13, ఆగస్టు 2013, మంగళవారం

ప్రథమస్కంధం: 23. ధర్మరాజు దుశ్శకునాలు చూసి విచారించటం

ఆ విధంగా తీర్థయాత్రల నుండి తిరిగివచ్చిన విదుర మహాశయుడు,  యాదవవంశక్షయం తప్ప అనేక విషయాలు ధర్మరాజుతో వివరంగా చెప్పాడు.

క్రమంగా ధర్మరాజుగారికి కాలంలో చిత్రమైన మార్పు వస్తున్నట్లుగా అనిపించటం మొదలయ్యింది.  మనుష్యుల ప్రవర్తనలోనూ మార్పుల చాలా స్పష్టంగా గోచరించటం మొదలయ్యింది.  ఒకరోజున ఆయన భీముడితో ఇలా అన్నారు.

సీ. ఒక కాలమునఁ బండు నోషధిచయము వే
      ఱొక కాలమునఁ బండకుండు నండ్రు
క్రోధంబు లోభంబు క్రూరత బొంకును
      దీపింప నరులు వర్తింతు రండ్రు
వ్యవహారములు మహా వ్యాజయుక్తము లండ్రు
      సఖ్యంబు వంచనాసహిత మండ్రు
మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు
      సుతులు దందడ్రులఁ దెగఁ జూతు రండ్రు

తే. గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు
శాస్త్రమార్గము లెవ్వియుఁ‌ జాగ వండ్రు
న్యాయపధ్ధతి బుధులైన నడవ రండ్రు
కాలగతి వింతయై వచ్చెఁ గంటె నేడు

భీమా, కాలం చూస్తుంటే వింత పోకడలు పోతోంది.  మార్పు చాలా స్పష్టంగా ఉంది.   ఒకసారి పంటలు పండుతాయి చక్కగా - అన్నీ‌ సరిగానే అనిపించినా మరుచ టేడు పండవు.  మనుష్యులలో నిష్కారణ క్రూరత్వం,  ధనాదికాలమీద అంతులేని లోభం,   చీటికీ మాటికీ అబధ్దాలాడటం కనిపిస్తోంది హెచ్చుగా.  అందుచేత అతితరచుగా అన్ని రకాల వ్యవహారాల్లోనూ‌ లోపాయికారీ పోకడలూ న్యాయస్థానాలల్లో వాదాలూను.  చివరికి ఒకరితో ఒకరు స్నేహం చేసేది కూడా అదును చూసి వంచన చేయటానికే అంటే ఇంక చెప్పేది ఏముందీ?  భార్యలకు భర్తలతోనే పంతాలూ‌ పట్టింపులూ ఈర్ష్యలూ కూడా పెరుగుతున్నాయట.  ఏవేవో పట్టుదలలూ పంతాలతో కన్నతండ్రులనే పిల్లలు హతమార్చుతున్నారట.   విద్య నేర్పే గురువులతోనే శిష్యులు పోట్లాడి తిట్టి మరీ వెళ్ళిపోతున్నారట.  ఎవరికీ శాస్త్రాలమీద విశ్వాసం కుదురుగా ఉండక, చివరికి  యోగ్యులు అనిపించుకుంటున్న వాళ్ళు కూడా న్యాయం అన్యాయం అన్న విచారణ లేకుండా ప్రవర్తిస్తున్నారట.  ఇదంతా ఏమీటోగా ఉంది.

అలా కాలం పోకడలో వస్తున్న మార్పులు చూసి ధర్మరాజుగారు గాభరా పడటానికి కారణం,  కలిప్రవేశించిందని అనుమానమే.  అందుకే, ఇంకా ఇలా అంటున్నారు.

శ్రీహరితో అర్జునుడు కూడా ద్వారకకి వెళ్ళి ఇప్పటికి ఏడు నెలలయ్యింది.  అతనూ తిరిగి రాలేదు, అక్కండి నుండి వార్తలూ ఎవ్వరి ద్వారానూ‌ తెలియ రాలేదు.  శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా అని మనస్సులో చాలా ఆందోళనగా ఉంది.  భీమా,  భగవంతుడి నిర్ణయం తెలియదు కదా.

నాకు రకరకాల దుశ్శకునాలు కనిపిస్తున్నాయి.  మనస్సులో దిగులుగా ఉంది.  మనుష్యుల ప్రవర్తన పతనాన్ని చూపిస్తోంది.
ఇంతకాలం మనం అడిగినా అడక్క పోయినా, శ్రీకృష్ణుడు మననీ మన సంపదలనీ, రాజ్యాన్నీ, మన భార్యలనూ సంరక్షించాడు.  ఇప్పుడు కనిపిస్తున్న కాలస్వభావాన్ని బట్టి చెడ్దకాలం వచ్చినట్లే అనిపిస్తోంది.

అన్నిరకాల అమంగళాలూ గోచరిస్తున్నాయి.  మోరపైకెత్తి నిర్విరామంగా ఏద్చే కుక్కలూ,  ఉదయాన్నే నోట మంటలు కక్కుతూ నక్కలూ కనిపిస్తున్నాయి.  గద్దలూ గాడిదలూ వంటి అమంగళజీవాలు ఎక్కడ చూసినా విహరిస్తున్నాయి.

మదజలం ఎండిపోయిన వయస్సులో ఉన్న యేనుగులూ,  కన్నీళ్ళు కార్చే జాతిగుర్రాలూ, ముఖం మీదికి ఎగిరివచ్చే పావురాలూ అన్నీ‌ దుశ్సకునాలే ఎప్పుడూ.

తరచుగా భూమి కంపిస్తోంది.  సూర్యుడి తేజస్సూ తరిగినట్లు కనిపిస్తోంది. అగ్నిహోత్రాల్లో పొగ తప్ప మంట రాకపోవటం సాధారణం అయిపోయింది.

తరచూ సుడిగాలులు వీస్తున్నాయి.  దుమ్మూ‌ధూళితో ఆకాశం నిస్తేజంగా తోస్తున్నది.  ఇలా రకవర్ణంలో వానలు కురవటం ఎప్పుడైనా చూసామా?  క్షితిజ రేఖమీద తరచుగా మంట లాగా కనిపించటం కూడా మంచి లక్షణం కాదు.  గోసంపద కూడా క్షీణిస్తోంది.   అబోతులు దూడల వెంట పడుతున్నాయట.

ఇంకా చిత్రం ఏమిటంటే, గుళ్ళల్లో‌ దైవప్రతిమలు కదలటమూ, దూరం జరగటమూ పైగా వాటికి మనుషుల్లాగా చెమటలు పోయటమూ.  ఇదంతా దేనికి సూచన?

నిత్యం కాకులగుంపుల గోలా, ఆకాశం నిండా పగలే గుడ్లగూబల సంచారం.  అసలు ఈ భూలోకం‌ కళ తప్పిపోయినట్లు కనిపిస్తోంది.

మ. యవపద్మాంకుశచాపచక్రఝషరేఖాలంకృతంబైన మా
ధవు పాదద్వయ మింక మెట్టెడు పవిత్రత్వంబు నేఁ డాదిగా
నవనీకాంతకు లేదు పో మఱి మదీయాంగంబు వామాక్షి బా
హువు లాకంపము నొందుచుండు నిల కే యుగ్రస్థితుల్ వచ్చునో

భగవంతుడైన మాధవుడి పాదాలు - యవరేఖ, పద్మరేఖ, అంకుశరేఖ, చాపరేఖ, చక్రరేఖ, మీనరేఖ అనే అద్భుత శుభ లక్షణాలు కలవి.   వాటిని ధరించి ఉప్పోంగే అదృష్టం ఇంక భూదేవికి లేదేమో నని భయం కలుగుతోంది.   నా యెడమ కన్నూ, ఎడమభుజమూ అదురుతున్నాయి. 

‌ఈ దుశ్శకునాలకు చాలా చాలా కలత కలుగుతోంది.  శ్రీకృష్ణుడి వార్తలేవీ‌ తెలియటం లేదు.  ఇటు అర్జునుడూ ఏమీ కబురూ చేయ లేదూ, తానూ ఇంకా రాలేదు అని ధర్మరాజుగారు వాపోతున్నారు.

2 కామెంట్‌లు:

  1. అప్పుడు ధర్మరాజు గారికి కనపడిన దుశ్శకునాలిప్పుడు నిత్యమూ కనపడుతున్నాయండి.
















    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ. అవి నిత్యం ఐపోయేసరికి అవి దుశ్శకునాలూ అనుకోవటం కూడా మానేసామేమో!

      తొలగించండి