26, ఆగస్టు 2013, సోమవారం

ప్రథమస్కంధం: 36. శ్రీశుకులను పరీక్షిత్తు మోక్షమార్గం కోసం ప్రార్థించటం


ఆవిధంగా వ్యాసమహర్షులవారి కుమారుడైన శుకయోగీంద్రుడు అక్కడికి వచ్చాడు.

వెంటనే, అక్కడ చేరి ఉన్న మును లందరూ వారివారి ఆసనాలు దిగి, శుకయోగికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి తీసుకు వచ్చారు.   ఆ మునులు అందరికీ శుకయోగి ప్రభావం తెలుసు కదా!

పరీక్షిన్మహారాజుకు బ్రహ్మానందం కలిగింది.  అయన శుకయోగికి అతిథి సత్కారాలు చేసి,  సాష్టాంగ దండప్రణామం చేసి, గొప్పగా పూజించాడు.

రాత్రిపూట చూడండి.  ఆకాశం మీద అనేక వేల నక్షత్రాలు మిలమిల లాడుతూ‌ ఉంటాయి.  అవి చూడటానికి ఎంతో బాగుంటాయి.  ఆకాశం ఎంతో అందంగా ఉంటుంది.

కొద్ది సేపటికి చందమామ వచ్చాక?  ఇంక ఆకాశం‌ ఎంత శోభాయమానంగా ఉంటుందో చెప్పతరం కాదు.  అవునా?

అలాగే, అనేక మంది మునులతో కళకళ లాడుతున్న పరీక్షిన్మహారాజుగారి ప్రాయోపవేశ స్థలం ఒక రకంగా నక్షత్రాల గుంపులతో కూడిన ఆకాశంలా ఉంది.  

శుకమహర్షి రాకతో చంద్రోదయం అయినట్లయింది.

అలా శుకమహర్షి నక్షత్ర మండలాలతో కూడుకున్న ఆకాశం మీద ప్రకాశిస్తున్న పూర్ణచంద్రుడిలా ఉన్నాడు.  పోతనగారు రాకాసుధాకరుండు అన్నారు.  రాకా అంటే పౌర్ణమి.  లలితాసహస్రనామాల్లో ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా అని ఒక నామం ఉంది.  అక్కడ ప్రతిపత్తు అంటే పాడ్యమి.  రాకా అంటే పౌర్ణమి.  సుధాకరుడు అని పోతనగారు ఒక సొగసైన మాట అన్నారు. సుధ అంటే అమృతం,  అంటే  నాశనం లేనిది. అమృతత్వం అంటే బ్రహ్మానందమే.  కాబట్టి సుధాకరుడు అంటే బ్రహ్మానందాన్ని కలిగించేవాడు అని అర్థం.  బ్రహ్మానందాన్ని కలిగించే సామర్థ్యం కేవలం పరబ్రహ్మానికే కదా ఉండేది. అంటే శుకయోగి పరబ్రహ్మస్వరూపం అని చెప్పటం‌ అన్నమాట.   మరి సుధాకరుడు అంటే సరిపోయే టప్పుడు రాకా అని విశేషణం అవసరం ఏమిటీ అన్న ప్రశ్న వస్తుంది.  మహాత్ముల సాన్నిహిత్యం వారి నామస్మరణం, వారి ఉపదేశాలు వినటం, వారి శిష్యులతో‌ సంభాషించటం వంటి అనేకరకాలుగా సిథ్థిస్తుంది.  మరి వారే స్వయంగా వచ్చి దర్శనం అనుగ్రహిస్తే?  అది సంపూర్ణ ఫలం అందిస్తుంది కదా?  అందుకే భాగవతంలో  రాకాసుధాకరుండు అని చెప్పటం అన్నమాట.

ఉ. ఫాలము నేల మోపి భయభక్తులతోడ నమస్కరించి భూ
పాలకులోత్తముండు గరపద్మములన్ ముకుళించి నేఁడు నా
పాలిటి భాగ్య మెట్టిదియొ పావనమూర్తివి పుణ్యకీర్తి వీ
వేళకు నీవు వచ్చితి వివేకవిభూషణ పుణ్యకీర్తనా

ఆ శుకమహర్షి ముందు,  రాజకులంలోకే ఉత్తముడైన పరీక్షిత్తు నుదుటిని నేలకు తాకించి సాష్టాంగ పడ్డాడు.  ఎంతో భయభక్తులతో ఒక ప్రక్కన నమస్కారం పెట్టి అలాగే నిలబడ్డాడు. (గురువులకూ, దైవానికి సరాసరి ముఖానికి ఎదురుగా నిలబడ కూడదు).  ఈ‌ రోజున నా భాగ్యం ఎంత గొప్పగా పండిందో!   మీరు పరమపావనులు (మీ దర్శనం చేతనే పాపనాశనం కలుగుతుంది అని), మీ‌ కీర్తిని స్మరిస్తేనే అమోఘమైన పుణ్యం వస్తుంది.  ఆత్మానాత్మ వివేకమే అలంకారంగా ఉంటారు మీరు.   మీ‌ అనుగ్రహ భాషణం పరమమైన బ్రహ్మ తేజస్సుని ప్రసరింప జేస్తుంది.ఎంతో‌ గొప్ప అదృష్టం కలిగిందో! సరిగ్గా నాకు అవసరమైన సమయానికి మీరు దర్శనం అనుగ్రహించారు.

మ. అవధూతోత్తమ నేఁడు నిను డాయం‌ గంటి నీవంటి వి
ప్రవరుం బేర్కొకునంతటన్ భసితమౌఁ బాపంబు నా బోఁటికిన్
భవదాలోకన భాష ణార్చన పదప్రక్షాళన స్పర్శ నా
ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ నాశ్చర్యమే

అయ్యా మీరు అవధూతల్లో  ఉత్తములు. మీ లాంటి బ్రహ్మవేత్తలను స్మరించినంతనే మా బోటి వాళ్ళ పాపాలన్నీ భస్మం ఐపోతాయి.  అలాంటిది మిమ్మల్ని ప్రత్యక్షంగా దర్శించటం, మీ‌ పాద సేవ చేసుకోవటం, మిమ్మల్ని సత్కరించుకోవటం అనే ఆదృష్టం పడితే చెప్పేదేముంది.  అదీ కాక మీతో సంభాషించే అవకాశం దొరకటం అంటే మీ అనుగ్రహంతో ముక్తి లభించటమే అన్న మాట.  నా పుణ్యం‌ పండి,  మీరే స్వయంగా నా దగ్గరకు వచ్చారు.

శ్రీహరిని చూడగానే రాక్షసులంతా సర్వనాశనం ఐపోతారు. మీ పాదస్పర్శ చేతనే సమస్త మహా పాపాలూ నాశనం ఐపోతాయి.

మ. ఎలమిన్ మేనమఱందియై సచివుడై యే మేటి మా తాతలన్
బలిమిం గాచి సముద్రముద్రితధరం బట్తంబు గట్టించె న
య్యలఘుం డీశుఁడు చక్రి రక్షకుడు గా కన్యుల్ విపద్రక్షకుల్
గలరే వేఁడెద  భక్తి నా గుణనిధిం గారుణ్య వారాన్నిధిన్

పరీక్షిన్మహారాజుగారు శ్రీకృష్ణభగవానుని స్మరిస్తున్నారు.  ఏ మహాత్ముడు మా తాతలకి మేనమరదిగా అత్మీయతను పంచి పెట్టాడో,  ఆప్తమిత్రుడైన మంత్రిగా మంచి చెడ్డల్లో‌ తోడుగా ఉన్నాడో, ఆ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటున్నాను.   ఆయన తన ప్రతాప ప్రభావం చేత మా తాతలని కంటికి రెప్పల్లా రక్షించి, వాళ్ళకి నాలుగుసముద్రాల దాకా విస్తరించిన సామ్రాజ్యానికి పట్టం‌ కట్టాడు.  సుదర్శన చక్రధారి ఐన శ్రీకృష్ణస్వామి తప్ప మహా దొడ్డ ఆపదలలోంచి రక్షించగల వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?  ఆయన అసామాన్యుడు, సాక్షాత్తూ జగదీశ్వరుడు.  ఆ కారుణ్యాది సద్గుణమూర్తిని భక్తితో నన్ను రక్షించ మని వేడుకుంటున్నాను. 

రాజు మాటల్లో, ఆ శ్రీకృష్ణులవారే తమ పరమభక్తులైన మిమ్మల్ని, నన్ను రక్షించమని పంపారూ అని భావిస్తున్నాను అని చెప్పటం ఇమిడి ఉంది.

రాజుగారు, ఇలా శ్రీకృష్ణస్తవం చేయటంతో శుకయోగికి చాలా ఆనందం కలిగింది.   అయన హృదయం కృష్ణమయం కదా!

తిరిగి, పరీక్షిత్తు శుకయోగితో ఇలా అంటున్నారు.

సీ.  అవ్యక్తమార్గుండ వైన నీ దర్శన
      మాఱడి పోనేర దభిమతార్థ
సిధ్ధి గావించుట సిధ్ధంబు నేఁ డెల్లి
      దేహంబు వర్జించు దేహధారి
కేమి చింతించిన నేమి జపించిన
      నేమి గావించిన నేమి వినిన
నేమి సేవించిన నెన్నఁడు సంసార
      పధ్ధతి బాసిన పదవి గలుగు
తే. నుండ మనరాదు గురుఁడవు యోగివిభుఁడ
వావుఁ బితికిన తడ వెంత  యంత సేపు
గాని యొక దెస నుండవు కరుణ తోడఁ
జెప్పవే తండ్రి ముక్తికి జేరు తెరువు

మహానుభావా శుకయోగీంద్రా!  అత్యంత గహనమైన నీ యోగమార్గం ఎవ్వరికీ అంతు చిక్కదు. పరబ్రహ్మ స్వరూపుడవైన నీ దర్శనం వృధా కాదు.  తప్పకుండా కోరిన ప్రయోజనం అనుగ్రహిస్తుందని అనుకుంటున్నాను.

శరీరం ధరించిన వాడికి మృతువు తప్పదు.  ఈ వేళో, రేపో అది తప్పకుండా జీవుణ్ణి ఉపాధి నుండి కబళిస్తుంది కదా!

అటువంటప్పుడు.  నా బోటి జీవుడు ఎలా ముక్తి పొందుతాడు?

ఏ తత్త్వాన్ని ధ్యానిస్తే ముక్తి లభిస్తుంది?

ఏ మహామంత్రాన్ని ఉపాసించి జపం చేస్తే ముక్తి లభిస్తుంది?

ఎలాంటి మహత్తరమైన పుణ్యకార్యం చేస్తే ముక్తి లభిస్తుంది?

ఏ దివ్యసత్కథలను వింటే ముక్తి లభిస్తుంది?

ఏ ఏ పుణ్యతీర్థాలు సేవిస్తే ముక్తి లభిస్తుంది?

మిమ్మల్ని విస్తారంగా చెబుతూ కూర్చుండ మనటానికి వీలు లేదు.  మీరేమో ఆవు పాలు పితకటానికి ఎంత సేపు పడుతుందో అంత సేపు కన్నా ఒక్క ఘడియ కూడా ఎక్కడా నిలకడగా ఉండే వారు కాదు.

అయినా దయచేసి,  మీకు వీలున్నంతగా ఈ కాస్సేపటిలోనే నాకు సంసారపధ్దతి నుండి విడుదల పొంది మోక్ష పదవి పొందే ఉపాయం అనుగ్రహించ వలసింది.

ఇలా ఎంతో వినయంగా శుకమహర్షిని పరీక్షిన్మహారాజు వేడుకున్నాడు.

చదువరులారా,  పరీక్షిన్మహారాజుగారు శ్రీశుకయోగీంద్రులను మోక్షమార్గ ప్రశ్న చేయటంతో  మహాభాగవత పురాణంలో ప్రధమస్కంధం సంపన్నం అవుతున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి