23, సెప్టెంబర్ 2013, సోమవారం

ద్వితీయస్కంధం: 18. బ్రహ్మ వివరించిన విష్ణుతత్వం.

ఈ విధంగా నారదుడికి బ్రహ్మగారు విరాట్పురుషుడి దివ్యవిగ్రహాన్ని గురించి వివరించిన తరువాత మరికొన్ని విషయాలు తెలియజేస్తున్నారు.

నారదా, ఈ‌విశ్వమే శరీరంగా అనంతశక్తి సంయుతుడైన భగవంతుని నాభికమలంలో నేను పుట్టాను.  నాకు యజ్ఞం చేయాలని కోరిక కలిగింది కాని దానికి తగిన సంభారాలు ఏమీ కనిపింలేదు.  అందుచేత భగవంతునే మనస్సులో నిలుపుకున్నాను.  అప్పుడు నాకు ఉపాయం తెలిసింది.

నా ధ్యానంలో నాకు విష్ణువు శరీరభాగాలే యజ్ఞభాగాలుగా దర్శనం ఇచ్చాయి.  అందులో యజ్ఞపశువులు, యజ్ఞవాటికలు, యూపస్థంభాలు, పాత్రసామాగ్రి,  ఓషధులు, నేయి, వివిధలోహాలు, వివిధకాలల్లో చేయవలసిన హోమాలు,  వాటికి సంబంధించిన సంప్రదాయాలు, సంకల్పవిధులు,  మంత్రాలు,తంత్రాలు, బ్రాహ్మణులు, దక్షిణలు మొదలైన మంగళకరమైన వన్నీ‌ నాకు విష్ణువు అనుగ్రహం వల్ల సమకూరాయి.

క. యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు
యజ్ఞేశుఁడు యజ్ఞకర్త యగు భగవంతున్
యజ్ఞపురుషుఁగా మానస
యజ్ఞము గావించితిం దదర్పణబుధ్ధిన్


భగవంతుడే యజ్ఞపురుషుడు. ఆయన దేహమే యజ్ఞస్వరూపం. ఆయజ్ఞానికి ఫలం అనుగ్రహించే వాడూ, యజ్ఞఫలితమూ ఆయనే.  


అప్పుడు పురోహితులు తమలో నున్న నన్ను చూచి సప్తతంతువనే యజ్ఞం నా చేత చేయించారు.

చ. మనువులు దేవదానవులు మానవనాథులు మర్త్యకోటి దా
రనయము వారివారికిఁ  బ్రియం బగు దేవతలన్ భజించుచున్
ఘనతరనిష్ఠ యజ్ఞముల గైకొని చేసిరి తత్ఫలంబు ల
య్యనుపమమూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందగన్


ఈ సప్తతంతువనే యజ్ఞంలో దేవతలు, రాక్షసులు, మనువులు, మనుష్యులు జన్మించారు.  వాళ్ళంతా తమకు ఇష్టమైన దేవతలనీ పూజిస్తూ రకరకాల యజ్ఞాలు చేసారు. ఎవరే విధంగా ఏఏ యజ్ఞాలు చేసినా వాటి ఫలితాలు అన్నీ కూడా భగవంతుడైన విష్ణువుకే చెందుతున్నాయి.

యజ్ఞతంత్రం అంతా భగవంతుడి స్వరూపమే. మనకు ఆ యజ్ఞతంత్రం లోనే ఇమిడి ఉండి ఆయన కనిపిస్తాడు.  కాని ఆయన కేవలం యజ్ఞాలతో మాత్రమే వ్యక్తం అయ్యే స్వరూపం కలవాడు కాదు.  ఆయన ఆది, అంతము, పుట్టుక, నాశము అనేవి లేని వాడు.  మనకు ద్రవ్యాదుల రూపంలో కనిపిస్తూ ఉన్నా వాటిని మనం కర్చు చేసినంత మాత్రానా తరిగే నిజస్వరూపం కలవాడు కాదు.  ఈ యజ్ఞాల స్వరూపం తానుగా ఉండటమే కాదు.  ఆ యజ్ఞాల ఫలం రూపం కూడా తానే ఐన వాడు. మనకు యజ్ఞఫలం ప్రసాదించేది ఆయన.  దేవతలందరి చేత ప్రస్తుతించబడే వాడు ఆ భగవంతుడే.  అందుచేత వాళ్ళంతా యజ్ఞాలు చేసారు.

క. అగుణుం డగు పరమేశుఁడు
జగములఁ గల్పించు కొఱకు జతురత మాయా 
సగుణుం డగుఁ గావున హరి
భగవంతుం‌ డనఁగ బరఁగె భవ్యచరిత్రా


భగవంతుడికి ఏ గుణాలు కూడా లేవు. రజస్తమో గుణాలూ‌లేవు. సత్వమూ లేదు. నిజానికి  ప్రపంచాన్ని నిర్మించటం కోసం ఆయనే గుణాల్ని సృష్టించాడు.  ఆ అవసరం నిమిత్తమే ప్రపంచాతీతమైన తన మాయ ఆధారంగా తానే ఈ త్రిగుణాల్ని గ్రహించి ఆ నిర్గుణుడైన హరి సగుణుడు అవుతున్నాడు. అలా సమస్తసామర్థ్యాలు, శక్తి సంపద, ఐశ్వర్యం కలిగి ఉండటం వల్లనే ఆ పరమాత్మ భగవంతుడనే నామధేయంతో పిలవబడుతున్నాడు.

క. విశ్వాత్ముఁడు విశ్వేశుడు
విశ్వమయుం డఖిలనేత విష్ణుఁ డజుం డీ
విశ్వములోఁ దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండున్


ఆయనకు ఈ‌విశ్వమే దేహం. ఈ విశ్వానికి అధిపతి కూడా అయనే.  ఈ‌విశ్వంలో అన్నిటా నిండి ఉన్నదీ ఆయనే.  అందరికీ‌ ప్రభువు ఆయనే.  ఆయనకు పుట్టుకే లేదు.  నిత్యం ఉన్నవాడు.  ఈ‌ సృష్టిలో తానుంటాడు.  అలాగే  ఈ సృష్టి అంతా ఆయనలో  ప్రకాశిస్తూ ఉంటుంది.

చ. అతని నియుక్తిఁ జెంది సచరాచభూతసమేతసృష్టి నే
వితతముగా సృజింతు బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ బార్వతీ
పతి లయమొందఁ జేయు హరి పంకరుహోదరుఁ డాదిమూర్తి య
చ్యుతుఁడు త్రిశక్తియుక్తుఁ డగుచుండును నింతకుఁ దాన మూలమై


నేను కేవలం ఆయన ఆజ్ఞ తీసుకుని ఈ‌ సృష్టిని చేస్తున్నాను. ఇందులో స్థావరాలు (కదలిక లేనివి, చెట్లు వగైరా) , చరములు (‌స్వయంగా కదలగలవి - పిపీలికాది మనుష్యపర్యంతమైన జీవులు) అన్నీ ఉన్నాయి.  ఎడతెగకుండా ఇలా సృష్టి చేస్తూనే ఉంటాను.  అంతవరకే నా కర్తవ్యం.  ఈ సృష్టి అంతా సవ్యంగా ఉండేటట్లు చూసుకునేది  విష్ణువు.  ఈ సృష్టికి కాలం తీరిన సమయంలో లయం చేసేది పార్వతీ పతి ఐన శివుడు. ఈ‌ వ్యవహారం అంతా సృష్టిస్థితిలయాలనే మూడు క్రియలకీ మూలకారణం ఐన మొట్టమొదటి తత్వం విష్ణువు ఇఛ్ఛప్రకారం సృష్టి నడుస్తూ ఉంటుంది.

నారదా, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇది. ఈ విష్ణువే అన్నింటికీ మూలకారణం . సమస్తసృష్టిలోనూ‌ తాను ఒక్కడుగా నిండి ఉండి అన్ని రూపాల్లోనికీ విస్తరించి ప్రవర్తిస్తూ ఉంటాడు.  కాబట్టి అయనను పరబ్రహ్మ అని అంటారు.

క. హరి భగవంతుఁ డనంతుఁడు
గరుణాంబుధి సృష్టికార్య కారణ హేతు
స్ఫురణుం డవ్విభు కంటెం
బరుఁ డెవ్వడు లేఁడు తండ్రి పరికింపంగన్


సృష్టికి కార్యమూ, కారణమూ‌ శ్రీహరియే కాని ఆయన కరుణ కంటే వేరే‌ ఏమీ లేదు.
 

సృష్టికి కారణం ఏమిటీ అని అడిగావు.  కార్యమూ అతడే, కారణమూ అతడే. అతడి సంకల్పం సృష్టి ఉండాలని. ఆయన కరుణ అనే ఒక మహా సముద్రం.  సముద్రంలో అలలు రావటం ఎలా సముద్రానికి సహజమో చూడు. ఒక అల  కొత్తగా ముందుకు తోసుకు వస్తుంది. మరలా వెనుకకూ‌ పోతుంది. ఇదంతా సముద్రానికి సహజం.  అలాగని పనిగట్టుకుని సముద్రం అలలను సృష్టించటం లేదు, మళ్ళించటమూ‌ లేదు. కేవలం దాని సహజ క్రియ అంతే. నారదా, అందుచేత సృష్టికి సంబంధించి కార్యకారణవ్యవహారం అంతా భగవంతుడే.

నారదా, ఇదంతా పరమసత్యం.  నిత్యం కుతూహలంగా హరిగుణాల్నే ధ్యానిస్తూ ఉండే నేను పలికేది సత్యమే కాని, నా వల్ల అసత్యం ఎలా కలుగుతుంది?  ఇలా నేను చెప్పుతున్నదాని సత్యాన్ని తెలుసుకుని జ్ఞానులు  సంతోషించి పొగడుతారు.  నా సర్వేంద్రియాల చాలనమూ శ్రీహరి కృపగా భావించే నా వలన నా హావభావాలు కాని వాక్కులు కాని పొరబడి అసత్యం ప్రకటించే అవకాశమే లేదు.  అందువలనే నా శరీరం జ్ఞాననికి ఆకరమైన వేదమై, ఇంద్రాది దేవతలచేత కూడా నిత్యం పూజించ బడుతున్నది. అవును, నిజానికి ఈ దేహం హరిసముధ్బవమే కాని అన్యం కాదు కదా!  ఆ దేవదేవుడి పాదపద్మాలు సంసారమహాసాగరాన్ని దాటిస్తాయి.  అవే సమస్త సంపదలకీ శుభాలకీ మూలం.  అటువంటి ఆ దివ్యపాదాలకి నా నమస్కారం సమర్పిస్తున్నాను. 

ఉ.  ఆ నళినాక్షునందనుఁడ నయ్యుఁ బ్రజాపతి నయ్యు యోగ వి
ద్యా నిపుణుండ నయ్యును బదంపడి మజ్జనన ప్రకార మే
యేను నెఱుం నవ్విభుని యిధ్దమహత్త్వ మెఱుంగ నేర్తునే
కానఁబడున్ రమేశపరికల్పితవిశ్వము గొంతగొంతయున్


నేను విష్ణుదేవుని కుమారుడిని.  సృష్టికర్తని.  యోగవిద్యానిపుణుణ్ణి.  ఇదంతా సత్యమే.  ఐనప్పటికీ, నా జన్మరహస్యం నాకే తెలియదు!  అటువంటిది, నాకు  ఆ విష్ణుదేవుడి మహాత్మ్యం తెలియటం సాధ్యమా?  ఆ భగవంతుడు నిర్మించిన విశ్వం గురించి నాకు కొంచెం కొంచెంగా మాత్రం తెలుసును.  అంతే!

ఓ మహర్షీ. ఎందుకయ్యా రకరకాల వాదాలు? ఆ భగవంతుడి మాయ యొక్క గొప్పదనం తానే వర్ణించలేడనుకో.  అంత దొడ్డది.  అలాంటి ఆయన మాయగురించి  దేవతలో, నేనో, శివుడో మామా జ్ఞానవిశేషంతో‌ తర్కించి తెలుసుకో గలమా చెప్పు?

అదేమీటి ఆ హరికే తన మాయ గురించి తానే పూర్తిగా తెలియదా , ఆయన సర్వజ్ఞుడు కదా, అనకు.  అనంతమైన ఆకాశాన్ని తన హద్దుల్ని గురించి అడిగితే ఏమి చెబుతుంది?  అలాగ, సర్వాంతర్యామికి తాను ఏమేరకు విస్తరించాడూ విశ్వంలో అన్న ప్రశ్నకూ జవాబు లేదు. ఆ మాత్రాన ఆయన సర్వజ్ఞతకు వచ్చిన లోటు ఏమీ‌ లేదు సుమా?  ఇక్కడ జవాబే లేదు కాబట్టి హరి కూడా ఏమీ సూటి జవాబు చెప్పలేడని భావం లోని చమత్కారం.

19, సెప్టెంబర్ 2013, గురువారం

ద్వితీయస్కంధం: 17. బ్రహ్మగారు వర్ణించిన విరాట్పురుషుడి దివ్యవిగ్రహం.

 బ్రహ్మగారు వర్ణించిన విరాట్పురుషుడి దివ్యవిగ్రహం ఎలా ఉన్నదీ శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన దాని శుకయోగీంద్రుడు శౌనకాదులకు నివివరిస్తున్నాడు.

ఏడు ఊర్థ్వలోకాలూ విరాట్పురుషుడి శరీరంలో మొలనుండి పైభాగం.
ఏడు అధోలోకాలూ విరాట్పురుషుడి శరీరంలో మొలక్రింది భాగం.
ఆ భగవంతుడి ముఖం నుండి బ్రాహ్మణులూ, బాహువుల నుండి క్షత్రియులూ, తొడల నుండి వైశ్యులూ, పాదాల నుండి శూద్రులూ జన్మించారు.

భూలోకం అయన నడుము చుట్టూ ఉన్న ప్రదేశం.
భువర్లోకం ఆయనకు నాభిస్థానం.
సువర్లోకం ఆయన హృదయం.
మహర్లోకం ఆయన వక్షస్థలం.
జనలోకం ఆయన కంఠం.
తపోలోకం ఆయన స్తనద్వయం.
సత్యలోకం ఆయన శిరస్సు.
ఇవి ఏడూ ఊర్ధ్వలోకాలు.

అతలలోకం ఆయన మొల దిగువభాగం.
వితలలోకం ఆయన తొడలు.
సుతలలోకం ఆయన మోకాళ్ళు.
తలాతలలోకం ఆయన పిక్కలు.
మహాతలలోకం ఆయన చీలమండలు.
రసాతలలోకం ఆయన పాదాల పై భాగం.
పాతాళలోకం ఆయన పాదాల అరికాళ్ళు.
ఇవి ఏడు అధోలోకాలు.

ఐతే మరి కొంత మంది లోకాల క్రమం వేరుగా సంక్షిప్తంగా చెబుతున్నారు.
భూలోకం భగవంతుడి అరికాళ్ళు.
భువర్లోకం భగవంతుడి నాభి.
స్వర్లోకం భగవంతుడి శిరస్సు.
ఇలా ఈ మూడు విభాగాల్లోనూ మొత్తం పదునాల్గు లోకాలూ ఇమిడి పోతాయి.
ఇక్కడ భూలోకం ద్ర్వవ్యమయ స్వభావం లది. భువర్లోకం శక్తిమయ స్వభావం కలది. స్వర్లోకం ప్రజ్ఞామయ స్వభావం కలది.

భగవంతుడి నోటి నుండి వాక్కూ, దాని అధిదైవతం ఐన అగ్నీ ఉద్భవించాయి.

భగవంతుడి ఏడు ధాతువుల నుండి ఏడు ఛందస్సులు పుట్టాయి.  చర్మం, రక్తం, మాంసం, మేదస్సు, ఎముకలు, మజ్జ, శుక్లము అనేవే ఆ ఏడు ధాతువులు.  రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, నరములు, మజ్జ, ప్రాణం అనేవే సప్తధాతువులని  కొందరి మతం.
ఆయన రోమాల నుండి ఉష్ణిక్ ఛందం పుట్టింది.
ఆయన చర్మం నుండి ధాత్రీ ఛందం పుట్టింది.
ఆయన మాంసం నుండి త్రిష్టుప్ ఛందం పుట్టింది.
ఆయన నరముల నుండి అనుష్టుప్ ఛందం పుట్టింది.
ఆయన ఎముకల నుండి జగతీ ఛందం పుట్టింది.
ఆయన మజ్జ నుండి పంక్తి ఛందం పుట్టింది.
ఆయన ప్రాణం నుండి బృహతీ ఛందం పుట్టింది.

భగవంతుడి రసనేంద్రియం (నాలుక) నుండి హవ్యాలూ , కవ్యాలూ అనే తరగని ఆహారాలు జన్మించాయి.  ఆయన రసనేంద్రియం నుండే తీపీ పులుపూ వగైరా షడ్రుచులూ, జీవుల రసనేంద్రియాలూ జన్మించాయి. ఆయన రసనేంద్రియం నుండి రసాధిపతి ఐన వరుణుడు జనించాడు.

హవ్యం అంటే యజ్ఞంలో దేవతలకి అగ్నిద్వారా అందించే ఆహారం.  కవ్యం అంటే శ్రాధ్దక్రియల్లో పితృదేవతకు సమర్పించే ఆహారం.

భగవంతుడి ముక్కు నుండి వాయుదేవుడు,అశ్వినీదేవతలూ  ప్రభవించారు. అన్ని విధములైన ప్రాణస్పందనలూ,  వాసన చూసే శక్తీ ఆ భగవంతుడి నాసిక నుండే వచ్చాయి.

భగవంతుడి ఛక్షువుల (కన్నుల) నుండి దేవలోకం, బ్రహ్మలోకం, తేజస్సూ, సూర్యుడూ, జీవుల కన్నులూ జన్మించటం జరిగింది.

భగవంతుడి చెవుల నుండి దిక్కులూ, శబ్దమూ, ఆకాశమూ, ప్రాణుల కర్ణేంద్రియాలు ఏర్పడ్డాయి.

భగవంతుడి శరీరం నుండే సమస్తమైన సంపదలూ, వస్తువులూ జన్మించాయి.

భగవంతుడి చర్మం నుండి  స్పర్శ, వాయువు పుట్టా.

భగవంతుడి రోమాల నుండి సమస్త వృక్షజాతీ పుట్టింది. అంటే యూపస్థంభం వంటి వృక్షసంబంధం కల సమస్త మైన యజ్ఞసామాగ్రి కూడా ఆయన రోమాల నుండే జన్మించింది.

భగవంతుడి గోళ్ళ నుండి శిలలూ లోహాలూ ఉత్పన్నం అయ్యాయి.

భగవంతుడి కేశముల నుండి మబ్బులు ఏర్పడ్డాయి.

మెరుపుతీగలు భగవంతుడి మీసాలు.

విష్ణుపరాక్రమం నుండే లోకక్షేమానికీ, లోకపాలకులకూ ఉత్పత్తి.

విష్ణుపాదాల నుండే ఉత్తమమైన వరాలు కలుగుతున్నాయి.

భగవంతుడి జననేంద్రియం నుండి  ప్రజాపతి, పర్జన్యుడు, శుక్రము, జలము,  సంతాన శక్తి,  చతుర్విధపురుషార్థములు, మనస్సుకు వినోదానందపు అనుభూతులు కలగటం జరిగింది.

ఆయన విసర్జనావయవం నుండి జీవులకి విసర్జనావయవమూ, యముడు, మిత్రుడు అనే దేవతల ఉదయమూ జరిగింది.

ఆయన ఆసనం నుండి మృత్యువు, హింస, ఆపద, నరకం జనించాయి.

భగవంతుడి వీపు నుండి అవమానం , అధర్మం, అజ్ఞానం , చీకటి కలిగాయి.

భగవంతుడి శరీరంలో నాడుల వలన ప్రపంచంలోని  నదీప్రవాహాలు పుట్టాయి.

పర్వతాలు ఆయన ఎముకలే.

భగవంతుడి గర్బగోళమే మూలప్రకృతికి ఆవాసం.  అదే  ప్రపంచంలో సముద్రం. అదే జీవులకు అన్నాశయం.

భగవంతుడి హృదయం నుండి మనోమయమైన లింగశరీరం కలిగింది.

ఇదీ బ్రహ్మగారు వర్ణించిన ఈశ్వరుడి విరాడ్విగ్రహం. ఇంకా ఆయన నారదుడితో ఇలా అన్నారు.

నాకూ శివుడికీ కూడా భగవంతుడి విరాద్విగ్రహమే నివాసస్థానం. నా పుత్రులైన నీవూ, సనక సనందనాదులకూ కూడా ఆ విరాడ్విగ్రహమే స్థానం.  ప్రపంచంలోని సత్యం, ధర్మం, బుధ్ది, తత్తజ్ఞానం అనే వాటికీ అదే నెలవైన చోటు.

మనుషులు, దేవతలు, పితృదేవతలు, గంధర్వాది దేవ జాతులు, అప్సరసలు, రాక్షసులు, పాములు  , ఏనుగులు, లేళ్ళు వంటి జంతువులు, సమస్త భూచరాలు, మేఘాలు, మెఱుపులు, నదులు, జలచరాలు, సముద్రాలు, నక్షత్రాలు, గ్రహాలు, వాటిలో ఉన్న సమస్త తేజస్సూ సంపదలూ, నువ్వూ, నేనూ, శివుడు అంతా విష్ణువు యొక్క విభూతిలో భాగాలే  కాని వేరు కాదు.  ఈ‌ బ్రహ్మాండం ఆయనలో ఒక  జానెడు భాగం అంత కొలత అనుకో.  విశ్వాన్ని నడిపించే కాలమూ, దానిలో ముందు గడచిన ప్రపంచాలూ, ఇప్పటి సృష్టీ, రాబోయే సృష్టీ అంతా విష్ణువులో భాగమే. ఇది చాలా  గహనమైన విషయం.  మన బుధ్ధికి అందేది కాదు.

క. మండలము లోన భాస్కరుఁ
డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర
హ్మాండము లోపన నచ్యుతుఁ
డుండి బహిరంతరముల నొగి వెలిగించున్


సూర్యదేవుడు ఆసూర్యబింబంలో ఉండి లోకాలన్నింటికీ వెలుగుని ప్రసాదిస్తున్నాడు. అదే పోలికగా, బ్రహ్మండంలో ఉండి విష్ణు బ్రహ్మాండానికి తన తేజస్సుని అందించి నడిపిస్తున్నాడు. అంతే కాదు, ఆయన బ్రహ్మాండంలో ఉండటానికి పరిమితం కాదు, బ్రహ్మాండం‌ బయటకూడా ఆయన తేజస్సు విస్తరించి ఉంది.

ఇది పరిమితమైన పోలిక. సూర్యుడు వేరు సూర్యబింబం వేరు. సూర్యబింబం సూర్యుడికి దేహం. దానిలో ఉన్న భగవంతుడి తేజస్సు పేరు సూర్యుడు. పోలిక ఇక్కడ అపాలి. సూర్యుడికి బింబం వినా ఉనికి చెప్పబడదు.  కాని ఈ బ్రహ్మాండం భగవంతుడి శరీరం కాదు. ఆయన నిజేఛ్ఛ చేత దాన్ని సృష్టించి లీలగా దానిలో ప్రవేశించాడు. ఈ  బ్రహ్మాండం, ఈశ్వర విభూతిలో ఒక అంశ మాత్రమే.  ఆయన బ్రహ్మండానికి పరిమితం కాక దాని వెలుపలా ఉన్నాడు.

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

ద్వితీయస్కంధం: 16. బ్రహ్మాండము నుండి విరాట్పురుషుడి ఆవిర్భావం.

బ్రహ్మగారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

నారదా, ఈశ్వరుడు మాయకు అధిపతి.  దాని సంగతి దాన్ని సృష్టించిన ఆయన కన్నా బాగా ఎవరికి తెలుసు మరి.  ఈశ్వరుడు మాయను సృష్టించటంలో ఆయన సంకల్పం అది తన క్రీడకు ఒక సాధనంగా ఉండాలని. కావాలనే ఆయన ఆ మాయతో సంబంధం పెట్టుకున్నాడు.  ఇది దైవ యోగం అన్నమాట. ఎందుకంటే సృష్టిలో ఇతరమైన వాటికి మాయతో సంబంధం కేవలం కర్మానుగుణంగా ఉంటుంది.  ఇది భగవంతుడు స్వయంగా ఏర్పరచుకున్న మాయా సంబంధం. ఇది చాలా ముఖ్యమైన విషయం.  ఈ‌ దైవయోగం లేకపోతే అసలు సృష్టే లేదు సుమా. అప్పుడు జీవులూ, కర్మమూ, జన్మచక్రమూ వంటివి ఏమీ ఉండేవే కావు.  ఈ దైవయోగం కారణంగా   కర్మస్వరూపుడైన జీవుడు, కాలము, స్వభావం  అనేవి ఏర్పడ్డాయి.  పరమాత్మ వీటిని విశేంగా వృధ్ధి చేయాలని సంకల్పించాడు.

ఈ మూడింటినీ‌ మనం లోకోక్తిగా కూడా చెబుతూ ఉంటాం చూడండి. కాలం కలసి వచ్చిందనీ/కలసి రాలేదనీ, ఫలానా వాడి స్వభావం అంతే అని, అంతా వాడి కర్మ అనీ ఇలాగ.  ఇవన్నీ మాయా జనిత మైన వ్యవహారాలు అన్నమాట.

ఈశ్వరుడు మహత్ అనే దాన్ని సృష్టించి దానిలో తన అంశను ప్రవేశపెట్టాడు. కొందరి మతంలో ఈశ్వరుడు మహత్తులో‌ ప్రవేశించాడు. ఇది అంత ఉచితంగా తోచదు.  ఎందు కంటే, శ్రీకృష్ణుడు స్వయంగా సమస్త సృష్టి యొక్క తేజస్సూ నాలో శతాంశం కూడా కాదు అని చెప్పాడు. దీనిని బట్టి సృష్టిలో భగవంతుడు తన అంశను మాత్రమే ఉంచాడనుకోవటం ఉత్తమం.  మహత్తుకు ఈశ్వరాంశ సంయోగం వలన కాలమూ, ఈ కాలం  నుండి త్రిగుణాలూ జనించాయి. ఈ త్రిగుణాలు అనబడే సత్వము, రజస్సు, తమస్సు, కాలం కారణంగా  వివిద నిష్పత్తుల్లో కలవటం కూడా సంభవించింది.  ఈ‌ త్రిగుణాల్లో మార్పుకి కారణం స్వభావం. (అంటే అవి నిలకడగా ఒకలా ఉండలేక పోవటం వాటి స్వభావం అన్నమాట). ఈ గుణాల్లో వివిధ వైషమ్యాల నుండే కర్మరూపమైన సమస్త సృష్టీ‌ ఏర్పడింది.

మహత్తత్త్వాన్ని భగవంతుడు ఆవేశించటం కారణంగా దానినుండి అహంకారం జన్మిస్తుంది. ముందుగా తమోగుణం ప్రాధాన్యత వహించి సత్వరజో గుణాలని విప్పారుకొనేటట్లు చేయటం వలన ఈ‌ అహంకారం ఏర్పడుతోంది. ఇది సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలని మూడురకాలుగా ఉంటుంది.  సాత్వికాహంకారం జ్ఞానశక్తి.  రాజసికాహంకారం ద్రవ్యనిర్మా ణం చేసే శక్తి. తామసికాహంకారం క్రియాశక్తి గా తెలుసుకోవాలి.

తామసికాహంకారం వలన పంచభూతాలు జన్మిస్తున్నాయి.  మొదట జన్మించినది ఆకాశం. దీని గుణం శబ్దం. అంటే ప్రజ్ఞకు గోచరించటం ఆకాశ గుణం.

ఆకాశం నుండి వాయువు జన్మిస్తున్నది. దీనికి  శబ్దము,స్పర్శ అని రెండు గుణాలు. ఈ వాయువే దేహములలో స్పందన కలిగించేది.  దీని వలన శరీరంలో ఓజస్సు, సహస్సు, బలము అనే శక్తులు కలుగుతున్నాయి.  ఈ వాయుభూతమే  శరీరంలోఇంద్రియాలకూ మనస్సుకూ కలయిక కలిగించేది.

వాయువు నుండి తేజస్సు పుడుతున్నది. దీనికి శబ్దము, స్పర్శము, రూపము అని మూడు గుణాలు.

తేజస్సు నుండి జలము పుడుతున్నది. దీని శబ్దము, స్పర్శము, రూపము, (రసము)రుచి  అనేవి నాలుగూ గుణాలు.

జలము నుండి పృధ్వి పుడుతున్నది. దీనికి శబ్దము, స్పర్శము, రూపము, రుచి, (గంధము)వాసన అనే ఐదూ గుణాలు.

ఇలా పంచభూతాలూ తామసాహంకారం నుండి జన్మిస్తున్నాయి.  తామసికాహంకారాన్ని భూతాది అంటారు.  అంటే  పంచభూతాలకూ ఇది మొదలు అన్నమాట.  మొదట గుణం పుట్టి తరువాత ద్రవ్యం జన్మిస్తుంది కదా. అలాగే తామసికాహంకారంతో మొదట పంచభూతాల గుణాలూ, ఆ పిమ్మట పంచభూతాలూ జన్మించాయని అర్థం చేసుకోవాలి.

రాజసికాహంకారం నుండి  మనస్సు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన బడే పది ఇంద్రియాలూ జన్మిస్తున్నాయి.  సాత్వికాహంకారం వలన  జన్మించిన ఈ క్రింది దేవతలు రాజసికాహంకారం వల్ల పుట్టిన ఇంద్రియాలకు అధిపతులు అవుతున్నారు,

మనస్సుకు అధిదేవత చంద్రుడు.
(చెవి) శ్రోత్రేంద్రియానికి అధిష్టాన దేవత దిక్కు.
(చర్మం) చర్మేంద్రియానికి అధిష్టాన దేత వాయువు.
(కళ్ళు) చక్షురింద్రియానికి అధిష్టాన దేవత సూర్యుడు.
(నాలుక) జిహ్వేంద్రియానికి అధిష్టాన దేవత ప్రచేతసుడు.
(ముక్కు) నాసేంద్రియానికి అధిష్టాన దేవతలు అశ్వినీ దేవతలు.
(చేతులు) హస్తములకు అధిష్టాన దేవత ఇంద్రుడు.
(పాదాలు) పాదములకకు అధిష్టాన దేవత విష్ణువు.
(విసర్జన) పాయువుకు అధిష్టాన దేవత మిత్రుడు.
జననేంద్రియాలకి అధిష్టాన దేవత ప్రజాపతి.
ఇంకా బుధ్ది, ప్రాణము అనేవి కూడా సాత్వికాహంకారం నుండే జన్మించాయి. ఈ బుధ్ధి అనేది అంతఃకరణ చతుష్టయంలో ఒకటి.

ఈ మూడు రకాల అహంకారాల్లో రాజసికాహంకారం సృష్టిలో సకలద్ర్వవ్యానికి మూలం. రాజసికాహంకారం సృష్టిలో సకలక్రియలకూ మూలమైనది. సాత్వికాహంకారం కేవలం జ్ఞానస్వరూపమైనది. వీటి నుండి,పంచ జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు, అధిష్టాన దేవతలూ పంచ భూతములు మనసు అన్నీ కలిపి 25 తత్త్వాలు ఏర్పడుతున్నాయి. 


ఇవన్నీ కలిస్తే శరీరం అనే స్థూల రూపం ఏర్పడుతుంది.  కాని అలా కలవటాని వీటికి  సామర్థ్యం సరిపోదు. ఆ కలయికకు తగిన శక్తిని భగవంతుడే సమకూర్చుతున్నాడు.  ఇప్పుడు ఇలా ఏర్పడిన ఆకారం ఒక అండంగా ఉంది.  దానికే‌ బ్రహ్మాండం అని పేరు.  పంచభూతాల్లో చలన శక్తి ఉన్న జలం దీన్ని ఆవరించింది. దీనికే  మూలజలం, ప్రకృతిజలం అని పేర్లు.  పరమాత్మ ఈ అండంలో ప్రవేశించి దానిని పగులగొట్టాడు. ఇలా ప్రవేశించిన పరమాత్మకే బ్రహ్మ అని సంకేతం. ఆయన ప్రేరేపించగా పగిలిన అండంలోంచి ఆవిర్భవించినది ఆ 25తత్త్వాలతో కూడిన ఆయన స్వరూపమే - దానినే విరాట్ స్వరూపం అంటాము.  ఇలా పంచవింశతి తత్త్వాలకీ జీవాన్ని ఇచ్చిన ఆయన స్వరూపం ఆధారంగానే మిగతా సృష్టి అంతా జరిగింది. ఈ బ్రహ్మాండం నుండి పుట్టిన సృష్టికి కూడా బ్రహ్మాండం అనే‌పేరు.

స ఏవ పురుషస్తస్మాదణ్డం నిర్భిద్య నిర్గతః
సహస్రోర్వఙ్ఘ్రిబాహ్వక్షః సహస్రాననశీర్షవాన్


పరమాత్మ ఇచ్చిన ప్రాణశక్తితో బ్రహ్మండం పగులగొట్టుకుని ఆవిర్భవించిన విరాట్ పురుషుడు అనంతమైన జ్ఞాన, క్రియా, ద్రవ్యశక్తుల  ప్రకటనంగా వచ్చాడు. ఈ విరాట్ పురుషుడినే సూత్రగర్భుడు అనీ అనిరుధ్ధుడు అనీ పిలుస్తారు.

నారదా, ఆ విరాట్ పురుషుడి దివ్యవిగ్రహం గురించి చెబుతాను విను అన్నారు బ్రహ్మగారు.


16, సెప్టెంబర్ 2013, సోమవారం

ద్వితీయస్కంధం: 15. నారదుడికి బ్రహ్మ బోధించిన సృష్టిరహస్యం

బ్రహ్మగారు సంతోషంగా ఇలా అన్నారు. 

క. రారా బుధులు విరక్తులు
గారా యీ రీతి నడుగఁగా నేరరు వి
స్మేరావహము భవన్మత
మౌరా నా విభుని మర్మ మడిగితి వత్సా


నాయనా, ఇప్పటిదాకా ఈ సృష్టిలోనికి ఎందరు జ్ఞానులూ విరాగులూ రాలేదు?  కాని ఇంతవరకూ ఈ‌ ప్రశ్నని అడిగిన వారు లేరు.  నువ్వు ఏకంగా నా ప్రభువును గురించి రహస్యం అడిగావు కదా!

బ్రహ్మగారు 'నా విభుని మర్మం' అన్నారు. బ్రహ్మకు పైన భగవంతుడు.  బ్రహ్మకు దిగువ చరాచర సృష్టి. జీవునిలో ఉండే నేను అనే ప్రజ్ఞనే సాత్వికాహంకారం అంటాం. ఈ‌ప్రజ్ఞాస్థితి యే బ్రహ్మలోకం - తనకూ తనకు అనుభూతం అయ్యే సకలచరాచర జగత్తునూ నిర్మించేది అదే. దీనికి పైనున్నది అంతర్యామి ఐన భగవంతుడు. ఈ నేను అనే భావనకు మూలం ఏది? దాని వెనుక ఉన్న శక్తి ఏది అన్న ప్రశ్నను సూచించేదే ఈ 'నా విభుని మర్మం' అన్న మాట అర్థం.  జీవుని అహంకారానికి మూలం ఐన స్థితికి చేరుకునే మార్గం చెప్పేదే ఆ మర్మం.  దానినే విద్య అంటాం. తద్విరుధ్ధమైన సర్వం అవిద్యయే.  ఈ విద్యను అందిచేది వేదం. ఈవిధంగా భగవం తుని తెలుసుకునే విద్యకే‌ భాగవతం అన్న సార్థకమైన పేరు.

శా. నానా స్థావర జంగమ ప్రకరముల్ నా యంత నిర్మింప వి
జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వాను సం
ధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము
న్నే నా యీశ్వరు నాజ్ఞఁ గాక జగముల్ నిర్మింప శక్తుండనే


నారదా, నాకు ఈ‌ లోకాల్ని నిర్మించే శక్తి ఎక్కడిది? వట్టిమాట. ఈ  జీవుల్నీ, నిర్జీవుల్నీ సృష్టించటానికి నాకు ఏమీ చేతగాక తడబడుతూ ఉన్నాను మొదట.  ఈ జగత్తును సమకూర్చేందుకు తగిన సంకల్పబలాన్నీ, శక్తియుక్తులనీ  ఈశ్వరుడే నాకు ఇచ్చాడు. అంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే చేసాను కాని నా ప్రతిభ ఏమీ లేదు.  మొదట నాకు చేయవలసినది ఏమో తెలియని స్థితి.  అలాగే ఫలానిది కావాలీ అని తెలియని స్థితి.  అటువంటి స్థితిలో ఉన్న నాకు ఎంతో ఉదారంగా నా ఈశ్వరుడు తగిన సామర్థ్యాన్ని ప్రసాదించాడు.

బ్రహ్మకుముందు ఈ  సృష్టి అనేది లేనే లేదు.  అందుచేత స్థావరాలూ లేవు జంగమాలూ లేవు. తొలుత భగవంతుడి చేత సృష్టించ బడినవాడు బ్రహ్మ. ఆయనకు సహజంగానే తాను ఏమి చేయాలీ అన్న ప్రశ్న ఉత్పన్నం అయింది.  ఈ‌ ప్రశ్నతో బాటే ఆయనకు , ఈ‌ ప్రశ్న ఎలా వచ్చిందీ, ఈ‌ ప్రశ్న కలిగేందుకు తనకు ఏది కారణం అయిందీ, ఈ‌ జ్ఞానానికి వెనుక నున్న శక్తి ఏది అన్న విషయాలపైన ఆలోచన కలిగింది. ఐతే వీటి వల్ల  తాను చేయవలసినదానిని గురించి స్పష్టత తెచ్చుకునేంత సమర్థత రాలేదు.

సాధారణంగా లోకంలో ఎవరికైన కర్తవ్యం గురించిన అవగాహన రెండు రకాలుగా వస్తుంది.  జన్మసిధ్ధమైన సంస్కారంతో వస్తుంది  లేదా ఇతరుల బోధ వలన వస్తుంది. పుట్టగానే బిడ్డకు తల్లిదగ్గర పాలు తాగాలి అన్న  జ్ఞానం జన్మసిధ్ధంగానే వస్తోంది కాని ఎవరో బోధించటం వలన రావటం లేదు కదా. ఈ జన్మసిధ్ధమైన జ్ఞానం కూడా రెండు రకాలు.  ఒకటి జాతి సహజమైనది. గుడ్డులోంచి బయటకు వస్తూనే నాగుపాము పడగ విప్పటం వంటిది. రెండవది జీవుడికి జన్మపరంపరగా వచ్చి సంస్కారం కారణంగా వచ్చే జ్ఞానం. ఈ‌ జన్మపరంపరాగతమైన సంస్కారం కారణంగానే కొందరు పిల్లలు పసితనంలోనే సంగీతచిత్రకళాదులో మంచి ప్రతిభ ప్రదర్శించటం వంటివి చూస్తుంటాము. జన్మసిధ్ధంగా వచ్చిన సంస్కారం ద్వారా కాక ఇతరుల బోధనతో వచ్చిన జ్ఞానం అనేది ఆ జీవుడిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేదిగా ఉంటుంది . జీవియొక్క సంస్కారానికి నప్పనిది ఐన బోధన ఆ జీవికి ఫలించదు కాబట్టి ఏ జీవికైన బోధతో వస్తున్న జ్ఞానం అనేది  ఆ జీవిలో బీజప్రాయంగా ఉన్న ప్రజ్ఞకు మెరుగుదిద్ది వృధ్ధి చేయటమే‌ అవుతున్నది.

బ్రహ్మకు వచ్చిన ఇబ్బంది ఏమింటంటే, ఆ యనకు పూర్వం సృష్టే లేదు కాబట్టి. ఆయనకా జన్మపరంపర లేదు.  ఆయనకంటే ముందుగా సృష్టిలో ఎవరూ లేరు కాబట్టి బోధించే వాళ్ళూ లేరు. అందుచేత జన్మాంతర సంస్కారంతో వచ్చే జ్ఞానమూ లేదు, బోధనతో వచ్చే జ్ఞానమూ లేదు. తానే‌సృష్టికి ఆద్యుడు కాబట్టి తాను ఫలాని జాతి వాడు కాబట్టి దానికి సహజమైన జ్ఞానము అంటూ కూడా లేదు.

ఇలా అన్ని విధాల అశక్తుడైన బ్రహ్మకు ఆయనను సృష్టించిన భగవంతుడే ఆదుకున్నాడు. ఆయనే ఎంతో దయతో బ్రహ్మ ఉనికికి అర్థమూ, ఆయన చేయవలసిన పనీ తెలియ జేసాడు. బ్రహ్మకు కర్తవ్యం ఐన సృష్టిని చేసే సామర్థ్యమూ ఆ ఈశ్వరుడే అనుగ్రహించాడు.

మ. అనఘా విశ్వము నెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండ నే
యిన చంద్రానల తారకా గ్రహగణం బేరీతి నా రీతి నె
వ్వని దీప్తిం బ్రతిదీప్త మయ్యె భువనవ్రాతంబు దద్దీప్తిచే
ననుదీప్తం బ నట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్


ఓ పాపరహితుడా నారదమునీ, ఈ‌ ప్రపంచం ఇలా ప్రకాశమానంగా ఉందంటే దానికి నా సమర్థత కారణం కాదు.  ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రమండలాలు అన్నీ బాగానే‌ ప్రకాశిస్తున్నాయి.  కాని వాటి వెలుగులు అన్నీఈశ్వరుడి ప్రకాశానికి నకళ్ళు మాత్రమే. ఈ సమస్త విశ్వాన్నీ ఈశ్వరుడి వెలుగు ఆధారంగానే సృష్టించాను. ఈ కనిపించే సమస్త మైన విశ్వప్రకాశమూ  ఏఈశ్వరుడి వెలుగులో అంశ మాత్రమే అవుతున్నదో ఆ  భగవ్వంతుడికి నేను నిర్విరామంగా నమస్కరిస్తున్నాను.

ఈశ్వరుడి విభూతిలో ఈ సృష్టి ఒక అంశ మాత్రమే.  అది వ్యక్తం కావటానికి భగవంతుడికి బ్రహ్మ ఒక ఉపకరణం మాత్రమే. గింజలో చెట్టు దాగి ఉంది.  అలాగని గింజను విభజించి చూస్తే ఆ చెట్టు కనబడదు. ఒక గింజ చెట్టుగా పరిణామం చెందటానికి వలసిన సమస్తమైన మూలద్రవ్యమూ  మూలశక్తీ ఆ గింజలో దాగి ఉంది. గింజ నాటిని వ్యక్తికి  ఆగామి కాలంలో ఆ చెట్టు యొక్క స్వరూపంపైన అవగాహన ఉండదు కదా. నాటటమే అతని పని.  అలాగే సృష్టి చేయటమే‌ బ్రహ్మపని. ఆ సృష్టి వికాసం ఎలా ఉండేదీ అన్నది ఆయనకు మించిన భగవంతుడి ఇఛ్చ యొక్క పరిణామం మాత్రమే‌ కాని బ్రహ్మ నిర్దేశించినది కాదు. బ్రహ్మ నిర్దేశించగలదీ కాదు. తన చేత భగవంతుడు ఏర్పరుస్తున్న సృష్టి ఇది అన్న అవగాహనతో బ్రహ్మ నిత్యం వినయంతో ఉంటాడు. ఆ  అద్భుతమైన సృష్టిని చూస్తూ ఆశ్చర్యానందాలతో భగవంతుడికినిత్యం నమస్కారం చేస్తునే ఉంటాడు.

బ్రహ్మగారు ఇంకా ఇలా అంటున్నారు.

మ. విను మీ యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి
గ్గున సంకోచము పొందు మాయవలనం గుంఠీభవత్ప్రజ్ఞచే
నను లోకేశ్వరుఁ డం మ్రొక్కు మతిహీనవ్రాతముం జూచి నే
ననిశంబున్ నగి ధిక్కరింతు హరి మాయాకృత్య మంచున్ సుతా


అబ్బాయీ, విను. ఈశ్వరుడైన హరి మాయను సృష్టించాడు. ఆ మాయ జీవుల్ని సమ్మోహపరచగలదు కాని ఈశ్వరుడి విషయానికి వస్తే ఆయన జోలికి పోవటాని సిగ్గుపడుతుంది. మాయవల్ల జీవుల బుధ్ధి మందగిస్తుంది.  వాళ్ళంతా ఈ‌ సృష్టిని నేనే చేస్తున్నానని భ్రమపడుతూ‌ఉంటారు. ఆ మతిహీనులు అలా అనుకుని మొక్కుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. ఆ స్తుతులకు ఏమీ‌ ఉప్పొంగకుండా, ఇదంతా హరిమాయ అనే జ్ఞానం కలిగి, వాటిని తిరస్కరిస్తూ ఉంటాను.

భగవంతుడికి సృష్టి చేయటానికి ఉపకరణంగా మాయను పుట్టించాడు. ఆ మాయ ఆధారంగా, ఒక క్రీడగా తానే వివిధమైన జీవులుగా ఈశ్వరుడు సృష్టిలో విస్తరించాడు. జీవుడి రూపంలో ఈశ్వరుడు దిగివస్తున్నాడు. మాయను గ్రహించిన ఈ‌ జీవరూప ఈశ్వరాంశకు జ్ఞానం కొరత పడుతున్నది.  ఇలా జీవుడికి స్వస్వరూపజ్ఞానం‌కొరత చేయటం మాయకు కర్తవ్యంగా ఈశ్వరుడే నిర్దేశించాడు తొలుత. జీవుడిగా ఉన్నది తన ప్రభువైనఈశ్వరుడే కాబట్టి మాయ సిగ్గుపడుతూనే ఆ కర్తవ్యాన్ని  నిర్వహిస్తుంది. వివిధమైన జీవులుగా వాటికి ఉనికి ఐన విశ్వంగా సృష్టిని ఈశ్వరుడు బ్రహ్మ చేత చేయిస్తున్నాడు. జీవులు మాత్రం కొంచెం మందబుధ్ధులు కావటం కారణంగా ఈ సృష్టి అంతా బ్రహ్మ చేస్తున్నాడూ అని భ్రమపడి, ఆ యనకు మొక్కుతూ ఉంటారు కాని ఈశ్వరుడు అసలు సృష్టికర్త అన్నది తెలుసుకోలేరు. బ్రహ్మకు సత్యం తెలుసుకాబట్టి జీవుల మొక్కులు చూసి నవ్వుకుంటూ ఉంటాడు. వాళ్ళ మొక్కులు తిరస్కరించి భగవంతుడైన విష్టువు మాయ ఇదంతా అన్న సృహ కలిగి ఉంటాడు. నిత్యం వినయంగా విష్ణువుకు నమస్కరిస్తూ ఉంటాడు.

కుమ్మరి వాడు సారె మీద కుండలు చేస్తూ ఉంటాడు. సారె గిరగిరా వేగంగా తిరగటానికి కర్రను వాడుతూ ఉంటాడు. సారె తిరగటానికి కనిపించే కారణం కుమ్మరి వాడి చేతిలోని కర్ర. కాని నిజమైన కారణం కుమ్మరి వాడు. కర్ర తనంత తానుగా సారెను తిప్పలేదు. అలాగే బ్రహ్మకూడా సృష్టికర్త అనే కుమ్మరి వాడి చేతిలోని కర్రవంటి వాడు అన్నమాట. సారె తిరగటంలో‌కర్ర గొప్ప  ఎంత? కుండలు తయారవటంలో వాటి అందచందాలలో కర్ర పాత్ర ఏముంది? అంతా కుమ్మరి వాడి సంకల్పంలో ఉంది. ఎవరైన ఆహా ఏం దొడ్డ కర్ర! ఎంత గొప్పగా కుండలు చేస్తోం అంటే ఎలాగుంటుంది?  ఆ  కర్రకే జీవం ఉంటే అది ఎలా నవ్వుకుంటుందీ?

ఇదే భాగవత సంప్రదాయానికి మొదలు. భగవంతుడిచేత నడిపించబడుతున్న సృష్టికి తాను ఒక ఉపకరణమూ, దానిలో కేవలం తానొక భాగమూ అన్న స్పృహ కలిగిన వాడు భాగవతుడు. అతడు ఆ స్పృహ కారణంగా సమస్తమైన సన్మానాలూ అవమానాలూ భగవదర్పణం చేసి నిర్మోహుడై ఉంటాడు.  ఇటు వంటి భాగవతులలో మొదటి వాడు బ్రహ్మ.

ఈ ఈశ్వర క్రీడ గురించి బ్రహ్మ ఇలా అంటున్నారు.

దేహం అనేది ఏర్పడ్డానికి ద్రవ్యాలు  భూమీ, నీరూ, నిప్పూ, గాలీ, ఆకాశం అనే పంచభూతాలు. జీవుడికి ఒక జన్మ ఎత్తి దేహం ధరించటానికి కారణం వాడు పోగుచేసుకున్న కర్మం. ఈ‌ కర్మలు కాలంలో ఫలిస్తున్నాయి.  దీనికి కారణం, కాలానికి పరిణామం చెందుతూ ఉండటం అనే దాని స్వభావం . కాలం యొక్క పరిణామంలో ఫలించి అనుభవానికి వస్తున్న కర్మల ఆధారంగా జీవుడు ఆ కర్మల ఫలాలని అణుభవిస్తున్నాడు.  ఈ   జీవుడు నిజానికి వాసుదేవుడే. కర్మల్ని ఫలింపచేసే కాలమూ వాసుదేవుడే. జీవుడు  అనుభవించే కర్మసముఛ్ఛయమూ వాసుదేవుని విభూతియే. పంచభూతాలూ వాసుదేవుని విభూతులే.  అంతా వాసుదేవుడే కాని తదన్యం‌ మరేమీ లేదు.

ఈ లోకాలన్నీ నారాయణుడే నియమిస్తున్నాడు. దేవతలంతా నారాయణుడిడ శరీరం నుండే పుడుతున్నారు. యజ్ఞమూ, తపస్సూ, యోగం, జ్ఞానం ఇవన్నీ నారాయణుడి ఆధీనంలోనే ఉన్నాయి. 


నారాయణపరా వేదా దేవా నారాయణాఙ్గజాః
నారాయణపరా లోకా నారాయణపరా మఖాః


నారాయణపరో యోగో నారాయణపరం తపః
నారాయణపరం జ్ఞానం నారాయణపరా గతిః


జీవుడిలో దేవుడున్నాడు. ఆయన సర్వాత్మకుడు - అందరిలోనూ‌ అన్ని జీవుల్లోనూ‌ ఉన్నాడు. సమస్తలోక వ్యవహారాలనూ ఆయన నిత్యం గమనిస్తూ ఉంటాడు.  ఆయన నన్ను సృష్టించాడు.  ఈ ప్రపంచాన్ని సృష్టిచేసే సామర్థ్యాన్ని ఆయనే నాకు దయతో ఇచ్చాడు.

ఈశ్వరుడికి  సత్వగుణమూ, రజోగుణమూ, తమోగుణమూ అనే త్రిగుణాల్లో ఏదీ లేదు. ఆయన నిర్గుణుడు. ఆయనే ఈ‌ మూడు గుణాలనీ సృష్టించాడు. ఈ‌ రజోగుణం ఆధారంగా సృష్టీ, సత్వగుణం ఆధారంగా స్థితీ, తమోగుణం ఆధారంగా లయమూ ఈ‌ ప్రపంచానికి ఆయనే‌కల్పిస్తున్నాడు.  తమోగుణం వలన జీవుడికి తాను కర్తను అన్న భావన కలుగుతున్నది.  ఆతడు చేసే క్రియాకలాపాలకు ఈ సత్వగుణం అనేది కారణం, రజోగుణం అనేది కార్యంగా పరిణమిస్తున్నాయి.  ఈ‌ త్రిగుణాల వలన ద్రవ్యరూపమైన పంచభూతాలు ఏర్పడుతున్నాయి. ఈ త్రిగుణాల కారణంగా జ్ఞానరూపులైన దేవతలు పుడుతున్నారు.  ఈ త్రిగుణాల నుండి క్రియాకలాపాలకు ఆధారమైన ఇంద్రియాలు ఏర్పడుతున్నాయి. ద్రవ్య,జ్ఞాన, క్రియా సంబంధంగా జీవుడికి స్థూల, సూక్ష్మ, కారణ  లింగశరీరాలు కలుగుతున్నాయి. (లింగం అంటే చిహ్నం, గుర్తు అని అర్థం.) ఈ లింగశరీరాలు ఏర్పరుచుకుని దేవుడే జీవుడౌతున్నాడు.

ఇలా జీవుడిగా ఉన్న స్థితిలో తాను నిజానికి ఈశ్వరుడినే అన్న 'నేను' అన్న ప్రజ్ఞ జీవుడికి ఉండదు. అలా 'నేను ఈశ్వరుడను' అన్న ప్రజ్ఞ ఉన్న వారికి తప్ప ఈ‌తత్త్వం ఇతరులకి గోచరించదు.

క. ఆ యీశుఁ డనంతుఁడు హరి
నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్
మాయకుఁ బ్రాణి వ్రాతము
కీ యెడలన్ లేద యీశ్వరత్వము సుతా
 


శ్రీహరి అనంతమైన విభూతి కలవాడు. సమస్త లోకాలకీ ఆయనే అధిపతి.  నాకూ, నీకూ ఆయనే అధిపతి.  అన్ని ప్రాణులకీ, వాటిని ఆడించే మాయకీ ఆయనే ఈశ్వరుడు కాని వీటిలో దేనికీ ఏవిధమైన స్వతంత్రతా లేదు.

నామరూపాత్మకమైన సమస్తమైన విశ్వమూ ఆ శ్రీహరి యొక్క అంశామాత్రమే. ఈ విశ్వంలో పిపీలికాది బ్రహ్మపర్యంతమూ అన్నిటిలో ఈహరి విభూతి నిండి ఉంది. ఈ చరాచరాత్మకమైన ప్రపంచాన్ని స్థూల దృష్టితో చూసి మాయ నడిపిస్తోందీ అనుకుంటారు.  కాని ఆ మాయకూడా శ్రీహరి విభూతియే.  కాబట్టి శ్రీహరి సమస్తవిశ్వానికీ అధిపతి.  వేరెవ్వరికీ స్వతంత్రమైన ప్రతిపత్తి లేదు.

11, సెప్టెంబర్ 2013, బుధవారం

ద్వితీయస్కంధం: 14. సృష్టి రహస్యాన్ని గురించి బ్రహ్మను నారదుడు ప్రశ్నించుట.

ఈ విధంగా భగవంతుణ్ణీ గురువునీ ప్రార్థించి  పరీక్షిన్మహారాజుతో శుకయోగి ఇలా అన్నాడు.  మహారాజా, నువ్వు ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్ననే పూర్వం  నారదమహర్షి బ్రహ్మగారిని అడిగాడు.  తనకు బ్రహ్మగారు చెప్పిన సమాధానాన్ని దయతో నారదమహర్షి నాకు చెప్పటం జరిగింది.  అది వివరంగా నీకు చెబుతాను విను.

మ. చతురాస్యుండవు వేల్పుఁ  బెద్దవు జగత్సర్గాను సంధాయి వీ
శ్రుతి సంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సం
యుతమై సర్వము నీ కరామలకమై యుండుం గదా భారతీ
సతి యిల్లాలఁట నీకు నో జనక నా సందేహముం బాపవే


నారదుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, అయ్యా నీవు చతురాస్యుడివి. ఈ లోకాల సృష్టిని సంధానించే వాడివి.  నీ ముఖములనుండే వేదసంహిత అంతా, శబ్దాలూ అర్థాలతో సహా అద్భుతంగా  ఉద్భవించింది. లోకంలో ఉండే సమస్త విజ్ఞానమూ నీకు అరచేతిలో ఉసిరిపండు లాగా విస్పష్టంగా ఉంటుంది ఎప్పుడూ.  వాక్కుకు అధిదైవతమైన సరస్వతీదేవియే నీకు భార్యగా ఉంది. అలాంటి, ఓ‌మహానుభావా నా సందేహాన్ని తీర్చవలసింది అని అడిగా.

ఇక్కడ నారదుడు బ్రహ్మగారిని చతురాస్యుడు అనటంలో ఒక విశేషం ఉంది. చతురాస్యుడు అంటే నాలుగు ముఖాలు గలవాడు అని అర్థం.  అలాగే చతురాస్యుడు అన్న చోట చతుర అన్న పదానికి నాలుగు అనే కాక చతురత కల అన్న అర్థం చెప్పుకుంటే చతురత కల ముఖాలు కలవాడు - కొంచెం వివరిస్తే, చతురత కల వాక్కు ఉన్నవాడు అని అర్థం తీయవచ్చును. వాక్కు యొక్క నాలుగు అవస్థలు ఐన పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగూ బ్రహ్మగారి నాలుగు ముఖాలని చెబుతారు.

అలాగే ఈ‌పద్యంలో కరామలకం (అరచేతిలో ఉసిరి పండు అనే సామెత) చెప్పబడింది. అమలకం అంటె ఉసిరికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. చ్యవనప్రాస అనేది అశ్వినీ దేవతలు చ్యవనమహర్షికి యౌవనం ప్రసాదించటం కోసం చేసి ఇచ్చిన ఔషధం. దీన్ని ఉసిరితో‌తయారు చేస్తారు.

శా. ప్రారంభాది వివేక మెవ్వఁ డొసగుం బ్రారంభసంపత్తి కా
ధారం బెయ్యది యేమి హేతువు యదర్థం బే స్వతూపంబు సం
సారానుక్రమ మూర్ణనాభి పగిదిన్ సాగించె దొక్కక్కప్పుడుం
భారం బెన్నడు లేదు నీ మనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా


ఓ సరస్వతీపతీ ఈ‌సృష్టిని చేయాలనే సంకల్పం  నీకు ఎవ్వరు కలిగించారు?  అలా సృష్టి చేయటానికి ఎటువంటివి నీకు అధారం అయ్యాయి?  ఈ సృష్టిని ఎందుకు నిర్మించాలని అనుకున్నావు?  ఈ సృష్టికి ప్రయోజనం ఏమిటి?  నీవు చేసిన ఈ సృష్టి యొక్క స్వరూపం ఎటువంటిది?  సాలెపురుగు గూడు కట్టినట్లుగా ఈ‌ సృష్టిని చేసుకుంటు పోతున్నావే?  ఐనా, ఏ విధమైన శ్రమా విసుగూ నీకు కలుగుతున్నట్లు తోచదు.  నీ జీవనం నిజంగా ఒక విచిత్రం, ఒక అద్భుతం.  ఇలాంటిది మరెవ్వరికీ సాధ్యం కాదు.

ఒక పని చేయాలంటే మొదట అలా చేయాలనే సంకల్పం కలగాలి.  అలా సంకల్పం కలగాలన్నా, దానికి ఏదో ఒక హేతువు ఉండాలి కదా? ఎవరికైనా, ఒక ఇల్లు కట్టుకోవాలనే సంకల్పం కలిగిందీ అంటే దానికి కారణం, తనకు ఒక శాశ్వతమైన నివాసగృహం అవసరం అన్న హేతువు ముందు కనిపించటం వంటిది అన్నమాట.  మనస్సు సంకల్పవికల్పాలు నిత్యం చేస్తూనే ఉంటుంది.  ఒక సంకల్పం ఎంత  సహేతుకమైనదైనా అది సుధృడం అయినప్పుడు కాని కార్యరూపం దాల్చదు. తగిన పరిస్థితులు కనిపించినప్పుడు మాత్రమే అణగి ఉన్న దైనా, కొత్తదైనా ఒక ధృఢమైన సంకల్పం  బయటకు వస్తుంది. నీవు ఇల్లు కట్టగలవు ముందుకు సాగు అని ప్రోద్బలం చేసే చోదక శక్తీ అవసరం. ఒక్కొక్కసారి ఆ చోదకశక్తియే మొదట సంకల్పాన్ని వెలికితీస్తుంది. ఇల్లు కట్టాలంటే మాట అనుకోగానే సరి కాదు కదా? బోలెడు వస్తువుల అవసరం ఉంటుంది. అలాగే ఇల్లు ఇలా ఉండాలీ అనే ఒక ప్రణాళిక కూడా ఏర్పరచుకొన వలసి ఉంటుంది.

ఇక్కడ బ్రహ్మగారు కనిపించే సృష్టికి మెదటి వాడు. అందుచేత ఆయనకు సృష్టి చేయాలనే సంకల్పాన్ని ఎవరు కలిగించారా అని నారదుడి కుతూహలం. అలాగే ఈ సృష్టికి పూర్వం ఎటువంటి వస్తుసంచయం కూడా లేదు కదా మరి సృష్టికి ఏమి అవసరం అయ్యాయీ, అవి బ్రహ్మకు ఎలా లభించాయీ అని మరొక సందేహం. సృష్టికి ప్రయోజనం ఏమిటీ అన్న  ప్రశ్న ఒకటి.  ఇల్లు కావాలీ అన్నప్పుడు దాని ప్రయోజనం స్పష్టం.  మరి సృష్టికి ప్రయోజనం ఏది?  అలాగే, ఈ సృష్టికి నిర్దేశించిన స్వరూప స్వభావాలు ఏమిటీ అన్నది మరొక ప్రశ్న.

సాలెపురుగుకి గూడు కట్టటం దాని జన్మ లక్షణం. అది దాని ఉనికికి అవసరం మరి. అందుచేత అది విసుగూ విరామం లేకుండా గూళ్ళు కడుతూనే ఉంటుంది. మరి బ్రహ్మగారూ విసుగూ విరామం లేకుండా ఈ సృష్టిని చేస్తున్నారు. బ్రహ్మగారికి సృష్టి చేస్తూ పోవలసిన అవసరం ఏమీటీ అన్నది  ప్రశ్న.  నిష్కారణంగా విసుగు లేకుండా శ్రమ అనుకోకుండా ఈ సృష్టిని  బ్రహ్మ ఎందుకు చేస్తున్నట్లు?

నారదుడు ఇంకా ఇలా అన్నాడు. నాకు తెలిసి నువ్వే ఈ సృష్టికి అధిపతిగా ప్రకాశిస్తున్నావు.  అది సత్యం కాని పక్షంలో నీ కంటే అధికుడు మరొకరు ఎవరున్నారు?  ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ సృష్టిని చేస్తున్నావు? ఈ జీవుల సమూహాలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? ఇవన్నీ దేనిలో లీనమై పోతున్నాయి?

ప్రస్తుతం కనిపిస్తున్నదీ, ఇంతకు ముందు కనిపించి ఇప్పుడు లయం ఐనదీ అయిన నామరూపాత్మకమైన సమస్త సృష్టీ నీ హృదయం నుండి వచ్చినదే కదా?  అందుచేత దీనికి నువ్వే కర్తవూ అధికారివీ అవుతున్నావు.  నువ్వు  అత్యున్నతమైన స్థితిలో ఉన్నావు.  అందుచేత నీ కన్నా గొప్పవాడు ఎలా ఉంటాడు?  అటువంటి నువ్వు ఏ ప్రభువు గురించి తపస్సు చేసావు? నాకు కూడా ఆయనను తెలుసుకునే‌ మార్గం  ఉపదేశించవా?

శా. అంభోజాసన నీకు నీశుఁడు గలం డం టేనిఁ దత్పక్షమం
దంభోజాతభవాండ మే విభుని లీలాపాంగ సంయుక్తిచే
సంభూతం బగు వర్తమాన మగు సంఛన్నం బగు దద్విభున్
సంభాషింపగ వచ్చునేఁ దలపఁ నే చందంబు వా డాకృతిన్


ఓ పద్మాసనా, బ్రహ్మదేవా! నీ కంటే గొప్పవాడు ఉన్నట్లైతే, ఆ మహానుభావుని కడగంటి చూపునుండి ఈ‌ బ్రహ్మాండం పుట్టి ఉండాలి. ఆయన కరుణచేతనే ఇది నడుస్తూ ఉండాలి. అలాగే ఆయన కటాక్షంలోనే ఈ‌బ్రహ్మాండం లీనం అవుతూ కూడా ఉండాలి. అయనను గురించి చెప్పగలవా? ఆయనను ఎలా స్మరించగలం? ఆయన ఎలా ఉంటాడు?

బ్రహ్మకు సృష్టి చేయటం అనేది కనుక ఆయనకు కర్తవ్యం ఐన పక్షంలో, బ్రహ్మకు ఆ కర్తవ్యాన్ని నిర్దేశించిన ప్రభువు వేరే ఉండాలి కదా? ఆయన అనుగ్రహం బ్రహ్మకు చేరి సృష్టికి సంకల్పం జరిగినప్పుడు బ్రహ్మకు ఆయన గురించిన జ్ఞానం ఉంటుంది కదా? అందుచేత, ఆ జ్ఞానం బ్రహ్మ నుండి నారదుడు గ్రహించాలని భావిస్తున్నాడన్న మాట.

ఓ బ్రహ్మదేవా, ఈ విషయం నాకు తెలియ జేయ వలసింది. దానిని నేను సంతోషంగా నా తోడి వారికి తెలియ జేస్తాను.  అప్పుదు వాళ్ళు కూడా ఈ సంసారప్రవాహంలో పడి కొట్టుకొని పోకుండా, ఆ పరమపురుషుడి జ్ఞానం పొంది తరిస్తారు.

నీకు  భూతమూ, వర్తమానమూ, భవిష్యత్తూ సర్వం చక్కగా తెలుసు.  వాటి అన్నింటికీ నీవు అధిపతివి.  నీకు తెలియంది ఏమీ ఉండే అవకాశమే లేదు. ఈ‌ విశ్వం యొక్క విధానం అంతా దయచేసి ఉపదేశించ వలసింది.

ఇలా నారదుడు అడిగితే బ్రహ్మగారి ముఖం ఆనందంతో వికసించింది.

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

ద్వితీయస్కంధం: 13. శుకయోగి చేసిన దైవ ప్రశంశ.

పరీక్షిన్మహారాజు భగవంతుడి సృష్టిని గురించి గుప్పించిన ప్రశ్నలు విని శుకయోగి ఏమీ కంగారు పడలేదు. పైపెచ్చు మంచి ప్రశ్నలు అడిగే శిష్యుడు లభించినందుకు చాలా సంతోషించాడు.  ఇటువంటి  చక్కని ప్రశ్నలకు మంచి జవాబు చెప్పాలని కుతూహలం చెందాడు.  జవాబు చెప్పటానికి పూనుకొనే ముందుగా ఆ మహాయోగి భగవంతుడైన శ్రీహరిని ఈ క్రిందివిధంగా ఎంతో గొప్పగా ప్రశంసించాడు.

మ. పరుఁడై యీశ్వరుఁడై మహామహిముఁడై ప్రాదుర్భవస్థానసం
హరాణక్రీడనుఁడై త్రిశక్తియుతుఁడై యంతర్గతజ్యోతియై
పరమేష్ఠిప్రముఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్తరమార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్
 


అన్నింటికీ ఆయన అతీతుడు. సమస్త విశ్వానికీ ఆయన అధిపతి. ఆయనకన్నా మహిమ కలవారు లేనేలేరు. సృష్టిస్థితిలయాలు మూడూ ఆయనకు ఒక ఆట.  ఇఛ్ఛా జ్ఞాన క్రియాశక్తులు మూడూ ఆయన స్వంతం. చరచరవిశ్వంలోపలా ప్రకాశించే చైతన్య జ్యోతి ఆయనే. ఆయన తేజస్సును బ్రహ్మాది దేవతా ప్రముఖులు కూడా తెలుసుకో లేరు. అటువంటి ఆ మహాత్ముడైన శ్రీహరికి, అయన నిజతత్త్వం  గురించిన విజ్ఞానం కోరి మొక్కుతున్నాను. 

ఆ శ్రీహరి తత్త్వం తెలుసు కోవాలంటే ఆయన అనుగ్రహంతోనే అది సాధ్యపడుతుంది. అంతే కాని జీవుడు తన స్వంత ప్రజ్ఞ చేత ఏమీ తెలుసుకోలేడు. అత్యంత ఉత్తమ జీవి అయిన బ్రహ్మకైనా సరే అది అంతుపట్టదు. నిజానికి జీవులతో సహా సమస్త విశ్వమూ ఆయన వెలుగులో ఒక భాగమే. ఏదైనా భాగం పూర్ణత్వం గురించి స్వయంగా ఎలా తెలుసుకుంటుందీ?

సజ్జనులు విధివశాన చేసిన పాపాల్ని నశింపజేసే శ్రీహరికి నమస్కారం.
అర్థకామాలని నమ్ముకుని దుర్జనులు చెలరేగకుండా ప్రపంచాన్ని రక్షించే శ్రీహరికి నమస్కారం.
ఈ ప్రపంచంలో చరాచరాత్మకమైన సర్వరూపాలలోనూ సంచరించే శ్రీహరికి నమస్కారం.
పరమహంసలైన మునీంద్రుల హృదయకమలాలలోప్రకాశించే శ్రీహరికి నమస్కారం.
సత్వగుణం ప్రధానంగా గలవాడికి నమస్కారం.

(సాత్వతులనే‌ యదుశాఖవారిలో శ్రేష్ఠుడుగా శ్రీకృష్ణావతారం ఎత్తిన శ్రీహరికి నమస్కారం.)
సకలకల్యాణగుణాలకూ ఆలవాలమైన శ్రీహరికి నమస్కారం.
పరమభక్తులకు బహుసులభంగా చిక్కే శ్రీహరికి నమస్కారం.
భక్తి లేని వాళ్ళకు తెలుసుకోవటానికి దుర్లభమైనవాడైన శ్రీహరికి నమస్కారం.
తన కంటే గొప్పవాడెవ్వడూ లేనివాడూ, తనతో మరెవరికీ పోలికే లేని వాడూ ఐన శ్రీహరికి నమస్కారం.
హద్దులేని ప్రభావం గల శ్రీహరికి నమస్కారం.
కేవలం‌ పరబ్రహ్మమే తానైన పరమేశ్వరుడు  శ్రీహరికి నమస్కారం.


భగవంతుడికి ఆసాధ్యం అంటూ ఏదీ ఉండదు. ఏవో కొన్ని పరిమాణాల్లో చిక్కుకుని ఉన్న సృష్టిలోని సమస్తానికీ ఆయా పరిమాణాల తాహతుకు మించిన సమస్తమూ అసాధ్యాలే.  కాని ఏ  పరిమాణానికీ అందక అన్నింటికీ అతీతంగా ఉండే భగవంతుడికి ఏ పరిమాణమూ ప్రమాణమూ కాదు అడ్డూ కాదు. అందుచేత ఇది కుదురుతుందా ఆయనకు అన్న ప్రశ్నే అసంగతం.  త్రిగుణాలూ ప్రకృతీ అన్నీ అయన ఏర్పరచినవే. వాటికి అతీతుడైన ఆయనకు ఆయా గుణాలలోనూ ఆగుణాలను కలిగి ప్రవర్తించే‌ప్రకృతిలోను చేరి విహరించటమూ అయినా వాటికి అతీతంగా స్వేఛ్ఛగానే ఉండటమే కేవలం లీలామాత్రమే. అయనను  గురించి తెలుసుకోవాలంటే కేవలం భక్తుడికి మాత్రమే సాధ్యం. పరమహంసలైన వారు అటువంటి భక్తిని ఆశ్రయించుకుని తమతమ హృదయాల్లో ఆయనను నిత్యం ఆనందంగా దర్శిస్తూ ఉంటారు. మిగత అందరూ గుణరూపాత్మకమైన ప్రకృతిలో పడి ఆయనను గ్రహించలేకుండా అజ్ఞానంతో ఉంటారు.

ఉ. ఏ విభు వందనార్చనము లే విభు చింతయు నామకీర్తనం
బే విభు లీల  లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో
షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు నే
నా విభు నాశ్రయించెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్


ప్రభువుకు నమస్కరించటం, పూజించటం, ఆయన నామజపం చేయటం, ఆయన అద్భుతమైన లీలాగాథల్ని పెద్దలవలన విని తెలుసుకోవటం అనేవి చాలా మంచి సంగతులు.  వీటి వలన పాపాలన్నీ‌ దూరం అవుతాయి.  అన్నిరకాల శుభాలు పరంపరగా కలుగుతాయి. ఇలా ఏ ప్రభువును గురించి పెద్దలు చెప్పుతున్నారో, పాపసమూహాల్ని నాశనం చేసేవాడూ, క్షేమదాయకం ఐన కీర్తనా ప్రభావం‌కలవాడూ అయిన ఆ ప్రభువుని నేను ఆశ్రయిస్తున్నాను.

ఆత్మసమర్పణ బుధ్ధితో భవవంతుని సేవించిన వారికి పాపనాశనం, జన్మరాహిత్యం అని భావం.

ఉ. ఏ  పరమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్
లోపలి బుధ్ధితో నుభయ లోకములందుల జడ్డుఁ‌  బాసి యే
తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు రే
నా పరమేశు మ్రొక్కెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్


ఇహంలో‌  సుఖం స్వల్పం. దుఃఖం‌ హెచ్చు. అలాగని పరలోకం స్వర్గంలో  సుఖం లావు అందామా అంటే అదికూడా గ్రుడ్డికన్నా మెల్ల మెరుగు అన్న చందమే కాని ఆక్కడా సుఖం స్వల్పమే.  అదీ‌ తాత్కాలికమైన సుఖమే కాబట్టి అది కాస్తా అంతమై పోతుందన్న దుఃఖంఅక్కడా తప్పట్లేదు. ఇలా ఉభయలోకాల్లోనూ‌ ఎక్కడా నమ్మదగిన సుఖం అనేది లేదు. అలాంటి ఇహపరాల్లో  సుఖం వెదుక్కుంటూ జీవితం వ్యర్థం చేసుకునే వాడు అక్షరాలా మంద బుధ్ధి. నిజానికి శాశ్వతమైన సుఖమూ‌శాంతీ అనేవి పరబ్రహ్మం యొక్క లక్షణాలు. ఇది తెలిసిన వాడే నేర్పరి. అంతర్దృష్టి కలవాడికి కాని ఈ‌ తెలివి రాదు.  అది కలిగిన వాడే నేర్పరి. ఆ నేర్పరులు అశాశ్వతాలైన ఇహపరాల కోసం శ్రమపడరు. పరబ్రహ్మాన్ని చేరుకుందుకు పరమేశ్వరుడి పాదాలు ఆశ్రయిస్తారు. ఆయన ఇహపరాలతో సంగం కారణంగా వచ్చే పాపాల పరంపరని నివారిస్తాడు. ఆయనను సంకీర్తనం చేయటం భద్రస్థితి (ఇంక మార్పులేని స్థితి - అంటే మోక్షం) కలిగిస్తుంది. అలా నేర్పరులైన మహాత్ములు ఏ పరమేశ్వరుడి పాదాలను భక్తితో సేవిస్తున్నారో నేనూ ఆ పరమేశ్వరుడికి మొక్కుతున్నాను.

చ. తపముల జేసియైన మఱి దానము లెన్నియుఁ  జేసి యైన నే
జపములఁ జేసి యైన ఫలసంచయ మెవ్వనిఁ‌జేర్ప కున్న హే
యపదములై దురంత విపదంచిత రీతిగ నొప్పుచుండు న
య్యపరిముతున్ భజించెద నఘౌఘ నివర్తను భద్రకీర్తనున్


తపస్సు చేసి, ఆ తపస్సు యొక్క ఫలితాన్ని ఈ‌శ్వరుడికి అర్పించకపోతే అదే ఒక బంధహేతువు అవుతుంది.  దాన ధర్మాలు చేసి వాటి వలనకలిగే ఫలితాల్ని ఈశ్వరుడికి అర్పించకపోతే అవి బంధహేతువులే అవుతున్నాయి. ఇలా మంచి పనులు కూడా ఈశ్వరార్పణ బుధ్ధిలేక పోవటం వలన అవి తప్పించుకోవటానికి వీలులేని దుష్ఫలితాలు ఇచ్చి ఆపదలను తెచ్చి పెడుతున్నాయి. అన్ని  ప్రమాణాలకూ అతీతుడైన భగవంతుడికి సమర్పించినవి మాత్రం , సమస్తమైన ప్రాపంచిక సంగాల రూపంలోని పాపాలనూ నివారిస్తున్నాయి, భద్రస్థితికి కారణాలు అవుతున్నాయి.  ఆ పరమేశ్వరుడిని భజిస్తున్నాను. 


భగవంతుడిని సమర్పించటానికి కాక తపస్సు దేనికోసం? ఏదో ఒకటీ ఆశించే కదా. ఆశ అంటే బంధహేతువే కదా. ఆలాగే దానధర్మాలూ  ఏదైన ఆశించే చేసినా ఆ అశాబంధం మోయక తీరదు. సరే కోరిన ఫలాన్ని తపస్సు ద్వారానో, దానాదులవల్లనో పొందాక ఆ ఫలాన్ని తాను అనుభవిస్తున్నాడు. ఒక్కొక్కసారి ఆ ఫలం మరుజన్మలో కలగవచ్చును. అనుభవించిన ఫలం ఎలాంటి దైనా సరే అది తృప్తి కలిగించటం వట్టి మాట. ఈ రోజున పేదవాడు వ్రతాలు చేసి ధనవంతుణ్ణి కావాలీ అని కోరుకున్నాడని అనుకుందాం. ఆట్టే ఆయువులేక, మళ్ళీ జన్మలో కోరిక తీరి డబ్బున ఆసామీగా పుడతాడు. జన్మలక్షణం పోదు.  ఇప్పుడు రాజయోగం కావాలీ అని వ్రతాలు చేయటం, గుళ్ళూ గోపురాలూ కట్టించటం, అన్నదానాలు చేయటం చేస్తాడు. మరుచటి జన్మలో రాజయ్యాక మరింతగా ఎదగాలీ చక్రవర్తిని కావాలీ లాంటి కోరిక కలగదా చెప్పండి.  అందుకే కోరికలు తీర్చటం వలన శాంతించేవి కావు అని తత్త్వవేత్తలు సెలవిస్తుంటారు. ఇలా ఆశామోహాలకు లోనై జన్మపరంపరలో చిక్కుకోవటమే దుష్ఫలితమూ ఆపదా అంటే. ఒక్కో జన్మలో కోరిన కోరిక మరు జన్మలో నో అదే‌జన్మలోనో తీరితేదాన్ని నిలబెట్టుకుందుకు తెగించి పాపాలూ చేస్తూ ఉంటారనీ మరచిపోకూడదు. ఇలా ఆపదలకు మేర ఏదైన ఉందా? అన్ని కష్టాలకీ మూలం కర్మఫలాల్ని ఈశ్వరార్పణం చేయకపోవటమే. ఈశ్వరార్పణం అయిన కర్మ వలన కలిగే ఫలితానికి బంధం కలిగించే శక్తి ఉండదు కదా.  అప్పుడు చివరికి శుభమే కదా!

మ. యవన వ్యాధ పుళింద హూణ కష కంకాభీర చండాల సం
భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి భా
గవతశ్రేష్ఠుల డాసి శుధ్ధతనులై కల్యాణులై యుందు రా
యవికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మ్రొక్కెదన్


వేదబాహ్యులైన యవనులూ, బోయలూ, పుళిందులూ, హూణులూ, కషులూ,  కంకులూ, ఆభీరులూ, చండాలురూ ; అలాగే ఇతర పాపజీవనులూ కూడా ఏ  శుభస్వరూపుణ్ణి సేవించటం ద్వారా భగవద్భక్తులతో చేరి శారీరకంగా పరిశుధ్ధులూ, మానసికంగా శుభప్రదమైన బుధ్ధీ కలిగి యోగ్యులై పోతున్నారో, ఆ నిర్వికారుడైన సమస్తసృష్టికీ కర్తయైన భగవంతుడిని నిరంతరంగా మొక్కుతున్నాను.

ఇక్కడ చాలా రకాలైన వేదవిరుధ్ధ జీవనం కలవారిని చెప్పటం చూడవచ్చును. వీళ్ళకు వేదజ్ఞానం లేదు కాబట్టి  వేదప్రతిపాద్యుడైన పరమేశ్వరుడి గురించిన జ్ఞానమూ ఉండదు. కాబట్టి అవి నీచ జన్మలూ అన్నారు.  భగవంతుడిని గురించిన స్పృహలేని వీళ్ళు చేసేవి అన్నీ‌ తమపొట్టకోసమే అయిన దుష్కార్యాలు అయినప్పుడు అవి పాపాలే అవుతున్నాయి.

అటువంటి వారికి కూడా ఏ‌కారణం వల్లనైనా సరే, ఈశ్వరుడి మీద గురి కుదిరిందా, ఇంక వాళ్ళు పవిత్రం ఐపోతున్నారు.  భాగవతులు అలాంటి ఈశ్వరస్పృహకల వాళ్ళని ఆదరిస్తారు. వారి వృత్తిజీవితాల కారణంగా వాళ్ళు వేదోక్త సంస్కారాలు కల శరీరాలతో కనిపించకపోవచ్చును.  కాని వాళ్ళ హృదయాల్లోకి భగవంతుడు చేరి కూర్చున్న కారణంగా వాళ్ళ దర్శనం, స్పర్శనం కూడా పరమపవిత్రమైనవి.  భగవంతుడి చేరికతో వాళ్ళ మనస్సులు పరమనిర్మలం ఐపోయాయి కాబట్టి వాళ్ళ చేష్టలూ‌ మాటలూ పరమకల్యాణప్రదాలు అవుతున్నాయి.

దీనికి ఉదాహరణగా వేదధర్మానికి ఆవల జన్మించిన వాళ్ళు మహాభక్తులు యోగివర్యులు ఎందరో మనకు దృష్టాంతాలుగా కనిపిస్తారు. కబీరు ముస్లిం మతస్థుడు.  మల పిచ్చమ్మ అస్పృశ్యురాలు జన్మతః.  కాని వాళ్ళు ప్రాతఃస్మరణీయులు కాదా?

మ. తపముల్ సేసిననో మనో నియతినో దానవ్రతావృత్తినో
జపమంత్రంబులనో శ్రుతిస్మృతులనో సద్భక్తినో యెట్లు ల
బ్ధపదుండౌ నని బ్రహ్మరుద్రముఖరుల్ బావింతు రెవ్వని న
యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుండౌఁ గాక నా కెప్పుడున్


ఆయన పదాలు మన మనస్సులకు ఎలా చిక్కుతాయీ?  తపస్సు చేస్తేనా లభిస్తాయా? మన మనస్సులోంచి అన్ని కోరికలూ తరిమివేసి దాని నియంత్రిస్తే లభిస్తాయా? మనం‌ నిష్ఠగా, దానాలూ వ్రతాలూ అదేపనిగా చేస్తూ ఉంటే లభిస్తాయా? పోనీ అత్యంత ప్రమాణాలూ జ్ఞానభాండాగారాలూ అని పేరున్న వేదాల్నీ శాస్త్రాల్నీ క్షుణ్ణంగా అధ్యానం చేస్తే అవి లభించే విధానం తెలుస్తుందా? ఇలాంటి పనులన్నీ‌ఫలితాలు ఇవ్వటం అనుమానమే అని కేవలం భక్తితో ధ్యానం చేస్తే ఆయన పాదాలు దొరుకుతాయా? ఇలా ప్రశ్నించుకుంటూ బ్రహ్మగారూ శివుడు మొదలైన మహాత్ములంతా ఎవరిని గురించి నిత్యం భావన చేస్తూ ఉంటారో,  ఆ మోక్షస్వరూపుడూ, కేవలం ఆత్మమూర్తి ఐన భగవంతుడు  నన్ను దయతో సులభంగా  అనుగ్రహించు గాక.

సమస్త వేద శాస్త్రాలూ కూడా మనశ్శుధ్ధికే.  సకల ఆచార సంపత్తీ‌దాన్ని సంపాదించటం కోసమే. అది భక్తితో లభిస్తున్నంత సులభంగా మరే ఇతర మార్గాల ద్వారానూ లభించటం లేదు. భక్తితో నిత్యం భగవంతుడిని ధారణ చేయటమే ఉత్తమోత్తమ మార్గం అని ఈ పద్యం నిష్కర్ష చేస్తోంది.

క. శ్రీపతియు యజ్ఞపతియు ప్ర
జాపతియున్ బుధ్ధిపతియు జగదధిపతియున్
భూపతియు యాదవశ్రే
ణీపతియున్ గతియు నైన నిపుణుభజింతున్


ఆయన లక్ష్మీ దేవికి భర్త. అయన సమస్తమైన యజ్ఞాలకీ అధిష్టాన దైవతం.  ఆయన ఈ  సృష్టికి ప్రజాపతి.  జీవుడి బుధ్దికి అయనే అధిపతి.  సమస్తవిశ్వానికీ ఆయన ప్రభువు.  ఈ  భూమికి ఆయనే రక్షకుడు.  యాదవులందరికీ ఆయనే దిక్కు.  ఆయన నైపుణ్యం వల్లనే సృష్టి నడుస్తోంది.  అటువంటి మహాత్ముడిని (శ్రీకృష్ణుణ్ణి) భజిస్తున్నాను.

ఇక్కడ శ్రీ అన్నమాటకు రూఢార్ధంగా నిత్యం చెప్పుకునే‌ లక్ష్మి అనే కాకుండా మోక్షం అని చెప్పుకోవటంతో మరింత పుష్టి కలుగుతుంది పద్యభావానికి.

మ. అణువో కాక కడున్ మహావిభవుఁడో యఛ్ఛిన్నుఁడో ఛిన్నుఁడో
గుణియో నిర్గుణుఁడో యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వ మా
ర్గణులై యే విభు పాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ
క్షణముం జేసెద రట్టి విష్ణుపరమున్ సర్వాత్ము సేవించెదన్


ఈ భగవంతుడు కేవలం దృశ్యమానం కావటానికి వీల్లేనంతగా అణు సూక్ష్మస్వరూపం ఉన్నవాడా? ఆయన మరెవ్వరికీ ఊహించటానికి కూడా సాధ్యం కానంత వైభవం కలవాడా?  దేశకాలాది పరిమాణాలచేయ విడివిడిగా తెలుసుకోవటానికి వీలైన స్వరూపస్వభావాలు కలవాడా? అలా వీలు పడని అఖండస్వరూపమా?  ఆయనలో త్రిగుణాలకు స్థానం ఉందా?  లేక త్రిగుణాలకూ అతీతమైన స్వభావంతో ఉంటాడా? ఇలా తత్త్వం ఆలోచిస్తూ మహా మహా విజ్ఞానులు కూడా ఆయన గురించి ఏమీ తెలుసుకోలేక చిన్నబోతున్నారు. చివరికి వాళ్ళంతా బుధ్ధిమంతులై ఆ పరమేశ్వరుని పాదపద్మాలను గొప్పగా భజన చేసి తత్త్వజ్ఞానం సంపాదించుకుంటున్నారు. ఆ సర్వాత్ముడూ, తనకంటె అధికం ఏదీ లేని వాడూ, భగవంతుడూ ఐన విష్ణువుని నేను  సేవిస్తున్నాను.

విభుడు అంటే అధిపతి కాబట్టి ఇక్కడ మహావైభవం అంటే అన్నింటికంటే గొప్ప ఆధిపత్యం సృష్టిమీద అని చెప్పుకోవాలి.

బ్రహ్మకు సృష్టి చేయగల బుధ్ధికుశలతని అందించాలని ఏ మహాత్ముడు సరస్వతిని పంపితే ఆమె ఆ బ్రహ్మను భర్తగా వరించి, ఆయనకు సృష్టి చేయగల బుధ్ధిసామర్థతలను అందించిందో, ఆ మహాత్ముడు నారాయణుని నేనూ సేవించటం మొదలు పెడుతున్నాను.

తాను స్వయంగా పరిపూర్ణుడైనా, పంచభూతాలను ఏర్పరచి, వాటినుండి సమస్త సృష్టినీ చేసాడు.  అంతేకాక ఆయన ఆ సృష్టిలోనే తాను ప్రవేశించి క్రీడిస్తున్నాడు.  పంచభూతాల నుండి ఐదు కర్మేంద్రియాలూ, ఐదు జ్ఞానేంద్రియాలూ, మనస్సూ  అని మొత్తం పదకొండు వ్యవస్థలను ఆయన చేసాడు. ఈ  పదకొండింటితో ఆయన జీవుల్ని  పుట్టించి, ఆయా జీవులలో ప్రవేశించీ, ఐనా వాటికి అతీతంగా వాటి బయటా ఉంటూ వినోదిస్తున్నాడు. ఆ మహాత్ముడు, శ్రీహరి ఇప్పుడు నా మనస్సులో నిలిచి అందమైన కుసుమాల వంటి వాక్కులను పలికించు గాక.  ఆ  సద్వాక్య ప్రసూనాల మకరందం రూపంగా ఆయన  తన లీలలు నా నోటి వెంట ప్రకటించు గాక. యోగసమాధి నిష్ఠగల మహాపురుషులు తమ గుండెలోపల నివసించే భగవంతుని  తెలుసుకొని పూజిస్తారు.  అలాంటి  మహాత్ములు ఏ భగవంతుని ముఖపద్మాన్ని ధ్యానం చేస్తూ, ఆ పద్మమకరంద మాదుర్యంతో ఈ ప్రకృతి భయం నుండి విముక్తులై తరిస్తున్నారో అలాంటి మహాత్ములలో తలమానికం ఐన వాడు, అజ్ఞానం అనే చీకటికి సూర్యబింబం వంటివాడు ఐన వేదవ్యాసమహర్షికి నమస్కరిస్తున్నాను.


9, సెప్టెంబర్ 2013, సోమవారం

ద్వితీయస్కంధం: 12. భగవంతుడి సృష్టి గురించి పరీక్షిత్తు ప్రశ్నలు.

పరీక్షిన్మహారాజుకు ఇలా శుకయోగి వివరించాడని సూతపౌరాణికుడు అక్కడ ఉన్న శౌనకమహర్షికీ తదితర ఋషులకీ చెప్పాడు. అప్పుడు శౌనకుడు సంతోషించి, బాగుందయ్యా! ఈ‌ మాటలన్నీ మోక్షార్థియైన భరతవంశశ్రేష్ఠుడు పరీక్షిత్తు ఎంతో‌ శ్రధ్ధగా ఆలకించి ఉంటాడనటంలో సందేహం లేదు. అప్పుడు ఆ విస్ణుభక్తుడైన రాజు శుకుణ్ణి ఇంకా ఏమేమి అడిగాడో చెప్పు.

క. ఒప్పెడి హరికథ లెయ్యవి
సెప్పెడినో‌ యనుచు మాకుఁ జిత్కోత్కంఠల్
గుప్పలు గొనుచున్నవి రుచు
లుప్పతిలల్ నీ‌ మనోహరోక్తులు వినగన్

ఇంకా ఏమేమి హరికథలు శుకుడు చెప్పాడో అని మాకు చాలా ఉత్కంఠగా ఉంది. నీ‌ సొంపైన వివరణంతో మాకు హరికథల మీద మనస్సులో ఆసక్తి మరింత పెరిగిపోతోంది.

అంటే, సూతుడు, అవునయ్యా, ఈ‌ పరీక్షిత్తుకి పుట్టు వెంట్రుకలు ముఖంమీద పడుతున్న వయస్సులోనే, తోటి చిన్న పిల్లలతో ఆటపాటలలో ములిగి ఉండే వయస్సులోనే, విష్ణుభక్తి అబ్బింది అన్నాడు.

ఈ పరీక్షిత్తు తల్లి కడుపులో ఉన్న రోజుల నుండే తన తల్లి నోట విష్ణు సంకీర్తనం వింటూ ఉండేవాడు. అది అతడికి పుట్టినప్పటి నుండే విష్ణుభక్తి కలగటానికి కారణంగా పరిణమించింది. 

ఇంకా శుకయోగి ఇలా అన్నాడు. ఏ పుణ్యాత్ముడు విష్ణుకథలు వింటూ విష్ణునామ సంకీర్తనం చేస్తూ ఉంటాడో వాడు ధన్యుడు.  ఎందుకంటే, మిగిలిన వాళ్ళ అయుర్దాయాల్ని  కాలం సూర్యోదయం సూర్యాస్తమయం అన్న మిషమీద అపహరిస్తూ ఉంటుంది.  సాధారణ సంసారి ఇది గ్రహించుకో లేక తన జీవితం ఏదో బహుదీర్ఘం అన్నట్లుగా భ్రమపడి జీవితం అంతా పనికిమాలిన పనులతో కాలక్షేపం చేస్తుంటాడు. డబ్బూదస్కం, పెళ్ళాం‌బిడ్డలూ, ఇళ్ళూతోటలూ‌ అంటూ దేవుళ్ళాడుతూ పేరాశలతో జీవించి చస్తాడు. అప్పుడు యమభటులు వచ్చి చావగొట్టి ఈడ్చుకు పోతుంటే, అప్పుడు కాస్త జ్ఞానం తెచ్చుకుంటాడు. అయ్యో పాపాలు చేస్తూ గడిపేసానూ,కొంచెం‌ పుణ్యం సంపాదించుకో లేకపోయానే అని విలపిస్తాడు.

అదీకాక,

సీ. అలరు జొంపములతో నభ్రంకషంబుల్ లై  
      బ్రతుకవే వనములఁ బాదపములు
ఖాదన మేహనాకాంక్షలఁ బశువులు
      జీవింపవే గ్రామసీమలందు
నియతిమై నుఛ్ఛ్వాస నిశ్శ్వాస పవనముల్
      ప్రాపింపవే చర్మభస్త్రికలులు
గ్రామసూకర శునకశ్రేణు లింటింటఁ
      దిరుగవే దుర్యోగ దీబవృత్తి
తే. నుష్ట్ర ఖరములు మోయవే యురుభరములఁ
బుండరీకాక్షు నెఱుఁగని  పురుషపశువు
లడవులందు నివాసములందుఁ బ్రాణ
విషయభరయుక్తితో నుంట విఫలమధిప

కొమ్మలూ, రెమ్మలూ, ఆకులూ, పువ్వులూ కలిగి అడవుల్లో చెట్లు బ్రతకటం లేదా?  నిత్యమూ తినటమూ, సంతానాన్ని కనటమూ తప్ప పని లేకుండా ఊళ్ళల్లో పశువులు జీవించటం లేదా?  కమ్మరి వాళ్ళ కొలిమితిత్తులూ చక్కగా లయప్రకారం గాలి పీలుస్తూ వదులుతూ కనిపించటం లేదా మనకి?  ఊరకుక్కలూ పందులూ కూడా నిత్యం దీనంగా ఇల్లిల్లూ తిరుగటం లేదా? ఒంటెలూ, గాడిదలూ ఎంతలేసి బరువులు మోసుకుంటూ తిరగటం లేదు?

భగవంతుణ్ణి ఎరగని వాడు పురుషరూపంలో ఉన్న పశువు. అంతే.  అలాంటి వాడు అడవుల్లో ఉన్నా ఊళ్ళల్లో ఉన్నా, ఇంద్రియసుఖాల కోసం‌ ప్రాకులాడుతూ తిరుగుతూ జీవితం వ్యర్థం చేసుకుంటున్నాడు.

అంటే, పుట్టటమూ, పెరగటమూ, సంతానం కనటమూ, ఆహారం కోసం పాకులాడ్డమూ వంటివి చేయటం అన్ని జంతువులకీ‌ సామాన్యమే. ఊపిరాడుతూ ఉన్నంత మాత్రాన చైతన్యం ఉందని అర్థం కాదు. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నారు.  అలాంటి నరుడి పుట్టుక పుట్టి తాను ఇతర జంతువులకన్నా ఏ విధంగా మిన్నగా బ్రతుకుతున్నాడూ అన్నది ముఖ్యం. విషయసుఖాలు జంతుధర్మం. మరి మనిషై పుట్టాక, చేయవలసింది ఏమిటీ? అయ్యా, ఈ‌ నరజన్మంలోనే మోక్షం గురించి ఆలోచించుకునే‌ అవకాశం భగవంతుడి దయవల్ల కలుగుతోంది.  దాన్ని సద్వినియోగం చేసుకోవటం అన్నదే ఈ జన్మకు ప్రయోజనం.  అందుచేత, భగవంతుడి గురించి ఎఱుక సంపాదించు కోవాలి. అది లేకపోతే వట్టి పురుషపశువు గానే మిగిలిపోతున్నాడు.

సీ. విష్ణుకీర్తనముల వినని కర్ణంబులు
      కొండల బిలములు కువలయేశ
చక్రి పద్యంబులఁ జదువని జిహ్వలు
      గప్పల జిహ్వలు గౌరవేంద్ర
శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు
      కేకిపించాక్షులు కిర్తిదయిత
కమలాక్షుపూజకుఁ గాని హస్తంబులు
      శవము హస్తంబులు సత్యవచన
ఆ. హరిపద తులసీద ళామోదరతి లేని
ముక్కు పందిముక్కు మునిచరిత్ర
గరుడగమను భజనగతి లేని పదములు
పాదపముల పాదపటల మధిప

విష్ణుకీర్తనం వినని చెవులన్నీ గొండ గుహల వంటివి.
విష్ణుకీర్తనం చదవని నాలుకలు వట్టి బెకబెకలాడే కప్పల నాలుకలు.
విష్ణుదర్శనం చేయని కళ్ళు నెమలి ఈకలలోని కళ్ళు.
విష్ణుపూజకు కలసిరాని చేతులు శవం చేతుల్లాగా నిష్ప్రయోజనం.
విష్ణుపాదాల మీద ఉండే తులసి పరిమళం తెలియని ముక్కు కేవలం పందిముక్కు.
విష్ణుసంకీర్తనం జరిగుతున్న చోట్లకు పోని కాళ్ళు చెట్ల మొదళ్ళ వంటివి.
ఓ మహారాజా, భగవంతుడైన విష్ణువు కోసం కాక అన్యప్రయోజనాలకి వెంపర్లాడే ఈ‌ శరీరమూ, దాని ఇంద్రియాలూ ఉండి ఏమి లాభం?

అంటే నరజన్మలో ఈ‌ శరీరానికీ, దాని ఇంద్రియాలకీ సార్థకత కలిగేది మోక్షం కోసం హరిని ఆశ్రయించి పని చేసినప్పుడే.  కాని పక్షంలో వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు.

సీ. నారాయణుని దివ్య నామాక్షరములపైఁ
      గరఁగని మనములు కఠినశిలలు
మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ
      మిళితమై యుండని మేను మొద్దు
చక్రికి మ్రొక్కని జడుని యౌదల నున్న
      కనక కిరీటంబు కట్టె మోపు
మాధవార్పితముగా మనని మానవు సిరి
      వనదుర్గ చంద్రికా వైభవంబు
ఆ. కైటభారిభజన గలిగి యుండని వాడు
గాలి లోన నుండి కదలు శవము
కమలనాభు పదముఁ గననివానిఁ బ్రతుకు
పసిఁడి కాయలోని ప్రాణిబ్రతుకు

నారాయణుడి దివ్యనామాలు వింటూ కూడా కరగని మనస్సులు బండరాళ్ళు.
నారాయణుడి కథలు వింటూ గగుర్పాటు చెందని, కళ్లవెంట ఆనందాశ్రువులు రాని మనస్సు ఒక పెద్ద మొద్దు.
నారాయణుడికి మొక్కని వాడి నెత్తిన ఉన్న కిరీటం ఒక కట్టెల మోపు.
నారాయణుడికి అర్పించని సిరిసంపదలన్నీ అడివిని కాచిన వెన్నెలలు.
నారాయణుడి సంకీర్తనం ఎరగని వాడు నడిచే శవం.
నారాయణుడి పాదదర్శనం లేని బ్రతుకు ఉమ్మెత్తకాయలో పురుగు బ్రతుకు.

బ్రతికి ఉన్నందుకు ఫలం, దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో ఉంది. నారాయణప్రాప్తి మీద ఇఛ్ఛలేని వాళ్ళు కాయల్లో పురుగుల్లా బతికి ఏం లాభం? నారాయణుడి కోసం స్పందన లేని జీవితాలు చైతన్యం లేని వస్తువుల్లాంటివి. వాళ్ళకు సంచితంగా అబ్బిన సంపదలన్నీ‌ కూడా వాళ్ళు తినితాగి వ్యర్థం చేసుకుంటున్నారు కాని నారాయణాంకితం చేసి ఉంటే అవి మోక్షసాధనకు పనికి వచ్చేవి.

ఈ విధంగా యోగిరాజు ఐన శుకుడు నిష్కర్షగా సెలవియ్యగానే, మహారాజు పరీక్షిత్తు హృదయంలో అత్యంత నిర్మలమైన స్థితి కలిగింది.  హరిసాన్నిధ్యాన్ని పొందాలనే ఆశ మరిన్ని కొత్త చిగుళ్ళు వేసింది. ఇంకా మనస్సులో ఏమూలనో దాగిఉన్న తానూ, తనవాళ్ళూ అన్న అహంకార మమకారాలు సమూలంగా తుడిచిపెట్టుకుని పోయాయి. జీవితం అంటే అందరికీ ఉండే ఆశా, మృత్యువు అంటే ప్రాణిసహజంగా జన్మసిధ్ధంగా ఉండే భయమూ వదిలి పోయాయి. చిత్తం సంపూర్ణంగా విష్ణువు వైపుకు తిరిగి స్థిరంగా నిల్చింది. ఇంకా ఏమాత్రం ఆయుశ్శేషం ఉందో అది విష్ణులీలలు వింటూ, వాటిని మననం చేసుకుంటూ గడపాలని నిశ్చయించుకున్నాడు.  తరువాత శుకయోగిని ఇలా అడిగాడు.

క. సర్వాత్ము వాసుదేవుని
సర్వజ్ఞుడ వైన నీవు సంస్తుతి సేయన్
సర్వభ్రాంతులు వదలె మ
హోర్వీసురవర్య మానసోత్సవ మగుచున్

వాసుదేవుడు సర్వజగత్తుకీ ఆత్మ. ఆయన విభూతి వైభవాన్ని నువ్వు స్తుతించి చెప్పగానే నాకు ఈ ప్రపంచం మీద ఉన్న సర్వభ్రాంతులూ వదిలిపోయాయి.  ఓ బ్రాహ్మణోత్తమా, ఇప్పుడు నా మనస్సుకు ఎంతో ఉత్సాహం కలిగింది.

సీ. ఈశుండు విష్ణుఁ డీ విశ్వ మే రీతిఁ
      బుట్టించు రక్షించు బొలియఁ జూచుఁ
బహుశక్తియుతుఁ డగుఁ‌ భగవంతుఁ డవ్యయుఁ
      డాది నే శక్తుల నాశ్రయించి
బ్రహ్మశక్రాది రూపముల వినోదించెఁ 
      గ్రమముననో యేక కాలముననొ
ప్రకృతిగుణంబులఁ బట్టి గ్రహించుట
      నేకత్వమున నుండు నీశ్వరుండు
అ. భిన్నమూర్తి యగుచుఁ‌బెక్కు విధంబుల
నేల యుండు నతని కేమి వచ్చె
నుండ కున్నఁ దాపసోత్తమ తెలుపవే
వేడ్క నాకు సర్వవేది నీవు

ఈ‌ ప్రపంచానికి సర్వాధికారి ఐన విష్ణువు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా సృష్టిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, అలాగే అంతం చేస్తున్నాడు?

భగవంతుడు సర్వశక్తులూ గలవాడూ, తన శక్తికి ఎన్నడూ తరుగుదల లేని వాడూ కదా! ఆయన ఏఏ శక్తులని ప్రయోగించి బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాల్ని వినోదంగా సృష్టిస్తున్నాడు?

భగవంతుడు ఒక్కసారిగా ఈ‌ సృష్టిని ప్రకటించాడా, లేక క్రమక్రమంగా సృష్టిని చేసాడా?

భగవంతుడు సృష్టి చేసే ఇఛ్ఛతో ప్రక్తృతిని గుణాలని కల్పించి, వాటిని ఉపయోగించి ఇన్ని రకాల రూపాలతో ఎందుకు ప్రకాశిస్తున్నాడు?

ఇలా చేయకపోతే ఆ భగవంతుడికి వచ్చిన లోటేమిటీ?

ఓ శుకయోగీంద్రా, మీకు అన్నీ‌తెలుసును.  దయచేసి చెప్పండి అని పరీక్షిత్తు వేడుకున్నాడు.

7, సెప్టెంబర్ 2013, శనివారం

ద్వితీయస్కంధం: 11. సకామ నిష్కామ సాధనలు

పరీక్షిన్మహారాజా నువ్వు ముక్తి కలిగే‌ మార్గం అని అడిగావు.  వేదం సద్యోముక్తి, క్రమముక్తి అని రెండు విధాల మార్గాల్నీ చెబుతోంది. ఈ‌ రెండు మార్గాలనూ పూర్వం‌ బ్రహ్మగారికి విష్ణుమూర్తి ఉపదేశించాడు.

మొదట భగవంతుడైన వాసుదేవుడి నుండి బ్రహ్మ జన్మించాడు. ఆయనకు విష్ణువు ఈ‌ ముక్తి మార్గాల్ని ఉపదేశం చేసాడు.  వేదంలో ఉండే మంత్రాలు గానం చేయబడుతాయి కాబట్టి వాటిని వేదగీతలు అని చెబుతారు. విష్ణువు యొక్క విరాడ్విగ్రహాన్ని పురుషసూక్తం చెబుతున్నది. అంతర్యామిత్వం సాధించటం గురించి ఈశావస్యాది ఉపనిషత్తులలోనూ విష్ణు సరస్వతీ సూక్తాల్లోనూ చూడవచ్చును. ఇలా విరాడ్విగ్రహాన్ని ధారణ చేసి ముక్తి సంపాదించటం క్రమముక్తి.  ప్రాణాదులను ఉపసంహరించి పాపంచిక సంగం విసర్జించి భక్తితో పరమాత్మలో ఐక్యం కావటం సద్యోముక్తి. 

మోక్షసంపాదనకు అనేక విధాలైన మార్గాలున్నాయి.  కాని అన్నింటికన్నా సులభమైనది భక్తి యోగం.  బ్రహ్మగారు ముమ్మారుగా వేదాన్ని విమర్శించి అన్ని విధానాలకన్నా భక్తియోగం గొప్పదని నిర్థారించుకుని విష్ణువుని భక్తితో ధ్యానం చేసాడు. తన అస్తిత్వాన్ని విష్ణువుకే సమర్పించి సమస్తమైన వికారాలూ నశించి విశుధ్ధు డయ్యాడు.

సమస్తమైన జీవులకూ ఈ విధానం పనికి వస్తుంది.  చూడు మహారాజా, ఈ‌ లోకం లోపలికి  వచ్చాక ప్రతి జీవి తన చుట్టూ తన దైన ప్రపంచాన్ని సృష్టించు కుంటోంది కదా? మళ్ళీఆసంసారకూపంలో చిక్కుపడి బయటకు రాలేక దిక్కు తోచక తన్నుకుంటోంది కదా? అందు చేత తన మనస్సుతో తాను కల్పించుకున్న ప్రపంచానికి తానే బ్రహ్మ అవుతున్న జీవుడు, ఆది బ్రహ్మ గారి లాగా విష్ణువును ధ్యానించి ఆయనలో తన ప్రజ్ఞను ధారణ చేసి తరించ వచ్చును.  అలా ధారణ చేసిన వాడి మనస్సు విష్ణుమయం అవుతుంది.  అతడికీ వికారాలన్నీ‌ నశిస్తాయి.

అందరు జీవుల్లోను 'నేను' అనే‌ ప్రజ్ఞగా దేవుడు ఉంటాడు.  తనకు బుధ్ధి అనే‌ ప్రజ్ఞావిషయంగా కనబడేది నిశ్చయంగా ఈ‌శ్వరుడే. ఈ బుధ్ధిని విష్ణువు యొక్క విభూతిగా భావించి ఆయననను భక్తితో ధ్యానించటం ఉత్తమం.  నిత్యమూ సేవించ దగిన వాడూ, నమస్కరించ దగిన వాడు విష్ణువే అని తెలుసుకోవాలి.  సకల సృష్టిలోని జీవులందరి లోపల ఉన్నదీ ఆయనే.  ఈ‌ సృష్టికి నియమాలు ఏర్పరచి నడిపేదీ ఆయనే. ఇక్కడ జరిగే సమస్తమూ ఆయన లీలా విశేషమే. కనిపించే సమస్తమూ ఆయన విభూతి విశేషమే.  అందు చేత విష్ణుకథల పట్ల ఆసక్తి గలిగి ఆయనను నిత్యం భావించుకుంటూ విష్ణుమయమైన దేహమూ, ఇంద్రియాలూ , మనస్సులతో సంచరించిన వాడికి చివరికి ఆయన సాన్నిధ్యం లభిస్తుంది.  ఇదే‌ మనిషి జన్మ ఎత్తిన వాడు చేయవలసిన నిత్య సాధన.  ఇలా నాకు ఇది అంటూ ఏదీ‌ ఎన్నడూ కోరకుండా ఇలా సమస్తమూ విష్ణుమయమంగా జీవించటమే నిష్కామ సాధన. 

ఐతే అందరికీ తగినంత పరిపక్వత సులభంగా రాదు.  కాబట్టి ఎంత వద్దనుకున్నా కోరికలు కలగటమే వాటిని పొందేందుకు ప్రయత్నించటమూ తప్పదు.  అది కూడా సాధనకు ఉపయోగించు కోవటమే సకామ సాధన.  దాని విషయం చెబుతాను విను.  దీనిలో విషయం ఏమిటంటే కోరికలు కలిగాక వాటిని ఈశ్వర విభూతుల యందు ధారణం చేసి సిధ్ధింప జేసుకోవటం అనేది విధానం.


కోరిక
ఉపాస్య విభూతి
సంతానం
ప్రజాపతి
భోజనం
అదితి
స్వర్గం
ఆదిత్యులు
రాజ్యం
విశ్వేదేవతలు
పజాక్షేమం
సాధ్యులు
సంపదలు
దుర్గ
అధికారం
అగ్ని
వివిధ వస్తువులు
వసువులు
ప్రతాపం
రుద్రుడు
దీర్ఘాయువు
అశ్వినీ దేవతలు
దేహపుష్టి
భూదేవి
ప్రతిష్ట
భూమ్యాకాశ దేవతలు
సౌందర్యం
గంధర్వులు
స్త్రీలాభం
ఊర్వశి
సర్వాధిపత్యం
బ్రహ్మ
కీర్తి
యజ్ఞపురుషుడు
ధనసంచయం
ప్రచేతసుడు
విద్య
శివుడు
దాంపత్యసౌఖ్యం
ఉమాదేవి
ధర్మార్థకామాలు
విష్ణువు
వంశవిస్తరణ
పితృదేవతలు
రక్షణ
యక్షులు
బలం
మరుద్గణాలు
రాజరికం
మనువులు
శత్రునాశనం
కోణపాలుకుడనే‌ రాక్షసుడు
భోగాలు
చంద్రుడు


అలా కోరికకు తగిన దేవతలను ఆశ్రయించి ఫలితాలు పొందవచ్చును. 
ఐతే ఇలా కామ్యఫలితాలకోసం ఆశ్రయించ బడిన దేవతలు ఇచ్చే ఫలితాలు బంధవిముక్తికి తోడ్పడేవి కావు కాబట్టి, సరియైన మార్గం అంటె ఒకే‌ ఒకటి

క.  కామింపకయును సర్వముఁ
గామించియు నైన ముక్తిఁ గామించి తగన్
లో మించి పరమ పురుషుని
నేమించి భజించు దత్త్వనిపుణుం డధిపా

మహారాజా! ఏమీ‌ కోరికలు లేని వాడికీ,  అన్నీ‌ తనకు కావాలని ఆశపడే వాడికీ,  కేవలం ముక్తి ఒక్కటే తనకు ఆశ అని నిలబడ్డ వాడికీ అందరికీ‌ కూడా ఉత్తమోత్తమం ఐనది ఒక్కటే.  అది పరమపురుషుణ్ణే నమ్ముకోవటం అని తత్త్వజ్ఞుడు ఆయన్ను భజిస్తాడు.

నీకు కోరికలు లేవా పరమపురుషుణ్ణి నమ్మి ఉండటం మించి మరేమీ పని లేదు నీకు.  అది కావాలీ ఇది కావాలీ అన్న భ్రాంతి ఉందా? వాళ్ళనీ వీళ్ళనీ‌ ఎందుకు - పరమేశ్వరుడినే‌ అడుగు.  ఆయన నీ‌ అర్హతని విచారించి ఇస్తాడు, పుచ్చుకో.  ముక్తి ఒక్కటే‌ కావాలా,  అది పరమ పురుషుడికే చెప్పు.   ఈ విషయం గట్టిగా రూఢి చేసుకుని తత్త్వం‌ ఇదే‌అని బాగా తెలుసు కున్న వాడు నిశ్చయంగా పరమపురుషుణ్ణి నమ్మి నిశ్చింతగా ఉంటాడు అని శుక యోగి చెప్పాడు.

మ. అమరేంద్రాదుల గొల్చు భంగి కనుఁడా యబ్జాక్షు సేవింపఁగా
విమలజ్ఞానవిరక్తి ముక్తు లొదవున్ వేయేల భూనాథ త
త్కమలాధీశ కథాసుధారస నదీ కల్లోలమాలా పరి
భ్రమ మెవ్వారికి నైనఁ గర్ణయుగళీ పర్వంబు గాకుండునే

ఇంద్రాదుల్ని పూజించి నట్లుగా సర్వాంతర్యామి ఐన విష్ణువునే పూజించ వచ్చును కదా? ఇంద్రాదులేమి ఇచ్చినా అశాశ్వతం స్వల్పం. అదే విస్ణువును సేవిస్తే కలిగేది నిర్మలమైన జ్ఞానమూ, సంసారం పట్ల పూర్తి విరక్తీ, చివరకు మోక్షమూ.  విష్ణుకథామృతం అనేది ఒక దివ్య గంగాప్రవాహం. ఆ మహానదీ తరంగాల హోరు ఎవ్వరికైన వీనుల విందుకాదా?

ఇంద్రాది దేవతలని విధివిధానంతో పూజిస్తే వాళ్ళకు తగిన ఫలితం ఇచ్చి తీరాలనే నియమం ఉంది. కాని అవి స్వల్పాలూ అల్పాలూ ఐన ఫలితాలు.  విష్ణువును పూజించటం కాదు మనఃపూర్వకంగా నిత్యమూ సేవించాలి.  అలా చేస్తే అహంకార మమకారాలు తొలగి వైరాగ్యమూ ముక్తీ లభిస్తాయి.

5, సెప్టెంబర్ 2013, గురువారం

ద్వితీయస్కంధం: 10. సృష్టిక్రమం - 2

ఆ రూపంబునకుఁ గోటి యోజన విశాలం బైన యండకటాహంబు ప్రథమావరణం బైన పృథ్వి యగు.  దీనిఁ‌ బంచాశత్కోటి విశాలం బని కొందఱు పలుకుదురు.

విరాట్ స్వరూపానికి అనేక ఆవరణాల్లో మొదటి ఆవరణంగా భూమి ఉంటుంది.  ఇది కోటి యోజనాల విస్తీర్ణం‌ కలిగి ఉంటుంది.  కొందరు ఇది యాభైకోట్ల యోజనాల విస్తీర్ణంతో ఉంటుందని చెబుతారు.

విరాట్పురుషుని లోకం స్థూలంగా ఒక గ్రుడ్డు రూపంలో ఉంటుంది.  కాబట్టి దీనిని బ్రహ్మాండం అంటున్నాం.  నిజానికి దీని ఆకృతి ఒక పెద్ద పువ్వు యొక్క మొగ్గ లాగా పొరలు పొరలుగా ఉంటుంది అనుకోవచ్చు.  కటాహం అంటే డిప్ప.  ఇక్కడ కోటి అన్న పదం దూరాన్ని సూచించే‌ మాట కాదు.  కోటి అంటే అంచు. అలాగే యోజనం అంటే అతుకు. అంటే ఇక్కడ ఈ పృధ్వి అనేది బ్రహ్మండం‌యొక్క మొదటి పొర అనీ దానికి అంచులూ అతుకులతో మిగతా ఆవరణలు కప్పి ఉంటాయనీ అర్థం.  ఈ‌ అంచులు  యాభై అని కొందరు అనటంలో ఉద్దేశం విష్ణువు యొక్క విరాట్ విగ్రహంలోని యాభై వర్గీకరణలనూ సూచించటం అన్నమాట.

ఇయ్యావరణంబు మీద సలిల తేజ స్సమీర  గగ నాహంకార మహత్తత్త్వంబు లనియెడి యావరణంబులు క్రమంబున నొండొంటికి దశగుణోత్తరాధికంబులై యుండు.

ఈ భూమి అనే ఆవరణం (పొర) మీద జలమూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూ, అహంకారమూ,  మహత్తత్వమూ అనే పొరలు ఉంటాయి.  వీటిలో ప్రతి పొరకన్నా దాని పై పొర పది రెట్లు ఎక్కువ విశాలంగా ఉంటుంది.

ఇక్కడ
జలమూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూ అనేవి భూమి కాక మిగతా మహాభూతాలు.  వీటిని స్థూలభూతాలు అని కూడా అంటారు.

అట్టి యేడింటి మీదఁ బ్రకృత్యావరణంబు మహావ్యాపకం‌బగు.

ఈ ఏడు పొరల మీదా ప్రకృతి అనే పొర ఉంటుంది. ఇది అన్ని పొరలనూ కమ్మి ఉంటుంది.

ఏడు పొరలంటే, విరాట్ స్వరూపం పైన పంచభూతాల పొరలు ఐదూ, ఆపైన అహంకారమూ, మహత్తూ అనేవి రెండూ. వెరసి ఏడు పొరలు.  అన్నింటికీ పైన ఉండే‌ పొర పేరు ప్రకృతి.  అన్ని పొరలూ ఈ‌ ప్రకృతి అన్న పొరలోనే అణిగి ఉంటాయి.

బ్రహ్మాండబు భేదించి వైష్ణవపదారోహణంబు సేయువాఁడు

ఇట్లా ఉన్న బ్రహ్మాండాన్ని అతిక్రమించి ఆపైన ఉండే వైష్ణవ పదం దాకా ఎక్కి పోయేవాడి గురించి చెబుతున్నారు.

సాధకుడు ఈ‌ బ్రహ్మాండాన్ని అతిక్రమించి బయటకు వెళ్తేనే ఈ బ్రహ్మాండానికి ఆవల ఉన్న విష్ణుపదం చేరుకోగలడు. అంటే విష్ణు పదమే సర్వోన్నతం.  దానికి భిన్నమైన ఈ బ్రహ్మాండంలో ఉంటూ, దాన్ని వదిలి పెట్టకుండా సాధించేది ఏదైన సరే, ఈ‌ సాధకుడికి ఈ‌ బ్రహ్మాండంలో అనుభవించటానికి తగిన ఫలం ఇస్తుంది కాని విష్ణుపదాన్ని ఇవ్వలేదు.


నిర్భయుండై మెల్లన లింగదేహంబున పృథివ్యాత్మకత్వంబు నొంది

సాధకుడు నిర్భయంగా ఉండి, తన లింగశరీరంలో మొదట పృధ్వీ తత్వంగా తాదాత్మ్యం చెందుతాడు.

నిర్భయంగా ఉండటం అన్న మాట ఎందుకు వాడారూ? సాధకుడికి ఏ విధమైన సంశయం ఉండకూడదని చెప్పటానికే.  ఈ‌ యోగ విషయం ధారణ చేయటం అనేది గురువు దగ్గర అభ్యాసం చేయాలి.  ఇలాంటి గహన మైన విషయాలు మొదట్లో సాధకుడికి చాలా అనుమనాలు రేకెత్తిస్తాయి.  ఈ  సాధన వలన ప్రమాదం ఏమీ లేదు కదా? గురువుగారు గ్రంథావలోకనం చేసి చెబుతున్నారా?  ఆయనకు స్వానుభవం ఉందా?  సాధన సాగకపోతే ఏమి జరుగుతుంది?  సాధనానంతరం తాను ఈ‌ దేహాన్ని కలిగి ఉంటాడా అది పడి పోతుందా?  అసలు విష్ణుపదం చేరుకుంటే ఆ పిమ్మట ఏమి జరుగుతుంది?  ఇలా సవాలక్ష సందేహాలు వస్తాయి.  ఎక్కడ సందేహం ఉందో,  అక్కడ భయం తిష్టవేసుకుని కూర్చుంటుంది.  సంశయాళువు ఏమి సాధనచేస్తాడూ?  సాధన చేసేవాడు గురువుపట్లా, సాధనా క్రమం పట్లా, సాధనాఫలం పట్లా అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటి భయమూ ఉండకూదదు.

అలా నిర్భయంగా సాధన చేసి, మొదటగా పృధ్వీ తత్వంలో తాదాత్మ్యం చెందుతాడు.   ముందుగా భూతత్వం చెప్పటానికి కారణం అతడి లింగశరీరాని మొదటి ఆవరణం భూతత్వమే.

అదేమిటీ, విరాట్ విగ్రహానికి మొదటి ఆవరణం భూతత్వం అన్నారు కాని. సాధకుడికి అంటారేమిటీ ఇప్పుడు అని సందేహం తప్పకుండా వస్తుంది.  సాధకుడి ప్రజ్ఞాశరీరాన్ని పిండాండం అంటారు. దానినే లింగశరీరం అనీ అంటారని ఇప్పటికే చదువుకున్నాం.  సాధనలో బ్రహ్మాండానికీ పిండాండానికీ‌ సమన్వయం.  ఇది చాలా బాగా గుర్తు పెటుకోవాలి.

అందుచేత సాధకుడి తన ప్రజ్ఞలో మొదటగా పృధ్వీతత్త్వంతో మమేకం కావాలి.

అట్టి పృథివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, తేజోరూపకత్వంబున  దర్శనంబున రూపంబును, సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును అతిక్రమించిన

భూతత్త్వంలో ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన గంధాన్ని అతిక్రమించాలి.  జలతత్త్వంలో
ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన రుచిని అతిక్రమించాలి.   అగ్నితత్త్వంలో ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన రూపదర్శనాన్ని అతిక్రమించాలి.  వాయుతత్త్వంలో ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన స్పర్శని అతిక్రమించాలి.  ఆకాశతత్త్వంలో ప్రజ్ఞను నిలబెట్టి దాని రూపం ఐన శబ్ధాన్ని అతిక్రమించాలి.

భూమి వగైరా పంచభూతాలకూ పంచ సూక్ష్మభూతాలైన గంధాదులు ఉన్నాయి వాటి లక్షణస్వరూపాలుగా.  క్రమంగా ఈ‌ పంచభూతాల్లోనూ‌ ప్రజ్ఞని నిలబెట్టి ఆయా సూక్ష్మభూతాలని అతిక్రమించాలి.  అతిక్రమించటం అన్న మాట తరచుగా వాడుతున్నాం కదా.  అతిక్రమించటం అంటే వాటి మీద పూర్తి ఆధిపత్యం‌ చెలాయించటం అన్నమాట.

భూతసూక్ష్మేంద్రియ లయస్థానం బైన యహంకారావరణంబున సంప్రాప్తుండై

పంచభూతాలయొక్క సూక్ష్మమైన ఇంద్రియాలకి లయం చెందే స్థానం అహంకారం అనే‌ పొర.  దీన్ని చేరుకోవాలి.

మహాభూతాలైన భూమీ, ఆకాశం వంటి వాటిని ఐదింటినీ ఒక్కొక్కటిగా తన ప్రజ్ఞతో‌ స్వాధీనం చేసుకోవాలి.  వాటిని స్వాధీనం‌ చేసుకోవటం అంటే వాటి లక్షణాలైన గంధరసాది పంచసూక్ష్మభూతాలనీ జయించాలి.  వీటిని అన్నింటినీ అతిక్రమించిన సాధకుడు అహంకారం యొక్క ఆవరణం చేరుకుంటాడు.

అందు మనోమయంబును దేవమయంబును నైన సాత్త్వికాహంకార గమనంబున మత్తత్త్వంబు సొచ్చి

మనస్సుకూ దేవతలకూ ఆధారమైన  సాత్వికాహంకారాన్ని ఆశ్రయించుకుని మహత్తత్త్వంలో ప్రవేశించి.

మహత్తత్త్వం నుంచి మూడు రకాల త్రిగుణాలు ఆధారంగా మూడు రకాల అహంకారాలు పుట్టాయి. అవి సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలు.  తామసిక అహంకారం నుండి పంచతన్మాత్రలైన 
శబ్ద, స్పర్శ రస, రూప, గంధాలు పుట్టాయి.  వీటి నుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు పుట్టాయి. వాటి నుండి చర్మమూ, కళ్ళూ, చెవులూ, జిహ్వా, నాసికా అనే జ్ఞానేంద్రియాలూ, మనస్సూ పుట్టాయి.  రాజసిక అహంకారం నుండి ఇంద్రియాలు పుట్టాయి.  సాత్వికాహంకారం నుండి జ్ఞానేంద్రియాలకీ,  కర్మేంద్రియాలకీ  అధిష్టాన దేవతలైన ఇంద్రాది దేవతలు పుట్టారు. 

అహంకారం అనే ఆవరణ లోనికి చేరుకున్న సాధకుడు అక్కడ సాత్వికాహంకారాన్ని ఆశ్రయిస్తాడు. అలా అహంకారాన్ని అధిగమించి మహత్తును చేరుకుంటాడు.

గుణత్రయంబున లయించి
ప్రధానంబు నొంది

గుణత్రయంలో లీనమై  ప్రకృతిని పొంది

గుణత్రయం అంటే సత్వమూ, రజస్సూ, తమస్సూ అనే త్రిగుణాలు.  సత్వగుణం ఆధారంగా కల సాత్వికాహంకారాన్ని అధిగమించిన వాడు మొత్తం మూడు గుణాలనీ అధిగమించిన వాడయ్యాడు.  అప్పుడు త్రిగుణాలకీ‌ అధారమైన మూలప్రకృతిని స్వాధీనంలో‌నికి తెచ్చుకుంటున్నాడు.

ప్రధానాత్మకత్వంబున దేహంబును

ప్రకృతి ఆధారంగా ఏర్పడుతున్న శరీరంలో తన ఉనికిని జయిస్తున్నాడు.

అంటే,  జీవుడు శరీరంలో బంధించి ఉండబడటానికి కారణం ప్రకృతి.  ఈ‌ ప్రకృతికి వశంలో ఉన్నంత కాలమూ ఆ జీవుడు చేసే ప్రతి కర్మా త్రిగుణాలని ఆశ్రయించి వాటి కనుగుణమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది.  తాను కర్తను అన్న భ్రమలో ఉంటాడు జీవుడు.  దీన్నే‌ మాయ అంటాము. ఎప్పుడైతే త్రిగుణాత్మకం‌ ఐన ప్రకృతి వశంలోకి వచ్చిందో, అప్పుడు తాను కర్తను అన్న భ్రమ తొలగి పోతుంది.  బంధరూపంగా ఉన్న మాయ విడిపోతుంది.  జీవుడుగా శరీరం అతనకు ఆశ్రయంగా ఉండే స్థితిని అధిగమించా డన్నమాట.

ఉపాధి పరంపరావస్థానంబునం  బ్రకృతిం బాసి యానందమయుండై

ఇంక తనకు ఉపాధి పరంపర అనేది లేదు కాబట్టి,  ప్రకృతిని నుండి తప్పుకని కేవలం ఆనందమయుడుగా ఉంటాడు.

ఉపాధి పరంపరకి కారణం కర్మాను బంధం.  దానికి కారణం కర్తృత్వభ్రమ.  దానికి కారణం ప్రకృతి.  ఎప్పుడైతే ప్రకృతి విజయం కలిగిందో ఇంక కర్తృత్వమూ లేదు,  ప్రస్తుత ఉపాధితో‌ బంధమూ లేదు. కర్మబంధం లేదు కాబట్టి ఇంక రాగల ఉపాధులూ‌ ఉండవు.  ప్రకృతితో సంబంధమే‌ దుఃఖానికి కారణం. ప్రకృతితో సంబంధం లేకుందా ఉన్నాక ఇంక దుఃఖం ఎక్కడిదీ?  అనందమే ఆనందం.  తాను కేవలం ఆనంద స్వరూపుడే అవుతున్నాడు.

ఆనందంబునం‌ బరమాత్మరూపం బైన వాసుదేవ బ్రహ్మంబు నందు గలయును

ఈ  అనంద కారణంగా వాసుదేవుడితో‌ కలిసిపోతున్నాడు.  వాసుదేవుడు అన్నది పరమాత్మ స్వరూపం.

ప్రకృతిలయం ఐపోయాక ప్రపంచం నుండి విముక్తి దొరికాక, ఏర్పడే స్థితి అంటూ‌ ఏమీ‌ ఉండదు.  ప్రకృతి అంటేనే నామరూపాత్మకమైన ఉనికి.  తన ఉనికిని తానే వదిలి పెడుతున్నట్లేగా ప్రకృతిని వదిలేయటం అంటే.  ప్రకృతికి ఆవల ఉన్నది కేవలం ఒక్కటే తత్త్వం.  దానినే‌ పరబ్రహం అంటారు.  ఈ స్థితిని సాధించిన వాడిని సంకేతంగా వాసుదేవుడు అని చెప్పవచ్చు.

ఇదీ సృష్టి క్రమమూ  అలాగే సాధకుడి సృష్టినుండి విడివడి పరబ్రహ్మప్రజ్ఞను సాధించే విధానమూ అని శుకయోగి పరీక్షిత్తుకు చెప్పారు.  ఈ సృష్టిభేదన క్రమాన్ని ప్రశంసిస్తూ శుకయోగి

ఆ. పరమభాగవతులు పాటించు పథమిది
యీ పథమున యోగి యేఁగె నేని
మగిడి రాఁడు వాఁడు మఱి సంశయములేదు
కల్పశతములైన గౌరవేంద్ర

ఇలా ఈ పధ్దతిలో ఎవరు భగవంతుని ధారణ చేసి తెలుసుకుంటారో వాళ్ళను పరమ భాగవతులు అంటారు.  ఈ విధానంలో ముక్తి సంపాదించిన వాడు ఎప్పటికీ‌ తిరిగి సృష్టిలోకి రాడు.  కల్పం పూర్తయ్యాక కూడా తిరిగి రాడు. ఒక వంద కల్పాల కాలం పూర్తయ్యాక కూడా తిరిగి రాడు. ఓ పరీక్షిన్మహారాజా, ఈ విషయంలో ఏమీ‌ సందేహం‌ అక్కర్లేదు.

4, సెప్టెంబర్ 2013, బుధవారం

ద్వితీయస్కంధం: 09. సృష్టిక్రమం - 1

ఇప్పుడు శుకయోగి పరీక్షిత్తుకు సృష్టి క్రమాన్ని వివరిస్తున్నారు.

మఱియు నొక్క విశేషంబు గలదు.


ఇక్కడ  '
ఇంకొక విశేషం ఉంది'  అని చెప్పారు గదా? ఆ విశేషం యేమిటో చూద్దాం .  యోగాభ్యాసం చక్కగా చేసి అది ఫలించి సిధ్ధి పొందినవారు బ్రహ్మలోకం చేరుకుంటారు.  అలా బ్రహ్మలోకం చేరిన వారు లోకానుగ్రహం చేయటం కోసం శరీరధారణ చేసి భూమిమీదికి అప్పుడప్పుడు వస్తారు కాని వారికి యేవిధమైన కర్మబంధాలూ ఉండవు. కాబట్టి వారిని ప్రకృతి శరీరధారణకు నిర్బంధించ లేదు.  కానీ  యీ సిధ్ధులకు తమ దైన ఉనికి ఉండనే ఉంటుంది.  కాబట్టి అది కైవల్యపదం కాదు.  అయితే అటు వంటి  కైవల్యం అనబడే పరమాత్మునిలో లీన మయ్యే విశేష మైన వ్యవహారం కూడా ఉంది సుమా కేవలం బ్రహ్మలోకం పొందటమే అత్యున్నత మైన స్థాయి కాదు అని శుక మహర్షుల వారు పరీక్షిత్తుతో అంటున్నారు.


పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతు లైనవారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు.

బ్రహ్మలోకం చేరుకున్నఈ గొప్ప గొప్ప పుణ్యాత్ములు  అప్పుడు నడుస్తున్న కల్పం పూర్తి కాగానే వారి పుణ్యం యొక్క కొలతను బట్టి తగిన అధికార పదవులు పొందుతారు. 

పుణ్యాతిరేకం అంటే అమిత మైన పుణ్యం అని అర్థం. పుణ్యతారతమ్యం అంటే ఆ అమితమైన పుణ్యంలో కూడ యెంతో కొంత తర-తమ బేధం ఉంటుంది కదా. ఈ తర, తమ అనేవి ఇంగ్లీషులో  more and most  అనే comparisons.  ఈ లోకంలో మనుష్యుల అర్హతలను బట్టి యెలా గైతే అధికారాలను అప్పగిస్తామూ బ్రహ్మలోకంలో అయినా అలాగే జరుగుతుంది.  అందుచేత, బ్రహ్మలోకం చేరుకున్నఈ గొప్ప గొప్ప పుణ్యాత్ములు  అప్పుడు నడుస్తున్న కల్పం పూర్తి కాగానే వారి పుణ్యం యొక్క కొలతను బట్టి తగిన అధికార పదవులు పొందుతారు.  ఇక్కడ కొంతమందికి కల్పం అంటే యెంతకాలం అనే ప్రశ్న రావచ్చును,  కల్పం  అనేది  భారతీయ మైన  కాలమానంలో  ఒక అతిదీర్ఘ మైన సమయం. మనం  ప్రస్తుతం కలి యుగం  నడుస్తోందని చెప్పుకుంటున్నాం  కదా. కృత, త్రేత, ద్వాపర  కలి యుగాలని  యుగాలు నాలుగు. వాటి  కాలప్రమాణాలు చూడండి.

కృతయుగం    17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం    12,96,000 సంవత్సరాలు
ద్వాపరయుగం   8,64,000 సంవత్సరాలు
కలియుగం       4,32,000 సంవత్సరాలు

నాలుగు  యుగాలనూ‌ కలిపి ఒక మహాయుగం‌ అంటారు. మెత్తం 43,20,000 సంవత్సరా లన్నమాట.  మహాయుగాన్ని  దివ్యయగం అని కూడా అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే  అది బ్రహ్మకు  ఒక పగలు. దానినే సర్గము అనీ‌ కల్పము అనీ‌ అంటారు. మరొక 1000 మహాయుగాలు బ్రహ్మకు రాత్రి సమయం. దానినే  ప్రళయం కాలం అంటారు. ఇలా బ్రహ్మకు  ఒక రోజు పూర్తవుతుంది. ఇలాంటి రోజులు  360 గడిస్తే అది బ్రహ్మకు  ఒక సంవత్సరం. బ్రహ్మగారి ఆయుర్దాయం అటువంటి 100 సంవత్సరాలు.  ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారికి 50 యేళ్ళు  దాటాయండి.  ఆయనకు ప్రస్తుతం 51వ సంవత్సరంలో  శ్వేతవరాహకల్పం నడుస్తున్నది. ఇప్పుడు కల్పం‌  అనే దాని యొక్క  ప్రమాణం 432,00,00 ,000 సంవత్సరాలు అని  తెలుస్తున్నది  కదా.
 
ఇది నిస్సందేహంగా చాలా పెద్ద కాలమే.  దీన్ని బట్టి అర్థమయ్యేది యేమిటంటే,  యోగాభ్యాసం చక్కగా చేసి జితేంద్రియు లైన వారు బోలెడన్ని పుణ్య కార్యాలు చేస్తారు.  వాటి సహాయంతో వారికి బ్రహ్మలోకంలో ఉండే అదృష్టం పడుతుంది.  అదీ యెంతో దీర్ఘకాలం పాటు. ప్రస్తుతం నడుస్తున్న కల్పం ఇంకా యెంత కాలం మిగులి ఉందో అన్నాళ్ళూ వాళ్ళు బ్రహ్మగారి లోకంలో సుఖంగా ఉంటారన్న మాట.  ఆ తరువాత వారికి వారి యోగ్యతల ననుసరించి మంచి మంచి పదవులు వస్తాయి.

ఈ విషయాన్ని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు (అక్షరపరబ్రహ్మ యోగంలో)   ఓ అర్జునా బ్రహ్మలోకంతో సహా అన్నిలోకాలూ, యేది పొందినా, అది పునర్జన్మనిచ్చేదే. నన్ను పొందిన వాళ్ళకు మాత్రం  పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి స్పష్టం చేసాడు.


     ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున
    మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

కాబట్టి బ్రహ్మలోకం పొందిన మహాయోగులకూ తిరిగి కల్పావసానం కాగానే ఒక జన్మ అనేది కలుగుతుంది.  అయితే వారి పుణ్యఫలానుసారంగా మంచి అధికారయుత మైన జన్మ దొరుకుతుంది.


బ్రహ్మాది దేవతా భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు.

బ్రహ్మను తదితర దేవతలను పూజించి శరీరత్యాగం చేసిన వారు బ్రహ్మలోకం చేరుకుంటారు. వారు అక్కడ ఆ బ్రహ్మ ఉన్న న్నాళ్ళు స్థిరంగా నివాసం ఉంటారు. ఆ తరువాత వారికి ముక్తి కలుగుతుంది.

ఈ‌ వాక్యం సాధకులను, కొంత వేదాంత పరిజ్ఞానం కల వాళ్ళను తప్పకుండా తికమక పెడుతుంది. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు మొదలయిన పూజ్య దేవతలు ముక్తిని ఇచ్చే వారని చెప్పటం శృతిప్రమాణానికి విరుధ్దం. వారికి ఇష్టకామ్యార్థసిధ్ధిని అనుగ్రహించే సామర్ధ్యమే కాని మోక్షం అనుగ్రహించే సామర్థ్యం ఉందని చెప్పటం చెల్లదు. కాని మనం వివరణం చెప్పుకుంటున్న వాక్యం యొక్క అర్థం మరి వారికి అలా మోక్షం ఇచ్చే సామర్థ్యం ఉందని నొక్కి చెప్పుతున్నట్లుగానే ఉంది.

అసలు పై వాక్యంలోనే కావలసినంత గందరగోళం ఉంది. బ్రహ్మాను గాని తదితర దేవతలలో యెవరిని గాని పూజించిన వారంతా బ్రహ్మలోకం చేరుకుంటారూ అని కదా పై వాక్యం చెబుతోంది? కాని అదెలా సంభవం. ఉదాహరణకు ఇంద్రుని పూజించిన వారు చేరుకోవలసిన ఇంద్రలోకం అంటే స్వర్గం కదా? ఈ గీతాశ్లోకం తిలకించండి:

యాన్తి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాన్తి పితృవ్రతాః
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోఽపి మామ్

దేవతలను సేవించువారు దేవలోకములను చేరుకుంటారు.  పితృదేవతలను సేవించే వారు ఆ పితృదేవతల లోకాలను చేరుకుంటారు .  భూతప్రేతపిశాచాలను పూజించే వారికి అట్టి రూపమే కలుగుతుంది . (పరమాత్మ నైన)నన్ను సేవించే భక్తులు నన్నే చేరుకుంటున్నారు.

ఇక్కడ శ్రీకృష్ణపరమాత్మ నన్ను సేవించు భక్తులు నన్నే పొందుచున్నారని చెప్పటం  అంటే, వాళ్ళకి తనయందు లీనమై పోయి పునరావృత్తిరహితమైన మోక్షము సిధ్ధింస్తోందని చెప్పారని భావం. ఇతరమైన ఉపాసనలకు దొరుకుచున్న యే స్థాన మైనా మోక్షం కాదు కదా.  అలాంటి అన్య దేవతోపాసకులు ఆయా దేవతల లోకాలు చేరి వారివారి యిష్టదేవతలకు గల ఆయువు పర్యంతం వారితో నివసిస్తారని అర్థం.  ఇక క్షుద్రమైన ఉపాసనలకు ఫలితం దారుణంగా ఉంటుంది. వాళ్ళూ అలాగే భూతప్రేతపిశాచాలలాగా అయిపోతారు. యద్భావం తద్భవతి అన్నమాట.

కేవలం పరబ్రహ్మోపాసన వల్లనే మోక్షం వస్తుంది కాని ఇతరత్రా ఉపాసనల వల్ల రాదు గదా.  కేనోపనిషత్తులో ఉన్న యీ మంత్రం చూడండి

సా బ్రహ్మేతి హోవాచ
బ్రహ్మణో వా ఏతత్ విజయే
మహీయధ్వమితి తతో‌ హైవ
విదాఞ్చాకార బ్రహ్మేతి

దీని అర్థం, అప్పుడు హైమవతి "అదే బ్రహ్మము. ఆ బ్రహ్మము వల్లనే మీకు విజయం కలిగింది" అని ఇంద్రునికి స్పష్టం చేసింది, అప్పుడు ఇంద్రుడు బ్రహ్మమును తెలుసుకున్నాడు అని

దీనిని బట్టి ఇంద్రుడు బ్రహ్మము కాదని హైమవతి దయతో బ్రహ్మము గూర్చి చక్కగా తెలుసుకున్నాడనీ తెలిసింది కదా. దీని వలన ఇంద్రోపాసన కాక పరబ్రహ్మోపాసనమే మోక్షం యిచ్చేది అని తెలుస్తోంది.

అందుచేత మన వివరణం చెప్పుకుంటున్న వాక్యం పోతనగారు పొరబాటున వ్రాసారా అనే సందేహం వస్తుంది!

బహుశః ఈ వాక్యం "బ్రహ్మదేవ భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు" అనిఉండాలేమో?  ప్రస్తుతం‌ కనిపిస్తున్న పాఠం పూర్వమే దొర్లిన లేఖక ప్రమాదమో లేక ఇటీవలి కాలం వారి ముద్రణా ప్రమాదమో కావచ్చునని ఒక అభిప్రాయం స్థిరపదుతోంది.

ఇంతకు ముందు వాక్యం లోనే బ్రహ్మను ఉపాసించే వాళ్ళకి లభించే ప్రయోజనం తెలుసుకున్నాం.  అది మోక్షం కాదు గదా.  దీనిని బట్టి సాక్షాత్తూ బ్రహ్మ అయినా ఇంద్రాది దేవతలు అయినా ముక్తిని ఇచ్చే వాళ్ళు కాదని తెలిసింది కాదా. అలాంటప్పుడు 'ముక్తు లగుదురు' అన్న ప్రయోగం కూడా పొసగట్లేదు కదా? ఏ విధంగా అన్వయించటం?

ఇక్కడ 'ముక్తు లగుదురు' అన్నది ఆయా లోకాలనుండి, ఆయా దేవతల సమక్షం నుండి విడిపోతారు అని అర్థం చెప్పుకోవాలి. అలా అయితే అంతా సరిగా ఉంటుంది. బ్రహ్మాది దేవత లంతా సృష్టిలోని వారే. కాబట్టి వారికి లయం అయిపోవటం తప్పదు.  అయితే అమిత దీర్ఘాయుర్థాయాలు. అంతే. ఆశ్రయించుకొన్న దేవతే లయం అయిపోయి నప్పుడు, ఆశ్రితులైన ఉపాసకు లంతా కూడా లయం అయిపోతారు. పునఃసృష్టిలో ఉచ్చితమైన అధికారాలూ అవకాశాలూ గల జన్మలు పొందుతారు. అయినా బ్రహ్మాది దేవతలు అని చెప్పటం పాఠదోషమే అనుకోవాలి.  ఎందుకంటే, బ్రహ్మ కంటే యితర దేవత ఆయుఃప్రమాణాలు తక్కువ. పైగా ఇతర దేవతల ప్రసక్తి తెచ్చి అంతా కట్టగట్టుకుని బ్రహ్మలోకాన్నే చేరుస్తారని చెప్పరాదు కూడా.

అలా అన్వయం కుదిరినాక ఈ వాక్యం కేవలం పూర్వవాక్యానికి కొనసాగింపు అనీ‌ విరోధం యేమీ లేదనీ బోధపడుతున్నది.


నారాయణచరణకమలభక్తిపరాయణత్వంబునం జనినవారు నిజేఛ్ఛావశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నతవైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు. 

విష్ణువును భక్తితో ఆరాధించిన వాళ్ళు బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టుకుని వెళ్ళి మహోన్నతం ఐన విష్ణుపదం సంపాదించి వెలుగొందుతారు.

బ్రహ్మను సేవించి పొందేది ఆకల్పాంతం బ్రహ్మలోక నివాసం అని తెలుసుకున్నాం కదా.  ఇప్పుడు ఈ వాక్యంలో నారాయణ భక్తునికి లభించేది యేమిటో చెప్పుతున్నారు.

శ్రీమన్నారాయణుని సేవించేవారికి బ్రహ్మను సేవించే వారికన్న ఉన్నతమైన స్థితి కలుగుతుంది నిస్సందేహంగా.  అటువంటి విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని అక్షరాలా బ్రద్దలు కొట్టుకుని ఆవలకు వెళ్ళగలుగుతారు!  ఎందుకు అలా వెళ్ళటం? బ్రహ్మాండమంటే సృష్టి.  సమస్తమూ యీ సృష్టి లోనికే వస్తుంది.   సమస్త  చరాచరాలలూ అందులోనివే.  సురగరుడోరగయక్షకిన్నరనరాది సమస్తజీవులూ సృష్టిలోని వారే.   ఇంద్రాది  దేవముఖ్యులేమి, చివరకు బ్రహ్మకూడా.  అయితే విష్ణువు సృష్టికే అధినాధుడు, దానికి ఆవలి వాడు.

సాధారణ సృష్టి చేసేవాడు బ్రహ్మ అయినా, అసలు బ్రహ్మాండాన్నే సృజించేవాడు విష్ణువు.   విష్ణువు బ్రహ్మకే తండ్రి అని తెలుసు కదా! ఈ గీతా శ్లోకం (విభూతియోగం లోనిది) చిత్తగించండి.

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ స్పష్టంగా  అందరికంటే, దేవతలు మునులూ  అందరి కంటే కూడా తానే ప్రధముడనని తన పుట్టువు వీరెవరికీ తెలియదనీ చెబుతున్నారు. అలాగే


  సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్ 

  కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

కల్పం అంతమైనప్పుడు సమస్త భూతములూ  నా యొక్క ప్రకృతిలో లీనమై పోతున్నాయి. తిరిగి వాటిని  మరల కల్పం ప్రారంభంలో నేను సృష్టిస్తున్నాని అని శ్రీకృష్ణపరమాత్మ ఇక్కడ చెప్తున్నారు.

ఈ ప్రమాణాలు చాలు. శ్రీవిష్ణుదేవుడే సమస్తమైన సృష్టికీ మూలాధారం అని తెలుసుకోవటానికి. ఆయన ఈ సృష్టికి ఆవలి వాడే కాని మనలాగా బ్రహ్మాదులలాగా సృష్టిలోని వాడు కాదు.

విష్ణుపదం అంటే విష్ణులోకం (వైకుంఠం) సృష్టికి వెలుపలిది. బ్రహ్మాండంలో చిక్కుకున్న వారికి అందనిది.  విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగుల కొట్టుకొని ఆ వైకుంఠాన్ని చేరుకుంటారు.    అంతే కాదు వారికి అలా వైకుంఠాన్ని చేరుకుందుకు  ఏ విధమైన అర్గళమూ (అడ్డంకి) ఉండదు.  విష్ణు భక్తులకు ఏ విషయంలోనూ అడ్డంకీ, మరొకరి  అనుమతీ అవసరం లేదు ఏ విషయంలోనూ.  అంతా వారి  ఇఛ్ఛప్రకారమే (యిష్టం మేరకే). అందుచేత శ్రీమన్నారాయణుని చరణకమలాలను సంపూర్ణమైన భక్తితో సేవించి శరీరత్యాగం చేసిన వారు సంతోషంగా యిష్టపూర్వకంగా, యే అడ్డంకీ లేకుండా నారాయణుని నిజధామం అయిన వైకుంఠం చేరుకుంటారు.   ఇదే పరమోన్నతమైన ప్రాప్తిస్థానం - దీనికి మించినది యేదీ లేదు.  అటువంటి పుణ్యధామం చేరుకున్న విష్ణుభక్తులు  ఇతరేతరములైన ఉపాసలచేత తక్కువ స్థాయి లోకాలకు చేరుకున్నవారికి,   అలాగే సృష్టి లోని అన్యులందరికీ తేరి చూడరాని తేజస్సును పొందుతారు.

ఇక్కడ బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకూ విష్ణుపదం చేరుకున్నవాళ్ళకూ తారతమ్యం చూడండి.   బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకు బ్రహ్మతోనే అవసానం.  ఆతరువాత మళ్ళీ సృష్టిచక్రంలోనికి రాక తప్పదు.  కాని  విష్ణుపదం చేరుకున్నవాళ్ళది మహోన్నతమైన స్థితి. శ్రీ మహావిష్ణువుకు చ్యుతి లేదు.  ఆయన అచ్యుతుడని కదా  ప్రతీతి.  అందుచేత ఆయనను చేరుకున్న వాళ్ళకూ చ్యుతి లేదు.  వారికి యీ సృష్టిలోనికి వచ్చే పనే లేదు.   అదే పరమపదం. అదే మోక్షం.  అంటే సృష్టి చక్రం నుండి విడుదల పొందటం.  అంతకు మించి యేమీ లేదు -ఉండే అవకాశమే లేదు.

ఈ వాక్యంలో బ్రహ్మాండం అన్న మాట వాడబడింది. విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగుల గొట్టుకొని మరీ మోక్షం సాధిస్తారని ప్రతిపాదించ బడింది.  అయితే ఈ బ్రహ్మాండం అనేది యెలా ఏర్పడిందనే విషయాన్ని ముందు రాబోయే వాక్యాల్లో వివరించటం జరుగుతుంది. 

ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి యంశంబున మహత్తత్త్వం బగు.


ఈశ్వరుడి ఆధీనంలో ఉన్న ప్రకృతి అంశతో మహత్తత్త్వం కలుగుతున్నది.
 
ఈశ్వరుడు అన్నా ఈశుడు అన్నా ప్రభువు అని అర్థం. శ్రీమన్నారాయణుడే ఈశ్వర శబ్దవాచ్యుడు.ఈ ద్వితీయ స్కంధములోనివే అయిన రెండు పద్యాలను చిత్తగించండి.

మ. వినుమీ యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి
గ్గున సంకోచము నొందు మాయ వలనం గుంఠీభవత్ప్రజ్ఞచే
నను లోకేశ్వరు డంచు మ్రొక్కు మతిహీన వ్రాతముం జూచి నే
ననిశంబున్ నగి ధిక్కరింతు హరి మాయాకృత్యమంచున్ సుతా

కం. ఆ యీశు డనంతుడు హరి
నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్
మాయకు బ్రాణివ్రాతము
కీ‌ యెడలన్ లేద యీశ్వరత్వము సుతా.

బ్రహ్మగారు నారదమహర్షితో  "కుమారా,  ఈ మాయ అనేది ఉంది చూసావూ, ఇది ఈశ్వరుని దృష్టిని ఆకర్షించటానికి యెంతో సిగ్గుపడి బెరుకు తనంతో‌ ఉంటుంది. ఆట్టే ప్రజ్ఞ లేని వాళ్ళు మందమతులై నన్నే అన్ని లోకాలకూ అధిపతిని అనుకొని మొక్కుతూ‌ ఉంటారు. ఆహా, ఇదంతా ఆ శ్రీహరి మాయాప్రాభావం కదా అని నవ్వుకుంటూ ఉంటాను. వాళ్ళ మొక్కులు అంగీకరించను సుమా. ఆ శ్రీహరియే ఈశుడు. తుదీ మొదలూ‌ లేని వాడు.  నీవో నేనో ఆ మాయో మరే దైనా ప్రాణిగానీ దానికి ఈశ్వరత్వం అంటూ ఉండటం అసంభవం." అని అంటున్నారు.

ఈ‌ పద్యాలు ఎందుకు ఉదహరించా నంటే ఈశ్వర, ఈశ శబ్దాలసమత్వాన్నీ, ఆ ఈశ్వరుడు శ్రీమన్నారాయణుడే అన్న భాగవత రహస్యాన్నీ‌ వివరించటానికే.

ఇప్పుడు మనకు ఈశ్వరాధిష్టితమైన ప్రకృతి అన్న వ్యవహారానికి శ్రీహరి అధీనం లోని ప్రకృతికి అన్న అర్థం సిధ్ధిస్తున్నది కదా. గత వాక్యానికి వివరణం చెప్పుకుంటూ మనం ఒక గీతా‌శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం. అది

 సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్
 కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ 'నా యొక్క ప్రకృతి'లో అనటం‌ కూడా గమనించాం కదా!

మనకు ప్రకృతికి స్వామి యైన వాడు  శ్రీమన్నారాయణుడు అని స్పష్టం అవుతున్నది.

ఎవరికైనా సందేహం ఉండ వచ్చును, ఇదేమిటీ ఈయన శ్రీకృష్ణునీ, శ్రీమన్నారాయణునీ ఒక్కరే అని వ్యవహరిస్తున్నారూ అని. అవునండి, ఒకరే, శ్రీకృష్ణుడు 'లక్ష్మీపతి రభూత్స్వయం' అని ప్రమాణం.  ఆయన విష్ణువు యొక్క విభూత్యవతారంగానీ,  ఆవేశావతారంగాని, అంశావతారంగానీ కాదు.  ఆయన స్వయంగా విష్ణువు. దీనికి భాగవతమే ప్రమాణం. అందుకే మనం శ్రీకృష్ణ ప్రోక్తమైన గీతోపనిషత్తు నుండి ప్రమాణాలు స్వీకరిస్తున్నాము.

ఈశ్వరుడు అనాది అయినట్లే ఆయన అధీనంలో ఉన్న ప్రకృతి కూడా అనాదియే! అది ఆయన విభూతులలో ఒకటే.  ఈ‌ ప్రకృతి అంశం వలన మహత్తత్తం యేర్పదుతోంది.  ఇదీ ప్రస్తుతం మనం వివరణ చెప్పుకుంటున్న వాక్యానికి విశదీకరణ.

ఇదంతా బాగానే ఉంది కాని, ఇంతకూ ఈ‌ మహత్తత్త్వం అంటె యేమిటీ అని ప్రశ్న.

పరమాత్మ యొక్క విభూతులలో ముఖ్యమైనది ప్రకృతి. ఈ‌ ప్రకృతి అనేది సమస్తమైన నామరూపాత్మక మైన వ్యవహారాలకూ‌ మూలం.అందుకే దానికి వేదాంత పరిభాషలో ప్రధానం అనిపేరు. ఈ ప్రకృతి ద్వారా అభివ్యక్త మైన పరమాత్మ స్వరూపానికే మహత్తత్త్వం అని పేరు. అందుకే శుధ్ధపరబ్రహ్మాన్ని ప్రకృతిలయం చేయకుండా తెలుసు కోవటం సాధ్యం కాదు.

బృహదారణ్యకోపనిషత్తు లోని యీ క్రింద ఉదహరిస్తున్న, గార్గీ యాజ్ఞ్యవల్క్యుల సంవాదం లోని మాటలు చూడండి.

గార్గి: యాజ్ఞ్యవల్యా, ద్యులోకానికి పైనా, భూలోకానికి క్రిందా కూడా వ్యాపించి, యీ రెండులోకాల మధ్యనూ వ్యాపించి యున్నట్టిది, భూతము, వర్తమానము, భవిష్యత్తు లాంటి వ్యవహారాలు కలిగినిది దేనిలో పడుగు -పేక లాగా‌కూర్చబడి యుంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశంలో
గార్గి: ఈ‌ఆకాశాము ఓతప్రోతమై దేనిలో ఉంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశం అక్షరము నందు ఆధారపడి యుందని బ్రహ్మవేత్తల నిశ్చయం.
గార్గి:  అక్షరం అంటే ఏమిటి?
యాజ్ఞ్యవల్క్యుడు: ఏదైనా వస్తువును తెలుసుకోవా లంటే విశేషణాలూ నామరూపాలూ కావాలి. అక్షరం‌ అనేదానికి యెటువంటి నామరూపాలూ విశేషణాలూ లేవు. సర్వవిశేషణశూన్య మైనది అక్షరం అని తాత్పర్యం. అంటే అక్షరం అనేది పరబ్రహ్మమే.

అందుచేత మహత్తత్త్వం అంటే పరమాత్మ యొక్క వ్యక్తవిభూతి అని గ్రహించాలి.

మహత్తత్త్వాంశంబున నహంకారం బగు.

 

అహంకారం అనేది సమిష్టి అంతఃకరణం యొక్క బేధము.  ఈ అంహంకారానికి మూలమయిన మహత్తత్త్వాన్ని బుధ్ధి అని కుడా వ్యవహరిస్తారు. బ్రహ్మాండ పిండాండాలకు అబేధము. అంటే విశ్వం అనేది మానవ శరీరంలొ ఆరోపణం చేసి చూసినప్పుడు మహత్తత్తమే బుధ్ధి. ఈ బుధ్ధినుండే 'నేను' అనేది ఒక అభిజ్ఞ యేర్పడుతుంది. అదే అహంకారము. ఇలా పిండాండంలో నిరూపణము.  బ్రహ్మాండ పరంగా, పరమాత్మయొక్క వ్యక్తస్వరూపమైనది మహత్తత్త్వం అయితే దానికి అవ్వలి ముఖం అవ్యక్త పురుషుడు అంటే మూలప్రకృతిగా భాసిస్తున్న పరమాత్మ. నాణానికి ఇవ్వలి ముఖం లాగా ఉండేది నామ రూపాత్మకమైన ప్రకృతి. ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి అని పూర్వవాక్యంలో చదువుకున్నది మూలప్రకృతి అని గ్రహించండి.  సాంఖ్యకారికలలోని క్రింది శ్లోకాన్ని చూడండి

 మూలప్రకృతిరవికృతిర్మహదాద్యాః ప్రకృతివికృతియః సప్త
 షోడశకస్తు వికారో న ప్రకృతిర్నవికృతిః పురుషః

 

మహత్తత్త్వమూ, అహంకారమూ, పంచతన్మాత్రలూ కలిపి మొత్తం యీ ఏడూ ప్రకృతి, వికృతీ కూడా. ఇవి పంచమహాభూతాలకు (వ్యుత్పత్తి)కారణాలు కావటం చేత ప్రకృతి అనీ, మూలప్రకృతికి (పరిణామ)కార్యాలు కావటం వలని వికృతి అనీ తెలుస్తున్నది.   (అవ్యక్త)పురుషుడు అంటే పరమాత్మ. అతడు దేనికీ చెందిన వాదు కాడు. దేనికీ కారణమూ కాడు కార్యమూ కాడు.

ఈ మూలప్రకృతి మరియు ప్రపంచ కారణ మయిన జడప్రకృతులలో మహత్తత్త్వం నుండి జడప్రకృతి విస్తరించటం మొదలవుతుంది. మొట్టమొదటి విస్తరణతత్వమే అహంకారం అని పిలుస్తారు. అంటే ఇక్కడ నుండి నామరూపాలతో కూడిన వ్యవహారం మొదలు అర్ధం.



అహంకారాంశంబున శబ్దతన్మాత్రం బగు.  శబ్దతన్మాత్రాంశంబున గగనం బగు.
గగనాంశంబున స్పర్శతన్మాత్రం బగు.  స్పర్శతన్మాత్రాంశంబున సమీరణం బగు.
సమీరణాంశంబున రూపతన్మాత్రం బగు.  రూపతన్మాత్రాంశంబు వలన తేజం బగు.
తేజోంశంబున రసతన్మాత్రం బగు.  రసతన్మాత్రాంశంబువలన జలం బగు.
జలాంశంబున గంధతన్మాత్రం బగు.  గంధతన్మాత్రాంశంబున పృధివి యగు.

పంచతన్మాత్రలు ఏర్పడే క్రమాన్నీ, ఆ పంచతన్మాత్రల నుండి పంచభూతాలు ఏర్పడటాన్నీ శుకయోగి విశదీకరిస్తున్నారు.  శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలనే ఐదింటికీ తన్మాత్రలని పేరు. ఇవి ఐదు కాబట్టి పంచతన్మాత్రలని వ్యవహారం.  ఈ పంచతన్మాత్రలే పంచభూతాల యొక్క రూపాలు.  అర్థ విశేషాన్ని నిరూపించే శబ్దరూపమే శబ్దతన్మాత్ర. మృదుత్వం, శీతోష్ణాలను నిశ్చయించే స్పర్శయొక్క రూపమే స్పర్శతన్మాత్ర. వస్తువు యొక్క త్రిపరిమాణాల్నీ, తెలుపూ, ఎరుపూ వగైరా వర్ణాల్నీ తెలియజేసే ధర్మరూపమే రూపతన్మాత్ర.  నాలుకకు వివిధమైన రుచుల్ని తెలియ జేసేది రసతన్మాత్ర.  పరీమళమూ, దుర్వాసన వంటి వస్తు విశేషధర్మాన్ని తెలిపేది గంధ తన్మాత్ర.

 

వీటిలో శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం (space), స్పర్శతన్మాత్ర నుండి వాయువూ, రూపతన్మాత్ర నుండి తేజస్సూ, రసతన్మాత్ర నుండి జలమూ,  గంధతన్మాత్ర నుండి భూమీ ఏర్పడుతున్నాయి.

వాని మేళనంబున చతుర్దశభువనాత్మకంబైన  విరాడ్రూపం‌బగు.
 

ఈ పైన చెప్పిన మహత్తూ, అహంకారం అనే తత్త్వాలూ, పంచతన్మాత్రలూ, పంచభూతాలూ కలిపి మొత్తం పన్నెండు.  వీటికి ఈశ్వరుడి విభూతి ఐన ప్రకృతితో  కలయిక వలన పధ్నాలుగు లోకాలతో కూడిన విరాట్ స్వరూపం ఏర్పడుతోంది.