రవ్యమూ, దానినుండి ఏర్పడిన మనస్సూ ఉండే భూలోకానికి మాత్రం సంబంధించిన వ్యవహారాలు.  విష్ణుపదాన్ని అనుసంధానం చేసుకోని జీవులు పడే వేదనలు బ్రహ్మలోకవాసుల గ్రహింపులోకి  వచ్చేవే.  విష్ణుధ్యానరతులైన ఇతర బ్రహ్మలోకవాసుల విష్ణుధ్యానానందాన్ని ఈ‌యోగులు గమనించి ఆనందించగలరు.   వాళ్ళకు భూలోకంలో‌ జన్మ ఎత్త వలసిన పని లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి