4, ఆగస్టు 2013, ఆదివారం

ప్రథమస్కంధం: 12. కుంతీమహాదేవి భక్తి తత్పరత

ఆద్యంతరహితుడూ, జగదీశ్వరుడూ అయిన శ్రీకృష్ణపరమాత్మ హస్తినా పురం నుండి వీడ్కోలు తీసుకుని వెళుతున్నారు.  ఆసమయంలో ఆయనతో ప్రసంగించాలని కుంతీమహాదేవి తమ కోడలు ద్రౌపదీమహాదేవితో కలసి చేర వచ్చారు.  శ్రీకృష్ణులవారితో కుంతీదేవి తన మనసులో మాటలు మనవిచేసుకోవటం మొదలు పెట్టింది.

క. పురుషుం డాఢ్యుడు ప్రకృతికిఁ
బరుఁ‌ డవ్యయుఁ డఖిలభూత బహిరంతర్భా
సురుఁడును లోకనియంతయుఁ
బరమేశ్వరు డైన నీకు బ్రణతు లగు హరీ

ఓ శ్రీహరీ, ప్రకృతికి ఆవల వెలుగొందే మహానుభావుడవు.  శరీరధారణం చేసే అన్నిభూతాలకోసం లోకాలను సృష్టించి, ఆ లోకాలను వాటికి నివాసస్థానాలుగా చేసి వాటిలో విహరిస్తూ ఉంటావు. ఆయా భూతాలలో కూడా అంతర్యామిగా ఉండే పరమపురుషుడివి  నువ్వే.  అందుచేత సకల జీవులకు లోపలా బయటా కూడా తెలియబడే పరమతత్వానివి నేవే.  నీవు ఏర్పరచిన అన్ని లోకాలను చక్కగా నడిపించే జగన్నింయంతవూ నీవే.   సర్వసృష్టికి అధిష్టాన దైవతం అయిన పరమేశ్వరుడవు నీవు. ఓ‌ మహత్మా నీకు నా నమస్కారాలు.

పరమహంసలూ, రాగద్వేషాలకు అతీతులూ, పరమనిర్మలమైన చిత్తం కలవారూ అయిన యోగులకు కూడా నిన్ను నేరుగా తెలుసు కోవటం సాధ్యం కాదు.  అంతటి వాళ్ళ కైనా సరే, నువ్వు ఒక తెర వెనుక ఆడుతున్న నటుడిలా, నీ మాయ అనే తెర వెనుక నుండి మాత్రమే దర్శనం‌ ఇస్తున్నావు.  మాబోటి వాళ్ళం సంసారంలో పడి ఉన్న మూఢబుధ్ధులం.  మా కైతే నీ దర్శనం ఆ మాత్రం‌గా నైనా దొరకనే దొరకదు కదా.  మాకు తెలిసిందల్లా నీకు పరమప్రీతికరమైన భక్తియోగంతో, నిన్ను కొలుచుకుని సంతోషంగా ఉండటం ఒక్కటే.  అందుకే నిత్యం మేమంతా శ్రీకృష్ణా, వాసుదేవా, దేవకీనందనా, నందకుమారా, గోవిందా, పద్మనాభా, పద్మమాలాధరా, పద్మలోచనా, పద్మాక్షా, పద్మపాదా, హృషీకేశా అని కీర్తిస్తూ, నమస్కరిస్తూ ఉంటాం.

లక్క ఇంట్లో నేనూ నా కొడుకులం కట్టకట్టుకుని చావకుండా రక్షించింది నువ్వే.
దుర్యోధనుడు పెట్టించిన విషాహారంతో నా కొడుకు భీముడు చావకుండా రక్షించింది నువ్వే.
దుశ్శాసనుడు చీరలొలుస్తుంటే నా కోడలు ద్రౌపది మానం రక్షించింది నువ్వే.
మహాయుధ్ధంలో భీష్మద్రోణాదుల బారినుండి నా కొడుకుల్ని రక్షించింది నువ్వే.
ఇప్పుడు ఉత్తర కడుపులో‌ని వంశాకురాన్ని అశ్వత్థామ బారి నుండి రక్షించింది నువ్వే. 
మమ్మల్ని అడుగడుగునా ఎంతో ప్రేమతో కరుణతో రక్షిస్తున్నది నువ్వే.
మే మంటే నీ కున్న అభిమానాన్ని వర్ణించటానికి మాటలు చాలవు నాయనా.

నీ చిన్నతనంలో, దుష్టకంసుడి బారి నుండి నీ‌ తల్లిదండ్రుల్ని రక్షించినట్లే, ఇప్పుడు మమ్మూ ఈ‌ ధృతరాష్ట్రుడూ ఆయన దుష్టసంతానమూ పెట్టే కష్టాల్నుంచి రక్షించావు.

క. జననము నైశ్వర్యంబును
ధనమును విద్యయును గల మదఛ్చన్ను లకిం
చన గోచరుఁ డగు నిన్నున్
వినుతింపఁగలేరు నిఖిల విభుధ స్తుత్యా

గొప్ప గొప్ప వంశాల్లో జన్మించామని విర్రవీగే వాళ్ళూ, ఐశ్వర్యం చూసుకుని మురిసే వాళ్ళూ, విద్యావంతులమని గర్వించేవాళ్ళూ నిన్ను గురించి ఏమీ తెలుసుకోలేరు.  నీవు కేవలం ఎలాంటి అల్పబుధ్ధీ లేని వాళ్ళకే కొంచెం‌ తెలిసివస్తావు.  అందుకే అందరు బుధ్ధిమంతులూ ఏ విషయంలోనూ‌ గర్వించక, నిత్యం నిన్ను ప్రశంసిస్తూ సంతోషంగా ఉంటారు.

నువ్వు భక్తులనే‌ ధనంగా భావించి సంతోషించే వాడివి.  ధర్మం, అర్థం కామం అనే వాటికి అతీతమైన మోక్షం అనే దానిని పొందితేనే నిన్ను తెలుసుకో గలిగేది.  పరమానందమే స్వరూపం‌గా గల నువ్వే భక్తులకు ఆ మోక్షాన్ని అనుగ్రహించే వాడివి. లోకాల్ని నడిపించే కాలం నీ స్వరూపమే. ఈ సృష్టి అంతా నీ వైభవమే. నీకూ తుదీ మొదలూ‌ అంటూ ఏమీ‌ లేదు - నిత్యుడివి.  జీవులందరికీ అనుగ్రహం పంచే నీకు నా నమస్కారాలు. 

నీకు ప్రియమైనదీ లేదు, ఇష్టం‌కానిదీ‌ లేదు.  జన్మమూ‌ కర్మమూ అనే బంధాలు పరమపురుషుడి వైన నీకు లేనే లేవు.  అయినా, లోకాన్ని ఉధ్దరించటం కోసం చేప మొదలు మనిషి వరకూ అనేకరూపాల్లో ఈ ప్రపంచం లోకి వస్తూ‌ ఉంటావు.

నువ్వు ప్రపంచాన్ని ఎంత సమ్మోహ పరుస్తావు!  చల్లకుండ పగుల కొట్టి, అందుకు అమ్మ కోపించిందని కళ్ళు నులుపుకుంటావూ! నీ లీలలు వర్ణించ నా తరమా?

నువ్వు దేవకీవసుదేవులకు పూర్వపుణ్యాల పంటగా పుట్టావని కొందరంటారు.
నువ్వు ఈ‌ ధర్మరాజును కీర్తిమంతుడిని చేయాలని వచ్చావని కొందరంటారు.
నువ్వు భూమి భారం తీర్చటానికే అవతరించారని కొందరంటున్నారు.
నువ్వు సజ్జనులనూ నీ‌ భక్తులనూ సంరక్షించటానికి వచ్చావని కొందరంటారు.

మ. నినుఁ జింతించుచుఁ బాడుచుం‌ బొగడుచున్  నీ‌ దివ్య చారిత్రముల్
వినుచుం జూతురు గాక లోకు లితరాన్వేషంబులం జూతురే
ఘనదుర్జన్మ పరంప రాపహరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతం బైన భవత్పదాబ్జ యుగమున్ విశ్వేశ విశ్వంభరా.

ఓకృష్ణా, విశ్వానికి పోషకుడివీ, అధిపతివీ‌ అయిన ప్రభూ.  ఈ‌ ఘోరమైన పెద్ద జన్మచక్రంలో ఇరుక్కున్న వాళ్ళను దాని బారి నుండి రక్షించ గలిగేది నువ్వే. అందు చేత  నిత్యం‌మహా యోగులు నీ‌ పాదాలనే స్మరించి కీర్తిస్తున్నారు.  నిన్ను ధ్యానిస్తూ, నీ‌ గురించి గానం చేస్తూ, నీ‌ అధ్భుత చరిత్రను నిత్యం పొగడుతూ, ఆ నీ‌ దివ్య చరిత్రలే వింటూ లోకులు నిన్ను తెలుసు కుంటున్నారు. అలా భక్తి చూపలేని వాళ్ళు మరే ఇతర ఉపాయాలతోనూ నీ‌ గురించి ఎన్నటికీ తెలుసుకోలేరు కదా!
  
నీ‌ ఆశ్రయం మాకు దూరం చేసి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే మే మంతా జీవం లేని వట్టి అట్టబొమ్మలమై పోతాం. నీ‌ కృప ఉన్న చోట అంతా సుభిక్షమే కదా!

ఉ. యాదవులందుఁ పాండవులయందు నధీశ్వర నాకు మోహ వి
ఛ్ఛేదము సెయుమయ్య ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయ బుధ్ధి న
త్యాదరవృత్తితోఁ గదియు నట్లుగఁ జేయఁగదయ్య యీశ్వరా

ఓ జగదీశ్వరా! కృష్ణా. దయచేసి ఇంక నాకు నా పుట్టింటి వారైన యాదవుల మీదా, నా అత్తింటి వారైన పాండవవంశం మీదా ఇన్నాళ్ళుగా ఉన్న బంధుమోహాన్ని నాశనం చేయవయ్యా. ఇక చాలు. గంగ సముద్రాన్ని చేరుకుంటున్నట్లుగా, నా బుధ్ధికూడా పవిత్రమై, నీ‌ పాదపద్మాలను చేరుకునేలా అనుగ్రహించ వలసిందిగా ప్రార్థిస్తున్నాను.

శా. శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా
లోకద్రోహి నరేంద్ర వంశ దహనా లోకేశ్వరా దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా నిర్వాణసంధాయకా
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే‌ భవలతల్ నిత్యానుకంపానిధీ

ఓ శ్రీకృష్ణా.  నువ్వు యదువంశానికి గొప్ప అలంకారానివి. అర్జునుడికి పరమ మిత్రుడివి. సమస్తజీవులలో ఉన్న సాత్వికభావానికీ సముద్రం వంటివాడివి. లోకద్రోహులైన రాజల వంశాలను దహించిన కార్చిచ్చువు. సర్వలోకాలకు అధిపతివి. సమస్త దేవతా సమూహాలకీ, బ్రాహ్మణులకీ, గోధనానికీ ఏ‌ చిన్న కష్టం వచ్చినా తీర్చే మహానుభావుడివి.  భక్తులకి మోక్షం ఇచ్చే వాడివి. నాయనా, నా భవబంధాలను తెంచివేయవయ్యా. నువ్వు నిత్యం భక్తులమీద దయ చూపే వాడివి. మీకు మొక్కుతున్నాను. ఇదే నా కోరిక.

ఇలా అనేకవిధాలుగా, కుంతీ‌మహాదేవి తనివితీరా శ్రీకృష్ణులవారిని కీర్తించింది. ఆయన కూడా ఆవిడ పలికిన ప్రియవాక్యాలకు సంతోషం వెలిబుచ్చాడు. ఆ తరువాత ఆవిడ వంక చూసి, ఒక జగన్మోహనమైన చిరునవ్వు నవ్వి ఊరకున్నాడు. [అంటే, ఇంకా సమయం కాలేదని ఆమెకు తన చిరునవ్వుతో తిరిగి మాయామోహం‌ కలిగించి, తన మేనల్లుడూ అనే‌ దృష్టిని కలిగించాడు.]

అంతలో ధర్మరాజులవారు వారి దగ్గరకు వచ్చారు.

శ్రీకృష్ణా నీవు మా దగ్గర ఇకొంచెం కాలం ఉండవయ్యా అని పరిపరి విధాలుగా అభ్యర్థించాడు.

శ్రీకృష్ణులవారు కూడా వాళ్ళందరినీ సంతోష పరుస్తూ‌ తన ద్వారకా ప్రయాణాన్ని మానుకున్నారు.

2 కామెంట్‌లు:

  1. శా. శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా
    లోకద్రోహి నరేంద్ర వంశ దహనా లోకేశ్వరా దేవతా
    నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా నిర్వాణసంధాయకా
    నీకున్ మ్రొక్కెద ద్రుంపవే‌ భవలతల్ నిత్యానుకంపానిధీ

    నిత్య పారాయణ చేయవలసిన పద్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారూ,
      తప్పకుండా ఇది నిత్యపారాయణం చేయవలసిన పద్యమే.
      కొన్ని పద్యాలను కంఠస్థం చేయవలసినదిగా సూచిద్దామని మొదట్లో అనుకున్నాను.
      అయితే, ఇదేమన్నా తరగతివాచకమా పద్యాలు కంఠస్థం చేయటానికి అని కొందరు నిష్టూరంగా మాట్లాడవచ్చునని భావించి అలాంటి సూచనలు జోడించటం లేదు.
      అసలు ఈ‌ భాగవతం బ్లాగును చదివే పుణ్యాత్ములను వ్రేళ్ళ మీద లెక్కపెట్టవచ్చును.
      చదివే మీ వంటి ప్రాజ్ఞులందరికీ ఏ పద్యాలు కంఠస్థం చేసుకుంటే బాగుంటుందో నేను సూచించవలసిన పనే లేదు.

      తొలగించండి