9, ఆగస్టు 2013, శుక్రవారం

ప్రధమస్కంధం: 18. ఉత్తరకు పరీక్షిత్తు జన్మించటం

ఆవిధంగా ద్వారకా పురంలో  శ్రీకృష్ణులవారు హాయిగా విహరిస్తున్న వినోదలీలను సూతుడు శౌనకాది మునులకు చెప్పారు.

అప్పుడు శౌనకమహర్షి సూతుడితో  మరి పరీక్షిత్తు జననం ఎలా జరిగిందీ?  మీరేమో శ్రీకృష్ణులవారు ఉత్తరాగర్భంలో ప్రవేశించి పిల్లవాణ్ణి రక్షించటం వరకూ చెప్పారు.  ఆ కథను కొంచెం వివరంగా చెప్పండి.  ఆ పిల్లవాణ్ణి ఎలా శ్రీవారు రక్షించారూ.  ఆ బిడ్డ పుట్టి ఎలా పెరిగాడూ,  ఎలా ప్రవర్తించాడూ ఆ కథ అంతా చెప్పవలసిందీ అని అడిగారు.

మీరు శుకమహర్షి వచ్చి పరీక్షిత్తుకు విజ్ఞానం కలిగించాడని చెప్పారు గదా.  అదెలా జరిగిందీ?  ఏవిధంగా పరీక్షిత్తు మోక్షాన్ని అందుకున్నాడూ అన్నదీ చెప్పండి అని శౌనకులు సూతుణ్ణి అడిగారు.

అప్పుడు సూతపౌరాణికుడు ఇలా చెప్పాడు.

ధర్మరాజుగారు జనరంజకంగా రాజ్యం చేస్తున్నారని చెప్పుకున్నాం కదా.  ఆయన ఎంత పెద్ద సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉన్నా కూడా

తే.  చందనాదుల నాఁకట స్రగ్గువాఁడు
దనివి నొందని కైవడి ధర్మసుతుఁడు
సంపదలు పెక్కు గలిగియుఁ జక్రిపాద
సేవనంబులఁ బరిపూర్తి సెందకుండె

ఆ ధర్మరాజుగారికి ఎన్నెన్ని మహా సంపదలున్నాయి ఇప్పుడు.  ఆకలి వేస్తోం దనుకోండి ఒకడికి.  వాడికి ఇంత గంధం  పట్టుకొచ్చి ఇది పూసుకోవయ్యా నీ ఆకలి  తగ్గిపోతుందీ అని చెప్పం కదా? అలా గంధానికి ఆకలి తగ్గదు కదా? ఆ  ధర్మరాజుగారికీ ఒక ఆకలి లాంటిది ఉంది. అది విష్ణుపాదాలని సేవించుకోవటం‌ పైన ఆకలి.  అటువంటి ఆకలి బాగా ఉన్నవాడికి,  ఇవిగోనయ్యా సంపదలూ, ఇవిగో నయ్యా రాజభోగాలూ అంటూ ఎన్ని కుమ్మరించినా ఆయన మీద ఏమి లాభం? ఆ సంపదలూ భోగాలూ‌ అన్నీ కూడా ఆకలి వేసిన వాడికి అన్నం బదులుగా దొరికిన మంచి గంధాల్లాంటి వన్న మాట.  అలా, మన ధర్మరాజుగారు భోగాల్లో నిండా ములిగి ఉన్నా,  అవి ఆయనకు హరిసేవలాగా తృప్తి కలిగించేవి కాలేక పోయాయి. 

అలా ఆయన నిర్మోహుడై రాజ్యం చేస్తున్నారు. ఇంతలో అర్జునుడి కోడలు ఉత్తరకు పదినెలలూ‌ నిండి ప్రసవసమయం వచ్చింది. 

ఇంతలో అశ్వత్థామ వేసిన అస్త్రం వలన ఆ పొట్టలో ఉన్న పిల్లవాడికి అగ్ని సోకినట్లుగా బాధ పుట్టింది. 

అయ్యో ఇప్పుడు నా గతి యేమిటీ  అని పిల్లవాడు గగ్గోలు పెట్టాడు.  ఓరి దేవుడా  ఇలా పొట్టలోఉండి ఈ బాణాగ్నికి  దొరికి పోయాను.  నా తల్లి అప్పుడప్పుడూ నేను  దిక్కులేని దాన్నీ అని యేడుస్తూ ఉండటం వింటూ ఉన్నానే.   ఇంక నా కేది  దిక్కూ అని బాధ పడ్డాడు.  అయ్యయ్యో ఇప్పుడు ఈ‌ అగ్నిబాణం‌ నన్ను చంపేస్తుంది.  దానితో మా  అమ్మా చనిపోతుందే ఎలా అని గడబిడ పడిపోయాడు.  అన్నట్లు,  ఇలా నన్ను చంపటానికి అగ్నిబాణం వస్తే వచ్చి విష్ణువు స్వయంగా వచ్చి రక్షిస్తాడూ అని మా అమ్మ అంటూ ఉంటుంది గదూ.   అలా ఆయన  ఇంకా రాడేం?

శా.  రాఁడా సమస్తభూతములలో రాజిల్లువాఁ డిచ్చటన్
లేఁడా పాఱుని చిచ్చఱమ్ముఁ దొలఁగన్ లీలాగతిం ద్రోచి నా
కీఁడా నేఁ డభయప్రదాన మతఁ డూహింపన్ నతత్రాత మున్
కాఁడా యెందఱఁ గావఁ డే యెడల మత్కర్మంబు దా నెట్టిదో

అయ్యో. సమస్తమైన జీవుల్లోనూ‌ ఆ విష్ణుదేవుడు ఉంటాడని  చెబుతారు గదా.  మరి ఆయన ఇక్కడ లేడా?  ఎవరో బ్రాహ్మణుడట నా మీద అగ్నిబాణం వేసాడట.  అదేం‌ ఘోరమో!  ఆ బాణాన్ని ఆయన విలాసంగా పక్కకు తోసి వేసి నన్ను రక్షించవచ్చు గదా? ఈ‌ రోజు నా కోసం‌ రాడా?  నాకు అభయం ఇవ్వడా? అడిగిన వాళ్ళందర్నీ కాదనకుండా రక్షిస్తాడంటారు కదా?  ఎంతమందినో ఇంతకు ముందు అలా రక్షించాడంటారే? ఎందుకు రావటం లేదూ‌ నా కోసం? నా కర్మం‌ ఎలా ఉందో కదా?

ఇలాఉత్తర కడుపులో బిడ్డ కొట్టుమిట్టాడు తున్నాడు.  అతని పని వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది పాపం.  ఆ సమయంలో

సీ.  మేఘంబు మీఁది క్రొమ్మెఱుఁగు కైవడి మేని
      పై నున్న పచ్చని పటమువాఁడు
గండభాగంబులఁ గాంచన మణిమయ
      మకరకుండలకాంతి మలయువాఁడు
శరవహ్ని నడగించు సంరంభమునఁ జేసి
      కన్నుల నునుఁగెంపు కలుగువాఁడు
బాలార్కమండల ప్రతిమానరత్న హా
      టకవిరాజిత కిరీటంబువాఁడు
తె. కంకణాంగద వనమాలికావిరాజ
మానుఁ డసమానుఁ‌ డంగుష్ఠమాత్రదేహుఁ
డొక్క గదఁ‌ జేత దాల్చి నేత్రోత్సవముగ
విష్ణుఁ డావిర్భవించె నవ్వేళయందు

ఈ విధంగా శిశువు ధ్యానించే సమయంలో కళ్ళకు పండుగగా విష్ణుమూర్తి ఉత్తరాదేవి గర్భంలో ఆవిర్బావించాడు.  మేఘంమీద ఉండే మెరుపు తీగలాగా ఆయన నల్లంటి దేహం మీద బంగారు వన్నె ఉత్తరీయం శోభాయమానంగా ఉంది.  ఆయన చెవులకు దివ్యమణులు పొదిగిన బంగారు మకర కుండలాలున్నాయి.  వాటి మెరుపులు ఆయన చెక్కిళ్ళమీద ప్రతిబింబిస్తున్నాయి.  బాణం వల్ల పుట్టిన మంటను చల్లార్చాలని కోపంగా వచ్చారేమో ఆయన కళ్ళు  కొంచెంగా ఎరుపెక్కి ఉన్నాయి.   ఆయన తలమీద అనేకదివ్యమణులతో ఉన్న బంగారు కిరీటం లేతసూర్యుడిలా ప్రకాశిస్తోంది.   బంగారు కంకణాలు భుజకీర్తులూ ధరించి చేతిలో ఒక గద పుచ్చుకుని ఆయన ప్రత్యక్షం అయ్యారు.

ఆ పిల్లవాడు ఎవరీయనా గదపుచ్చుకుని ఈ బాణాగ్నిని చెదరగొట్టి ఎంతో దయతో నన్ను రక్షిస్తున్నాడూ అని అశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ మహానుభావుడు పని పూర్తిచేసుకుని ఎలా హఠాత్తుగా వచ్చాడో అలాగే హఠాత్తుగానే మాయమై పోయాడు.

అప్పుడు మంచి శుభసమయంలో, అన్నిగ్రహాలూ అనుకూలంగా ఉన్న లగ్నంలో,  పాండవులకు వంశాంకురంగా ఉత్తర కడుపున ఉన్న పిల్లవాడు భూమి మీదకు వచ్చాడు.  అలా పిల్లవాడు పుట్టగానే ధర్మరాజులవారు గొప్ప ఉత్సవం‌ జరిపించారు.   బ్రాహ్మణోత్తముల్ని రప్పించి పుణ్యాహం చదివించారు.  భూరిగా గోదానాలూ‌, భూదానాలూ చేసారు.  గొప్పగా సంతర్పణ చేయించారు.

అప్పుడు ధర్మరాజులవారితో బ్రాహ్మణోత్తములు ఒక మాట అన్నారు.  మహారాజా,  భగవంతుడైన విష్ణువు అనుగ్రహించి మీ వంశం అంతరించకుండా కాపాడాడు.  విష్ణువు దయవల్ల, మీ వంశాన్ని నిలబెట్టటానికి పుట్టిన ఈ పిల్లవాడికి విష్ణురాతుడు అనే పేరు చాలా బాగుంటుంది.  (విష్ణురాతుడు అంటే విష్ణువు తీసుకు వచ్చినవాడు అని అర్థం)

ధర్మరాజులవారు ఆ బ్రాహ్మణ వచనాలకు చాలా సంతోషించారు.  అయ్యలారా,  మా పెద్దలంతా గొప్ప గొప్ప వీరులు, దయాశాలురు.  వాళ్ళంతా రాజర్షులు. ఈ‌ పిల్లవాడు  మా పెద్దల పేరు నిలబెడతాడా?  తనని రక్షించిన మహానుభావుడైన విష్ణుదేవుడి మీద భక్తి కలిగి ఉంటాడా?  అదీ దయచేసి చెప్పండి అని అడిగారు.

ఆ మాటలకు బ్రాహ్మణోత్తములు సమాధానం చెప్పారు.

ఓ‌ ధర్మరాజా,  నీ‌ కేమీ  సందేహం అక్కర్లేదయ్యా.  వీడు ఇక్ష్వాకు మహారాజు వంటి వాడై జనాన్ని రక్షిస్తాడు.  శ్రీరామచంద్రుడిలాగా సత్యధర్మాలను నిలబెడతాడు.  శరణన్నవాడిని రక్షించటంలో శిబికే సాటివస్తాడు. దానశీలంలో‌ తరగని గని వంటివాడు.  దుష్యంతుడి కొడుకైన భరతుడితో‌ సాటివచ్చే కీర్తి సంపాదిస్తాడు.  అర్జునుళ్ళా, కార్తవీర్యార్జునుళ్ళా విలువిద్యలో సాటి లేని వీరుడౌతాడు. 

సముద్రుడిలాగా తనకు తానే‌ సాటి యైన మహాపురుషు డౌతాడు.  అపరాధుల పాలిటి అగ్నిహోత్రుడే అవుతాడు.  ప్రజలకు తల్లీ తండ్రీకూడా తానే అనిపించు కుంటాడు. 

ఇంకా ఏం‌ చెప్పమంటావయ్యా?  విను

సీ. సందర్శనంబున జలజాతభవుఁ డనం
      బరమప్రసన్నత భర్గుఁ డనగఁ
నెల్ల గుణంబుల నిందిరా విభుఁ‌ డన
      నధిక ధర్మమున యయాతి యనఁగ
ధైర్యసంపద బలిదైత్యవల్లభుఁ‌ డన
      నచ్యుతభక్తిఁ బ్రహ్లాదుఁ డనగ
రాజితోదారత రంతిదేవుండన
      నాశ్రయమహిమ హిమాద్రి యనఁగ
తే. యశము వర్ధించుఁ బెద్దల నాదరించు
నశ్వమేధంబు లొనరించు నాత్మసుతుల
ఘనుల బుట్టించు దండించు ఖలులఁ బట్టి
మానధనుడు నీ‌ మనుమఁడు మానవేంద్ర

నీ మనవడు, బ్రహ్మలాగా అందరినీ సమదృష్టితో చూస్తాడు.  అందరినీ అనుగ్రహించటంలో శివుడే అనుకో.  సమస్తకల్యాణగుణాభిరాముడై విష్ణువంతవాడే అవుతాడు.  ధర్మనిష్ఠలో‌ యయాతీ, ధైర్యంలో బలీ, భక్తిలో ప్రహ్లాదుడూ, ఔదార్యంలో‌ రంతిదేవుడూ  ఔతాడు.   పెద్దలపట్ల ఆదరం కలవాడూ హిమాలయంలా సత్పురుషులందరికీ ఆశ్రయం ఇచ్చేవాడూ అవుతాడు. అశ్వమేధమూ చేస్తాడు.  ఈ‌ పిల్లవాడి సంతానం కూడా గొప్పవాళ్ళే అవుతారు.

ఇలా అద్భుతమైన జాతకం‌కల ఈ పిల్లవాడు చివరిరోజుల్లో అన్ని విధాలైన బంధాలూ తెంపుకుని ఆత్మవిజ్ఞానం కలవాడై శ్రీహరిని చేరుకుంటాడు.

మహారాజా మరొక్క ముఖ్యవిషయం.  ఈ పిల్లవాడు,  తాను తల్లి కడుపులో ఉండగా,  తనకు దర్శనం ఇచ్చిన మహానుభావుడు ఎవరా అని ప్రపంచం అంతా పరిక్షించి చూస్తూ ఉంటాడు.  కాబట్టి ఈ మీ వంశోధ్ధారకుడు పరీక్షిత్తు అనే పేరుతో ప్రపంచప్రఖ్యాతి గడిస్తాడు.

ఇలా జాతకఫలం వేదవిదులైన బ్రాహ్మణులు చెప్పగా యుధిష్టిరులవారు చాలా సంతోషించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి