18, ఆగస్టు 2013, ఆదివారం

ప్రధమస్కంధం: 28. భూదేవీ,ధర్మదేవుడూ గోవృషభ రూపాల్లో సంభాషించుకొనుట.

ఆ పరీక్షిన్మహారాజు అక్కడ ఒక ఆవునీ ఎద్దునీ చూసాడు.  ఆ ఎద్దుకు ఉన్న నాలుగు కాళ్ళల్లో మూడు అవిటివి.  మిగిలిన ఒక కాలుతోనూ కష్టం మీద కుంటుతూ నడుస్తోంది.  దూడను పోగొట్టుకున్నట్లుగా ఉన్న ఆ ఆవు అతిదీనంగా కన్నీళ్ళు కారుస్తూ వగస్తోంది.

నిజానికి అక్కడ ఎద్దు రూపంలో ఉన్నది ధర్మదేవుడు.  అలాగే ఆవు రూపంలో కనిపించినది భూదేవి.  అక్కడ వారిద్దరికీ ఇలా సంభాషణ జరిగింది.  మనం ఆ గోవృషభాలను భూదేవి, ధర్మదేవుడూ అనే సంబోధిద్దాం.

ధర్మదేవుడు గోమాతతో అంటున్నాడు,  ఓ తల్లీ గోమాతా ఎందుకు విచారిస్తున్నావు.  అనారోగ్యంగా కూడా కనిపిస్తున్నావు.  ముఖం చిన్నబుచ్చుకుని వాడి ఉంది.  ఏమిటి నీ కొచ్చిన కష్టం?   నీ బంధువులకు ఆపదలేమైనా వచ్చాయా?  ఇలా ఒంటికాలితో కుంటుతున్న నన్ను దుష్టులు పట్టుకుపోతారని దుఃఖపడుతున్నావా?

సీ.  మఖములు లేమి నమర్త్యుల కిటఁ మీద
      మఖభాగములు లేక మాను ననియొ
రమణులు రమణుల రక్షింప రనియొ పు
      త్రులఁ దల్లి దండ్రులు ప్రోవ రనియొ
భారతి కుజనులఁ బ్రాపించు ననియొ స
      ద్విప్రులు నృపుల సేవింతు రనియొ
కులిశయస్తుఁడు  వాన గురియింప కుండఁగ
      బ్రజలు దుఃఖంబుల బడుదు రనియొ
ఆ.  హీనవంశజాతు లేలెద రనియొ రా
జ్యములు పాడి గలిగి జరగ వనియొ
మనుజు లన్నపానమైథునశయనాస
నాది కర్మసక్తు లగుదు రనియొ

ఇంక ఈ‌ కలియుగంలో యజ్ఞాలు లేక దేవతలకు మర్యాదలూ హవిర్భాగాలూ ఉండవనా?  భార్యాభర్తలు పరస్పరం  రక్షించుకోరనా?  పిల్లలను కని వాళ్ళ కర్మానికి వాళ్ళను వదిలి పెట్టే తల్లిదంద్రులు తయారవుతారనా?  యోగ్యత లేని దుర్మార్గపు బుధ్ధులు గల వాళ్ళకు (ధనాశగల గురువుల పుణ్యమా అని) విద్యలు దొరికి దుర్వినియోగం అవుతాయనా?  బ్రహ్మజ్ఞానులై నిరీహులై ఉండవలసిన సద్బ్రాహ్మణులకు కాలం చెల్లి,  రాజుల్నీ వాళ్ళ అధికారుల్నీ కొలిచి బ్రతికే బ్రాహ్మల కాలం వచ్చిందనా?  అధర్మాన్ని చూసి సహించలేక ఇంద్రుడు వానలు కురిపించకపోతే,  ప్రజలు నానావిధాలుగానూ‌ దుఃఖ పడతారనా?  ఇన్నాళ్ళూ నడిచిన,  ధర్మప్రభువులూ,  ఋషులవంటి వారూ అయిన రాజుల పాలనకు రోజులు మూడి ఇంక క్రూరులూ, చోరులూ వంటి హీనులు భూమిని పాలించటం మొదలవుతుందనా?  ధర్మద్రోహులైన రాజులు గద్దె కెక్కిన పుణ్యానికి,  రాజ్యంలో గోసంపదా, పాడిపంటలూ‌ నాశనమై అరాచకం ఏర్పడుతుందనా?  ఈ దిక్కుమాలిన కలియుగంలో మనుషులకు చిత్తం వచ్చినట్లు తినటం, తాగటం, సోమరిపోతుల్లా ఊరికినే పడి కూర్చోవటం,  విచ్చలవిడిగా తిరుగుబోతుల్లా కాలక్షేపం చేయటం తప్ప సరిగ్గా ఎలా బతకాలో కూడా అవగాహన లేకుండా పోతుందీ అనా?  ఇవేనా నువ్విలా శోకించటానికి కారణాలు?

అమ్మా, నీ‌ బరువు దించటానికి శ్రీమహావిష్ణువు ఇన్నేళ్ళూ మానవరూపంలో నీ దగ్గరే ఉండి నీకు మహదానందం‌ కలిగించాడు.  ఇప్పుడు అవతారసమాప్తి చేసి ఆయన వెళ్ళిపోయాడు.  ఇంక పనికిమాలిన వాళ్ళు రాజ్యాలేలుతారూ,  ముందు నాకేది దిక్కూ‌ అని విచారిస్తున్నావా?

ఇలా ధర్మదేవుడు పరామర్శిస్తుంటే, భూదేవి ఇలా అంటోంది.  అవునయ్యా ఇన్నాళ్ళూ ఆ కృష్ణస్వామి పుణ్యమా అని నువ్వు నాలుగుపాదాలా హాయిగా కన్నుల పండుగగా నడిచావు.  ఇప్పుడు భగవంతుడు ఇక్కడ లేకపోవటంతో నీకు ఒంటి కాలై పోయింది గదా అని చాలా విచారిస్తున్నాను.

భగవానుడి దగ్గర ఎలాంటి ఎలాంటి సుగుణాలు రాసులుగా ఉన్నాయి!   సత్యం, శౌచం, దయ, క్షాంతి (ఓర్పు), త్యాగం, సంతోషం, ఆర్జవం (ఋజుప్రవర్తన),  శమం (అంతరింద్రియ నిగ్రహం. అంటే, మనస్సులోకి సుఖం, భోగం మొదలైన ఆలోచనలు రాకుండా చేయడం.), దమం (బాహ్యేంద్రియ నిగ్రహం), తపస్సు,  సమత్వం, సహనం, స్వలాభం పట్ల నిరాసక్తి,  శాస్త్రవిచారం, జ్ఞానం, విరక్తి, ఐశ్వర్యం, శౌర్యం, ప్రభ(తేజస్సు), దక్షత్వం(సమర్థత), స్మృతి (వేద విజ్ఞానం), స్వాతంత్ర్యం, కౌశల్యం, కాంతి (ఇతరులకు తేరిచూడరాని గొప్పదనం), ధైర్యం, మార్దవం, ప్రతిభ, ప్రశ్రయశీలం (నమ్మదగిన వాడుగా ఉండటం), జ్ఞానేంద్రియాలూ కర్మేంద్రియాలూ మనస్సూ అనేవి ధృఢంగా ఉండటం,  శ్రథ్థ, కీర్తి, నిగర్వం వంటి మహాధ్బుత లక్షణాలు సమూహంగా శ్రీకృష్ణదేవుణ్ణే  ఆశ్రయించుకుని ఉన్నాయి.

ఇలా లెక్కలేనని మహాసద్గుణాలతో  శోభించే భగవంతుడైన విష్ణువు అవతారం ముగిసి, ఘోరకలి ప్రారంభం అయింది.  ఇంక రకరకాల పాపగుణాలతో వాటి వల్ల తగిలే దెబ్బలతో కుయ్యో మొఱ్ఱో అనే జనాన్ని చూడవలసి వస్తుందని ఏడుస్తున్నాను.

ఇంక దేవతలకీ, ఋషులకీ, పితృదేవతలకీ, నాకూ, నీకూ, ధర్మం అనే దాన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా కష్టకాలం వచ్చి పడింది.  ఇంక వర్ణాశ్రమాలు నాశనం అవుతాయి.  గోవుల కింక చేటు కాలం వచ్చింది.

సీ.  బ్రహ్మాదు లెవ్వని భద్రకటాక్ష వీ
      క్షణము వాంఛింతురు సత్తపములఁ
గమలాలయము మాని కమల యెవ్వని పాద
      కమలంబు సేవించు కౌతుకమున
బరమ యోగీంద్రులు భవ్యచిత్తము లందు
      నిలుపుదు రెవ్వని నియతి తోడ
వేదంబు లెవ్వని విమలచారిత్రముల్
      వినుతింపగా లేక వెగడువడియె
ఆ. నట్టి వాసుదేవు నబ్జవజ్రాంకుశ
చక్రమీనశంఖచాపకేతు
చిహ్నితంబైన శ్రీచరణము లింక
సోఁక వనుచు వగపు సోఁకెనయ్య

ఎవని శుభకరమైన కటాక్షంతో కూడిన చూపుకోసం బ్రహ్మాది దేవతలంతా నిత్యం కోరుతారో,   ఏమహాత్ముని పాదాలు వత్తటం అనే మహా భాగ్యం కోసం లక్ష్మీదేవి తన పుట్టిల్లయిన కమలం‌ వదలి కదలి వెడుతుందో,  ఏ పరమాత్ముణ్ణి పరమయోగీంద్రులు తమతమ నిష్కల్మషమైన హృదయాలలో నిలుపుకుని ఉంటారో,  ఏ పరమపురుషుడి దివ్యచరిత్రాన్ని వర్ణించ లేక వేదాలు కూడా మౌనం వహిస్తాయో,   అలాంటి వాసుదేవుడి పరమశుభలక్షణాలతో ఒప్పారే పాదాలు ఇంక నాకు సోకవు కదా అని చింతిస్తున్నాను. 

ఓ‌ ధర్మదేవా, మహాత్మా! ఇన్నాళ్ళూ శ్రీహరి పాదాలను మోస్తున్నానన్న గర్వం ఉండేది.  అందుకే అన్నిలోకాల్లోకీ నాదే గొప్ప అన్న భావ ఉండేది.  ఆ గర్వం కాస్తా వదిలించి ఆయన వెళ్ళిపోయారు.

ఆయన నిన్ను నాలుగు పాదాలమీదా నడిపించటానికే, ఒక లీలగా కృష్ణావతారం ధరించి వచ్చాడు.  

ఉ.  ఆ మధురోక్తు లా నయము లా దరహాసము లా దయారసం
బా మురిపంబు లా తగవు లా గమనక్రియ లా మనోహర
ప్రేమకరావలోకనము  ప్రీతిఁ గనుంగొన లేమి మాధవుం
గామిను లేల నిర్దళిత కర్ములు యోగులుఁ బాయ నేర్తురే

అత్యంత మథురమైన ఆ చక్కటి మాటలూ, ఆ అందమైన టక్కులూ, ఆ అందాలగనులైన చిరునవ్వులూ, ఆ గంభీరమైన నడకల తీరూ,  ఆ మనోహరమైన ప్రేమపూర్వకమమైన చల్లని చూపులూ ఇంక దుర్లభం‌ కదా!  ఆయనను చూచి స్త్రీజనం ఆకర్షణలో పడి వదల్లేరంటారు కాని,  అన్ని కర్మబంధాలూ వదల్చుకున్న యోగీంద్రుల మాటే మిటీ?  వాళ్ళు మాత్రం ఆయన్ని విడిచిపెట్టి ఉండగలరా?

ఆ శ్రీకృష్ణమూర్తి నా మీద పాదం మోపినంతనే నేను పులకించిపోయాను.  ఆ గగుర్పాటే ఆయన నడయాడిన చోటెల్లా సమృధ్ధిగా పంటల రూపంలో కనిపించింది.

ఇలా గోరూపంలో ఉన్న భూదేవి వృషభ రూపంలో ఉన్న ధర్మదేవుడితో మాట్లాడుతూ తన గోడు వెళ్ళబుచ్చుకుంటోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి