17, ఆగస్టు 2013, శనివారం

ప్రథమస్కంధం: 27. పరీక్షిన్మహారాజు విజయయాత్ర.

ఆ విధంగా పాండవులతరం నిష్క్రమించింది.  కౌరవ సామ్రాజ్యానికి అభిమన్యుడి కొడుకైన విష్ణురాతుడు చక్రవర్తి అయ్యాడు.  ఆయన పరీక్షిత్తు అనే పేరుతో ప్రసిధ్ధుడు.

పరీక్షిత్తు భార్య ఇరావతి.  ఆవిడ ఉత్తరుడి కూతురు. ఈ ఉత్తరుడు, పరీక్షిత్తు తల్లి ఉత్తరకు అన్నగారు.  పరీక్షిన్మహారాజుకు నలుగురు కొడుకులు.  వాళ్ళల్లో పెద్దవాడు జనమేజయుడు.  పరీక్షిత్తు అనంతరం జమమేజయుడు రాజయ్యాక సర్పయాగం అని ఒక దారుణమైన యజ్ఞం చేసి నాగజాతిని దాదాపుగా అంతం చేసిపారేసాడు. ఆ కథ తరవాత చెప్పుకుంటాం.

పరీక్షిత్తుకు ధనుర్వేదం వగైరా విద్యలు నేర్పిన గురువూ, ఆస్థాన పురోహితుడూ కృపాచార్యులవారు.  పరీక్షిత్తు బోలెడు మహాయాగాలు చేసాడు. మూడు సార్లు అశ్వమేథయాగం కూడా చేసాడు.  ఇలా ఆయన తిరుగులేకుండా పాలిస్తూ ఉండగా ఒకనాడు ఆయనకు ఒక రాజు వేషంలో ఉన్న నీచుడైన కలిపురుషుడు ఎదురుపడ్డాడు.  తన కళ్ళ ఎదురుగా ఒక ఆవునూ, ఎద్దునూ ఈ‌ కలి కాళ్ళతో తన్ని అవమానిస్తూ బాధిస్తూ ఉంటే చేసి సహించలేక, పరీక్షిత్తు వాడిని శిక్షించాడు.

ఈ మాట సూతుడు చెప్పగానే శౌనకమహర్షి ఆశ్చర్యపడి,
అదేమిటయ్యా, ఈ‌ కలికి మరేం‌ పని లేదా? పోయి పోయి సాధు జంతువులైన ఆవునీ వృషభాన్నీ‌ తన్ని హింసిస్తాడూ?  వాణ్ణి పరీక్షిత్తు శిక్షించటం బాగుంది. ఆ కథ కాస్త వివరంగా చెప్పూ అన్నారు.  ఇంకా అంటున్నారూ 

మ.అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులై యున్న స
త్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుధ్ధిన్ విలంఘించి దు
ర్నర వార్తా కథన ప్రపంచములు గర్ణప్రాప్తముల్ సేసి వా
సరముల్ వ్యర్థతఁ ద్రోచు చుండ జనదీ సంసార మోహంబునన్

భగవంతుడైన విష్ణువు పాదపద్మాలపై భక్తి యనే తేనియల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళే సత్పురుషులు.   అలాంటి సత్పురుషుల జీవితాలకూ, మహాత్మ్యాలకూ సంబంధించిన కథలే మనకు చక్కగా వినదగినవి.  అవి వినకుండా, పనికిమాలిన మనుషులకు సంబంధించిన లౌకికం అయిన కబుర్లూ కథలూ వినటానికి చెవికోసుకోవటం అనేది వఠ్ఠి దుష్టబుధ్ధి అనాలి.  ఇలా మంచిని తోసివేసి కాలక్షేపం చేస్తూ సంసారం పట్ల మోహంతో ప్రవర్తించటం ఎంత మాత్రం మంచిది కాదు సుమా.

అసలు శౌనకులు వినటం అని ఎందు కన్నారూ? తెలుసుకోవటం అనవచ్చు కదా? ఈ‌ మాట పోతనగారిదైనా మూలం లోనూ ఇదే అర్థంవచ్చే మాట ఉన్నా, దానికి చక్కటి కారణం ఉంది.

అక్షరాలు వచ్చినంత మాత్రాన, భాషలో ఏదో కొంచెం‌ పాండిత్యం సంపాదించినంత మాత్రాన అందరూ చదువరులు కాలేరు.  పైపై పండిత్యంతో సద్గ్రంథాలు చదివి ప్రతిచోటా ప్రతిపదార్థాలు పేర్చుకుంటూ చదువుకోవాలని చూస్తే గ్రంథకర్త హృదయం మనకు బోధపడదు.  ముక్కస్య ముక్కార్థః అన్నట్లు మనకు మనమే అరకొర అవగాహనతో వ్యాఖ్యానం చెప్పేసుకుంటే అసలు విషయం బోధపడటం అటుంచి తప్పుడు అర్థాలు బ్రహ్మాండంగా మన బుర్రలోంచి పుట్టుకొస్తాయి.  ఒక్కొక్క సారి, ఇలాంటి పొరపాట్లు మనలాంటి సామాన్యులే కాదు, మహామహా పేరుపొందిన విద్వాంసులూ చేస్తారు. 

ఒక పురాణమో, ఇతిహాసమో విడమరచి మనకు బోధించాలంటే మంచి పాండిత్యంతో పాటు ఆర్షసాహిత్య విభాగంలో మంచి అవగాహనా, అనుభవమూ ఉన్న వ్యాఖ్యాత కావాలి.  అటువంటి వారు మనకు ఎరుకపరిస్తే మనం వినయంగా విషయం తెలుసుకుని సంతోషించాలి. అందుకే పురాణశ్రవణం అనేది ఒకటుంది.  దాని విలువ మనం మళ్ళీ గ్రహించాలి అని మనవి చేస్తున్నాను.

మాక్స్ ముల్లర్ అనే విదేశీయపండితుడు మన వేదాలను గూర్చి పరిశోధన చేసాడు.  ఒక రకంగా, మన వేదాల విలువను విదేశాల్లో కూడా ప్రచారం చేసాడనీ మనం కృతజ్ఞతగా చెప్పుకోవచ్చును.  ఆయన లోపలి ఉద్దేశం ఎటువంటిదీ అన్నది నేను చర్చించను.  చెప్పొచ్చే దేమిటంటే, ఆ మాక్స్ ముల్లర్, వేదమంత్రాలకు ముక్కస్య ముక్కార్థాన్నే పిండి నాశనం చేసాడూ అని శ్రీఅరవింద యోగి వ్రాసారు.  ఒకానొక ఋక్కుకు ప్రతిపదార్థంగా 'ఇంద్రుడి రథం పోతూ ఉంటే, ఆ రథం గుర్రాల గిట్టలనుండి నేయి కారుతోందీ' అని వస్తుందట.  మాక్స్ ముల్లర్ అదే ఆ ఋక్కుకు తాత్పర్యంగా చెప్పి, ఇలా వేదంలో అర్థం పర్థం లేని ఋక్కులూ వగైరా చాలా ఉన్నాయీ అన్నాడట.  ఆ ఋక్కు అసలు మాక్స్ ముల్లర్ తెలుసుకో లేక పోయాడని హెచ్చరించి, అసలు అర్థాన్ని వివరిస్తూ ఆ ఒక్క ఋక్కు గురించీ, అరవిందుల వారు ఒక పుస్తకమే వ్రాసారు!  దీన్ని బట్టి అర్థం చేసుకోండి, పైపై అర్థాలు అందరూ తీయగలరు. కాని అసలు ఋషిహృదయం తెలిసినవారి వద్ద విని తెలుసుకోవటం మన విధి అని.

జీవితం శాశ్వతం‌ కాదు. ఈ విషయం తెలిసి సంసారం బంధం నుంచి విడుదల (ముక్తి) కోసం ప్రయత్నించాలి.  అల్పాయువులం అయిన మా బోటి వాళ్ళకి, మళ్ళీ మాబోటి వాళ్ళ జీవితాల గొడవ ఎరిగి ఏం లాభం?  బంగారం లాంటి అవకాశం ఈ‌ చిన్న జీవితం.  దీన్ని  భగవంతుడి కథలూ, భగవద్భక్తుల కథలూ చెవులారా వింటూ సార్థకం చేసుకోవాలి.  చూడండీ, ఈ‌ సత్రయాగానికి సాక్షాత్తూ యముడే వచ్చాడు ఇలా విష్ణుకథలు వినటానికి.  ఇది పూర్తయ్యే దాకా ఆయన ఎవ్వరి ప్రాణాలూ తీయడనుకుంటా. 

మందబుధ్ధి అయిన వాడు తన క్షణభంగురమైన దేహమే సర్వం అని మోహంలో ములిగి తేలుతూ నశిస్తాడు. చెప్పేదేముంది వాడి గురించి.
 
ఇలా శౌనకమహర్షి అంటే విని సూతుడికి చాలా సంతోషం కలిగింది.  శౌనకుడి తో ఆయన ఇలా అంటున్నారు.

కురుజాంగలాల (అంటే కౌరవ రాజ్యం సరిహద్దులు) దగ్గర కలి ప్రవేశించాడని పరీక్షిత్తు చెవిన పడింది.  అంటే అక్కడ దురాచారాలు ప్రబలాయయని విన్నాడన్న మాట.  పరిస్థితులు చక్కదిద్దుదామని ఆయన సైన్యంతో సహా బయలుదేరాడు.  

ఆయన రథానికి నీలి మబ్బు రంగు మేలు జాతి గుర్రాలున్నాయి.  రథం మీద జెండా గుర్తు  ప్రతాపానికి మారు పేరైన  సింహం. 

నాలుగుమూలలా ఆయన దిగ్విజయం చేసాడు.  చాలా చోట్ల కానుక లిచ్చి ప్రాంతీయ రాజులు పరీక్షిత్తును స్వాగతించారు. అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, అక్కడి వాళ్ళు తన పూర్వీకులైన పాండవుల్నీ, శ్రీకృష్ణస్వామి మహాత్మ్యాన్నీ గురించిన కథలు చెప్పగా,  కర్ణాకర్ణిగా విని చాలా సంతోషించాడు.  అలా వారి సత్కథలు చెప్పినవారికి భూరిగా కానుకలిచ్చి సత్కరించాడు.

ఇలా జైత్రయాత్ర చేసి పరీక్షిత్తు తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో సముద్రం దాకా తన అధికారాన్నీ, ధర్మవ్యవస్థనూ సుస్థిరం చేసాడు.  ఈ దిక్కుల్లో ఉన్న ఇలావృత్తం, రమ్యకం, హిరణ్మయం, హరివర్షం, కింపురుషం, భద్రాశ్వం, కేతుమాలం, భారతవర్షం అనే ప్రాంతాలన్నిటిలో‌ ధర్మరాజ్యం స్థాపించాడు.

ఉత్తర దిక్కున విజయ యాత్ర చేస్తున్నప్పుడు,   ఒక దారుణ దృశ్యం ఆయన కంట పడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి