29, ఆగస్టు 2013, గురువారం

ద్వితీయస్కంధం: 03. సంసారం నుండి తొలగిపోతే మార్గం

ఆ పరీక్షిన్మహారాజుకి శుకయోగి మాటలు అమితానందం కలిగించాయని వేరే చెప్పాలా?

ఆ శుకయోగీంద్రుడు ఇంకా ఇలా అన్నాడు

ఓ‌ మహారాజా!  నువ్వెందు కయ్యా బెంగ పడతావూ?  నీ కైతే మరొక ఏడు రోజులకి కాని జీవితానికి ముగింపు రాదు కదా?  అందుచేత, నీ చేతిలో బోలెడు సమయం ఉంది.  ఆ మృత్యుఘడియలు మీదకు వచ్చేలోగా నువ్వు పరలోకాన్ని సాధించటం కోసం‌ ప్రయత్నించ వచ్చును.  ఆ సాథనా ప్రయోజనంగా పరమశుభాన్ని సంపాదించుకోనూ వచ్చును.

పరమశుభం అనే మాట వేదాంత సాహిత్యంలో అప్పుడప్పుడు దర్శనం ఇస్తూ ఉంటుంది.  ఒక్కొక్క సారి శుభం అనే వాడతారు కూడా.  దీని అర్థం మోక్షం అనే.  మోక్షభూమికలు అని ఏడింటిని చెబుతారు.  వాటిలో మొదటిదాని పేరు శుభేఛ్ఛ.  దాని అర్థం శుభం (మోక్షం) పొందాలీ అన్న కోరిక.

చివరి రోజులు దగ్గర పడినప్పుడు దేహ ధారణం చేసి ఉన్న జీవుడు ఏమీ కంగారు పడకూడదు.  తన దేహమూ, తన భార్యాపుత్రులూ, తన బంధుమిత్రులూ అంటూ తనని అంటి పెట్టుకుని ఉన్న ఈ‌ బంధాలన్నింటి మీదా మోహం వదిలి పెట్టెయ్యాలి. ఇంక నా కేమీ కోరికలు వద్దూ అని మనస్సుని చక్కగా ధృఢంగా ఉంచుకోవాలి.  అలా అయితేనే అన్ని  మోహాలూ వదిలి పెట్టటం కుదురుతుంది సుమా.  

నిష్కామం,  అంటే కోరికలు లేకపోవటం అనేది యోగసాథన తగినంత పండితే కాని నిజంగా కుదరదు.  కాని ఇంక ఏ కోరికలూ వద్దూ అని ధృఢంగా అనుకోవటం అంటూ మొదట జరగాలి కదా?

ఇంకా ఇంటి మీద వ్యామోహం ఏమిటి.  అది వదిలేసాడు కదా?  అందు చేత పుణ్యక్షేత్రాలు దర్శించుకుందుకు బయలు దేరాలి.   పుణ్యనదుల్లో స్నానాలు చేయాలి. 

పోతనగారు అంతకాలంబు డగ్గరినన్ అన్నారు.  మనం దానిని వ్యావహారికంలో చివరి రోజులు దగ్గర పడ్డప్పుడు అన్నాం.  ఇక్కడ చివరి రోజులు దగ్గర పడినప్పుడు అన్నదాని గురించి ముందు మరి కొంచెం‌ ఆలోచిద్దాం. ఇప్పుడు  శుకయోగి పుణ్యతీర్థాలు సేవించుకో పో, అంటున్నారు.  

వయస్సు ఉడిగి, జవసత్వాలు కొడిగడుతున్న శరీరంతో పుణ్యక్షేత్రాలకు పోవటం ఎలా సాధ్య పడుతుందీ?  పడదు కదా?  అంటే లోతైన అర్థం వేరే ఉండాలి. ఈ రోజుల్లో అయితే సరాసరి పుణ్యక్షేత్రానికి విమానంలో వెళ్ళి, ప్రముఖుడి హోదాతోనో, అలాంటి వారి సిఫార్సుతోనో త్వరగా దర్శనం చేసేసుకోవచ్చును.  పూర్వం విమానాలు కాదు గదా, కనీసం మంచి నడకదార్లూ తక్కువగానే ఉండేవి అనేక క్షేత్రాలకు.  కాశీకి పోయినవాడూ, కాటికి పోయినవాడు ఒకటే లాంటి సామెతలు అందుకే‌ పుట్టాయి.  అలాంటి దీర్ఘప్రయాసల కోర్చి వృధ్ధాప్యంలో ఎవరూ పుణ్యక్షేత్రాలను దర్శించటానికి పోలేరన్నది నిర్వివాదం. 

మనిషి జీవితంలో గృహస్థుగా బాధ్యతల నిర్వహణ అనేది ధర్మయుక్తంగా నిర్వహించి తీరవలసిన కర్తవ్యం.  నడివయస్సు ఒక స్థితికి వచ్చేసరికే, పిల్లలకు అందించవలసిన వర్ణాశ్రమ సంబధమైన సంస్కారాలూ,  చేయవలసిన కన్యాదానాలూ, కుటుంబం సజావుగా సాగటానికి కావలసిన ధనసంపాదనా అన్నీ పూర్తి చేసుకోవచ్చును.  ఆపైన పెద్దవారు చేసేది అనవసరమైన బాదరబందీ లన్నీ నెత్తిన వేసుకుని అందరి మీద పెత్తనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉండటమే! ఇక లౌకికంగా చేయవలసిన కార్యక్రమాలు లేవని ఒక పట్టాన మనస్సు అంగీకరించదు. నిజానికి మనిషికి ఇవే చివరి రోజులు. ఒకటయ్యేది, పదివేలయ్యేది ఈ రోజుల్లో భగవచ్చింతన మొదలు పెట్టాలి కనీసం. ఈ‌ రోజులు  మరీ ముదరబెట్టెస్తే, మరి ఇల్లు దాటే పరిస్థితి ఉండటం కష్టమే!

పుణ్యక్షేత్రాలు దర్శించటం అనేది మనశ్శుధ్ధికి సాధనం.  అన్నీ వదిలేసాం అనుకోవటం తేలికే!  కాని ఇల్లు దాటి నాలుగు రోజులు గడిపితే కాని నిజంగా ఎంత వరకూ బంధాలకు దూరం కాగలుగుతున్నామో తెలియదు కదా? 

ఇక పోతే, మహాభారతంలో ఒక సందర్భంలో భీష్మాచార్యుడికి పులస్త్యబ్రహ్మ దర్శనం ఇచ్చారు. తమ దర్శనం వృధాపోరాదు కాబట్టి ఏదైనా కోరుకోమంటే, భీష్ముడు అయ్యా, నాకు పుణ్యక్షేత్రాలూ నదుల గురించీ,  వాటి ప్రభావాల గురించీ‌ విపులంగా చెప్పవలసిందీ అని అడిగారు. పులస్త్యబ్రహ్మ అనేక విషయాలు చెప్పారు. పుణ్యక్షేత్రాలూ నదులూ అనేవి అనేక మంది ముక్తసంగుల యొక్క పాదస్పర్శచేత, స్నానంచేత పవిత్రం అయినవి.  వారి దివ్యప్రభావాన్ని పొదుగుకుని ఉంటాయి నిత్యం.  అక్కడకు మనబోటి వారు పోయి భక్తిశ్రధ్ధలతో సేవిస్తే, మనకు ఆ మహానుభావుల యొక్క దివ్యవిభూతి వలన కొద్దో గొప్పో సత్ప్రభావం కలుగుతుంది.  అంటే, మన మనస్సులు ఆ ప్రభావాల వలన పవిత్రం అవుతాయి.  దాని పర్యవసానంగా మనకు ప్రాపంచిక కశ్మలాలను సుఖాలుగా భావించే పామరత్వం నుంచి కొంచెమైన మార్పు కలిగి మోక్షసాధన పట్ల ఆసక్తీ భక్తీ కలుగుతాయి.

ఒంటరిగా శుచియైన ప్రదేశం చూసుకుని శాస్త్రోక్తంగా కృష్ణాజినమో, దర్భాసనమో, శుభ్రవస్త్రమో పరుచుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. 

సాధకుడు సదాశయం కలవాడు అయితేనే చాలదు. సాధనాక్రమం, దానికి ఉపకరణాలుగా ఉండే సాధనసంపత్తీ అంతా కూడా ఉదాత్తంగా ఉండాలి.  మురికి గిన్నెలూ తెడ్లూ వాడుతూ, తినటాకికి పనికివచ్చే  వంట చేయలేం కదా?  అవధూతల స్థాయి మహానుభావులతో పోలికలు తెచ్చుకోకండి.  ఎంతకాలం 'నేను' అనే‌ భావనతో ఈ‌ లోకంలో  తిరుగుతూ‌ ఉంటామో అంతకాలమూ సాధకులమే.  ఈ‌ ప్రకృతి యొక్క మాయకు లోబడ్డ వాళ్ళమే!  ఆహారమే అవసరం లేని అవధూతకు గిన్నెలూ‌ అక్కరలేదు వంటా అక్కర లేదు.  అది వేరే‌ స్థితి.

ఇలా కూర్చుని ప్రణవాన్ని ధ్యానం చేసుకోవాలి.  దాన్ని బ్రహ్మబీజం అంటారు.  అది ముల్లోకాల్నీ‌ పవిత్రం చేసే‌ పరమమంత్రం. 

ప్రణవం అంటే ఓం‌కారం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని చెబుతారు. ఓం‌కారం పరబ్రహ్మానికి ఒక సంకేతంగా చెప్పుకుంటాం. గీతాశాస్త్రం కూడా ఇదే చెబుతోంది.  ఈ‌ ఓం‌కారంలో అ-ఉ-మ అనే మూడు బీజాలు సంపుటిగా ఉన్నాయి.  ‌ఓం‌కారం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.

ఈ‌ ధ్యానంతో ఐదు ప్రాణవాయువులనీ జయించి అదుపులోకి తెచ్చుకోవాలి. 

ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని ఐదు రకాలు ప్రాణవాయువులు.  ఇవి శరీరాన్ని ఆశ్రయించుకుని వివిధక్రియలు చేస్తూ ఉంటాయి. వీటిని అదుపుచేసే ప్రక్రియకే‌ ప్రాణాయామం అని పేరు.

ఈ‌ ఇంద్రియాలు నిత్యమూ ప్రాపంచిక విషయాల వెంట పంచకల్యాణి గుర్రాల్లాగా పరుగులు పెడుతూనే ఉంటాయి.  అలా పరుగులు తీసింది చాలు అనుకోవాలి.  వాటి పరుగులు ఆపేందుకు గాను, మనస్సుని పగ్గంగానే,  బుధ్ధిని సారథిగానూ నియమించాలి.

ఇక్కడ దేహం అనేది ఒక రథంగా భావించి చెబుతున్నారు. ఈ రథానికి రథికుడు - అంటే అందులో దర్జాగా ప్రయాణం చేసేవాడు - జీవుడు.  ఈ జీవుడికి,  దేహం అనే రథాన్ని నడపటానికి గాను ఉన్న సారథి పేరు బుధ్ది.  ఆ బుధ్ధి అనే సారథి చేతులో ఉన్న పగ్గం పేరు మనస్సు.  ఈ‌ మనస్సు అనే పగ్గానికి కట్టబడి ఉండి, దేహరథాన్ని పరుగులు పెట్టించే గుర్రాలే  పంచేంద్రియాలు అనేవి.   సారథి ఐన బుధ్ది నిర్లక్ష్యంగా ఉండి,  మనస్సు అనే పగ్గాన్ని సరిగ్గా పట్టుకోక పోతే, దేహం అనే బండిని లాగే ఇంద్రియాలు అనే గుర్రాలు, వాటి చిత్తం వచ్చినట్లు పరుగులు తీస్తూ పోతాయి.  పాపం, ఆ దేహరథంలో ఉన్న జీవుడికి ఈ ప్రయాణం కావలసిన గమ్యానికి చేర్చేది కాకుండా పోతుంది.   

లౌకికమైన రకరకాల కర్మల వైపుకి ఈ‌ మనస్సు జీవుణ్ణి గుంజుతూనే ఉంటుంది.  వాటి వైపుకి ఇంక మనస్సు పోకుండా బుధ్ధిని ఉపయోగించాలి.

ప్రకృతిలో ఉన్నంతకాలమూ నేనూ నాది అన్న భావనలు ఉంటాయి కదా? ఈ‌ భావనలకు అనుగుణంగా జీవుడు దేహయాత్ర చేస్తున్నంత కాలమూ,  వాడు చేస్తున్న ప్రతి పనికీ లక్ష్యం ఈ నేనూ - నాది అన్న ( అహంకార, మమకార ) భావనలని తృప్తి పరచటమే అవుతోంది. అలా చేసే ప్రతిపనీ (అంటే ప్రతి కర్మా) ఆ జీవుడికి మంచో చెడో‌ ఫలితాన్ని కట్టబెడుతుంది.  ఇష్టమున్నా లేకపోయినా ఆయా ఫలితాలను అనుభవించటం తప్పదు జీవుడికి.  బుధ్ది తిన్నగా బండిని నడిపిస్తే, ఇంద్రియాలు అనే‌ గుర్రాలు మాటవిని, సరైన పధ్ధతిలో నడుస్తాయి.  సరైన పధ్ధతి అంటే మనస్సనే కళ్ళెం తిన్నగా పట్టుకుని బుధ్ది అనే సారథి, దేహరధాన్ని పరమపదం వైపుకు పోనివ్వటమే.  ఈ ఇంద్రియాలనే గుర్రాలు వాటికి తోచినట్లు పరుగులు పెట్టనివ్వక పోవటమే.

అయితే, బుధ్ధిచేత మనస్సుని నిగ్రహించాలంటే ఆ బుధ్ధికి ఏదో ఒక ఊతం కావాలి.  భగవంతుడి సాకారస్వరూపాన్నే బుధ్ధికి ఆలంబనం చేస్తే పని తేలికౌతుంది.

మనస్సు అనేది సహజంగా, చంచలమైనది.  అందుచేత అర్జునుడు చంచలం హి మనః కృష్ణ! అంటే స్వామి దాన్ని అదుపు చేయాలంటే రెండు పధ్ధతులు కనిపిస్తున్నాయి. ఒకటి, అభ్యాసం, రెండు వైరాగ్యం అన్నాడు.  జన్మతః వైరాగ్యం సిథ్థించటం పూర్వజన్మ వాసనవల్ల తప్ప సాథ్యం కాదు.  ధృవుడికి కలిగింది అలాంటిదే.  ఇంక సామాన్య సాధకులకి దారి మనస్సుని కట్టుబాటులో ఉంచటాన్ని అభ్యాసం చేయటం ఒక్కటే.  

మనస్సుకి పట్టుకునే తత్త్వం ఒకటి సహజంగా ఉంటుంది. ఓపిక పట్టి, రామా రామా అని గంటల తరబడి జపం చేసి చూడండి.  ఇంక చాలు అని మీరు లేచిపోయినా, లేక నిద్రపోయి లేచినా మనస్సు మాత్రం రామా రామా అంటూనే ఉంటుంది.  అదీ దాని తత్త్వం అన్నమాట.  కొందరికి ఇది అనుభవంలో ఉండవచ్చును.  లేని వారు ప్రయత్నించి ఈ మాటలో సత్యం తెలుసుకో వచ్చును.

అంటే మనం రామా రామా అన్న జపాన్ని ఆలంబనం చేస్తే మనస్సు కాస్తా దాన్ని పట్టుకుని ఒక పట్టాన వదలటం లేదు.  బుధ్ధికి ఒక ఉపాయం దొరికినట్లేగా?  అది మనస్సుకి భగవంతుడు అనే ఒక తత్త్వం యొక్క ఆకారం, గుణాలూ, లీలావిశేషాల వర్ణనలూ ఇలా భగవత్సంబధమైన ఊతం ఒకటి అప్పగిస్తే, మనస్సు ఇక దాన్ని ఒక పట్టాన వదలదు.  క్రమంగా, అది ఊతం వదిలేసి జారుకుంటూ ఉంటే?  ఫరవాలేదు, బుధ్ధికి ఇప్పుడు మనస్సుని కట్టెయ్యాలీ అంటే ఏమి చేయాలో తెలిసిపోయింది కదా?

మనస్సుకు తనకు దొరికింది, ఎటువంటి ఆలంబనం అనే విచక్షణ ఏమీ ఉండదు. విచక్షణ ఉండేది బుధ్ధికి.  అందుచేత బుధ్ధిని సారధి, మనస్సుని దానిచేతిలో కళ్ళెం అన్నాం.  ఒకడి బుధ్ధి, భగవద్విషయాలు ఊతమిస్తే మనస్సు వాటిని పట్టుకుంటుంది.  మరొకడి బుధ్ధి, డబ్బు వ్యామోహమో లేదా స్త్రీవ్యామోహమో అనే  ఊతం ఇస్తే,  వాడి మనస్సు దాన్నే పట్టుకుంటుంది.  అందు చేత సాథకులు భగవంతుడికి సంబంధించిన విషయాలు పట్టుకునేనా మనస్సు చేత అభ్యాసం చేయించాలి. 

ఇలా చక్కగా పధ్ధతిగా ధ్యానం కొనసాగిస్తే మేలు జరుగుతుంది.  లోకాన్ని నిత్యం త్రిగుణాలు కదా మనకి ఎఱుక పరచేదీ?  ఇంక విషయాల నుండి మనస్సు విరమించు కుంది కాబట్టి, ఈ త్రిగుణాల వల్ల కలిగే వికారాలు ఏవీ మనస్సుకు సోకనే సోకవు.

సత్వమూ, రజస్సూ, తమస్సు అనే మూడు గుణాలనీ త్రిగుణాలు అని కలేసి చెప్తారు.  సత్వం అనేది ప్రశాంత స్థితి అనుకోండి.  రజస్సు వలన నేను ఇది చెయ్యాలీ, అది చెయ్యాలీ,  నాకు ఇది కావాలీ, అది కావాలీ అనే కోరికలు ఏర్పడుతాయి,  క్రియాకలాపం చేయించే స్థితి రాజసికం అన్నమాట.  తమస్సు అంటే అహంకారం, సోమరితనం, సుఖలాలస, హింసాప్రవృత్తి వంటి దుర్గుణాల తత్త్వం అన్నమాట.  ఈ‌ త్రిగుణాలు మన నిత్య జీవితంలో ప్రతి వస్తువులోనూ, ప్రతిభావన లోనూ‌ దర్శిస్తూనే ఉంటాం. అసలు మనం ప్రపంచాన్ని ఈ‌ త్రిగుణాలనే‌ రంగుల్లో తప్ప వేరుగా చూడనే చూడలేం‌ అన్న మాట.  మనం‌ ఏది పొందుతున్నా, దేన్ని భావిస్తున్నా దానికి కారణం త్రిగుణాలే కాని అన్యం కావు. 

ఇలా ధారణ చేసిన వాడికి త్రిగుణాల మురికి వదిలిపోయి మనస్సు నిర్మలం అవుతుంది.  నిర్మలచిత్తం సాధించిన వాడు హాయిగా విష్ణుపదం చేరుకుంటాడు.

మనస్సు ప్రాపంచిక విషయాలలో పడి తిరుగుతున్నంత కాలం ఈ త్రిగుణాలు దానికి క్షణక్షణం రకరకాల దృశ్యాల్ని చూపిస్తూనే,  ఆకర్షిస్తూనే ఉంటాయి.  రకరకాల అనుభవాల్ని ఈ‌ త్రిగుణాలు అందిస్తూ,  అవి మనస్సును తమ పెంపుడు కుక్కలాగా తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉంటాయి.

కాని మనస్సు భగవంతుడికి సంబంధించిన వస్తు, విషయ భావనలను పట్టుకుని కూర్చుం దనుకోండి?  అప్పుడు ఆ మనస్సుకి తదితరం అయిన పబయటి ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోతుంది.  అభ్యాసం ధృఢం ఐతే అటువంటి ఆసక్తి చచ్చిపోతుంది కూడా.

ప్రపంచం అంటే ప్రకృతికి, దూరం ఐపోయిన వాడి పరిస్థితి ఏమిటి?  వాడి మనస్సు మూడు గుణాల తాలూకూ మురికినీ వదిలించుకుంది కదా? మురికి వదిలిన అద్దంలో బొమ్మ స్పష్టంగా ఉంటుంది కదా?  ఇప్పుడు ఆ మనస్సు తాను బాగా అభ్యాసం చేసి అనుసంధానం చేసుకున్న భగవత్తత్త్వం మాత్రమే తెలిసి ఉంటుంది.  కాబట్టి అది ఆ భగవత్తత్త్వం లోనే లీనం ఐపోతుంది.  అలా మనోలయం ఐపోవటమే విష్ణుపదం చేరుకోవటం.  విష్ణువు అంటే సృష్టికి ముందే ఉన్న యదార్థ తత్త్వం. సృష్టినుండి విడివడిన తరువాత మనోలయం ఐపోయిన జీవుడు తానే ఆ యదార్థతత్త్వంగా మిగిలిపోతాడు.  అదే కైవల్యం, అంటే మోక్షం. 

ధారణ అనేది బాగా కుదురు కున్నాక ఈ ప్రకృతి మాయ వలన కలిగిన 'నేను' అనే భావన పోయి, కేవలం జీవుడిగా 'నేను' అనేది మాత్రం బీజరూపంగా మిగులుతుంది .  ఈ స్థితిలో వాడు పరమసుఖ స్వరూపమైన సర్వాంతర్యామి యొక్క సత్తా మాత్రం విషయంగా అనందిస్తూ ఉంటాడు.  ఈ స్థితికి చేరుకున్న వాడినే యోగి అంటాం.

మోక్షం సాధించే విధానాన్ని మరింత విపులీకరిస్తున్నారు. మనస్సు లయం ఐపోయినప్పుడు తొలుత ప్రకృతినుండి విడిగా ఐపోతాడు.  కాని జీవుడిగా మిగిలే ఉంటాడు.  ఈ‌ స్థితిలో వాడికి ప్రపంచంతో‌ ఏవిధమైన సాంగత్యం ఉండదు.  వాడు కేవలం భగవత్తత్త్వంతో మాత్రం సంబంధం కలిగి ఉంటాడు. ప్రకృతిలో సాంగత్యంతో ఉండటమే దుఃఖం. భగవత్తత్త్వంతో సాంగత్యం పరమసుఖం.  ఈ‌ స్థితిలో ఉన్నవాడు యోగి అనిపించుకుంటాడు.  ఈ‌ మాటకు అర్థం భగవంతుడితో కూడి ఉన్నవాడు అని. 

ఈ సర్వాంతర్యామి పట్ల భక్తి భావన సుధృఢమై నిలవాలి.  క్రమంగా బీజ రూపమైన 'నేను' అనేది కూడా యోగాగ్నిలో దగ్ధం ఐపోతుంది.  ఇలా దగ్ధబీజ స్థితిని పొందటమే మోక్షం.

ఇలా, క్రమంగా ఇలా యోగం సిథ్థించిన వాడు జీవుడిగా తన ఉనికిని కూడా విసర్జిస్తాడు. వేయించిన విత్తనం మొలకెత్తదు కదా?  అలా బీజస్వరూపంగా ఉన్న 'జీవుణ్ణి' అనే‌ భావనకూడా నశించిపోయాక మిగిలేది కేవలం భగవత్తత్త్వం మాత్రమే.  పూర్తిగా సృష్టి నుంచి బయటికి వచ్చి అనంతమైన విష్ణుతత్త్వంలో లీనం ఐపోయా డన్నమాట. ఇంక జీవుడే లేనప్పుడు పునర్జన్మ అంటూ ఉండదుక?

ఇదంతా చదువుతే శుకయోగి సాధారణ సాధకుడి స్థాయి నుంచి, ఒక వ్యక్తి కైవల్యం సాధించే దాకా చెప్పారని తెలుస్తోంది.  నిజానికి, ఎవరికైన ఇదంతా ఒక జన్మలో పూర్తిచేయటం సాధ్యమా అన్న సంశయం తప్పకుండా వస్తుంది.  నిజమే, దానికి ఏళ్ళూ పూళ్ళే‌ కాదు, జన్మలకు జన్మలే పట్ట వచ్చును.  కాని భయం లేదు. ఒక జన్మలో పూర్తి కాగలిగినంత యోగసాధన పూర్తి అవుతుంది.  వచ్చే జన్మలో అది కొనసాగుతుంది.  ఈ‌ మాట భగవద్గీతల్లో శ్రీకృష్ణపరమాత్మ నిష్కర్ష చేసాడు.  ఇది గుర్తు పెట్టుకోవలసిన విషయం.

ఇంకో విషయం గ్రహించ వలసి ఉంది.  చివరి రోజులు దగ్గరకు రాగానే, సాధన ప్రారంభించటం అనేది సాధారణ గృహస్థులకి చేసి ఉపదేశం.  సాధనాక్రమంలో కొన్ని మెట్లు దాటిన వారు, తమతో పాటుగా ప్రస్తుత జన్మకు ఆ సాధన కూడా వెంట తెచ్చుకుంటారు.  కాబట్టి వాళ్ళు చివరిరోజుల దాకా వేచి ఉండాలన్న నియమం ఏమీ ఉండదు.  అందుకు అనుగుణంగా ఉండే ఇంటిలోనే వారు జన్మిస్తారనీ శ్రీకృష్ణులవారి స్పష్టీకరణ గీతలో ఉంది కూడా.


పరీక్షిత్తుకు ఈ‌ సంసారం తొలగిపోయే మార్గం అంటూ శుకయోగి చేసిన బోధ విన్న తరువాత ఒకసందేహం కలిగింది.  భగవత్తత్త్వంలో‌ బాగా ధారణ చేసి త్రిగుణాల మురికిని వదుల్చుకోవాలని చెప్పారు కదా.  అదెలా చేయాలా అన్నది మరింత స్పష్టంగా తెలుసుకోవాలి అనుకున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి