30, జులై 2013, మంగళవారం

ప్రథమస్కంధం: 06. శ్రీనారదమహర్షులవారి పూర్వజన్మవృత్తాంతం

శ్రీవేదవ్యాసమహర్షి కొద్ది సేపు నారదులవారి ఉపదేశాన్ని మననం చేసుకుంటూ ఉండిపోయారు. అంతసేపూ శ్రీనారదులవారు తమ మహతీవీణ తోడుగా సన్నగా నారాయణనామగానం చేస్తూ ఉన్నారు.

మెల్లగా వ్యాసులవారి హృదయం తేలికపడింది. కర్తవ్యం వారికి పూర్తిగా అవగతం కావటంతో సంతోషం కలిగింది.

మెల్లగా వ్యాసులవారు భావనాప్రపంచం నుండి ఇహప్రపంచం లోనికి తిరిగి వచ్చాక శ్రీనారదులవారు తిరిగి తమప్రసంగం‌ కొనసాగించారు.

వ్యాసా, తరచుగా భగవంతుడైన శ్రీహరిని గురించి ప్రసంగించటం నాకు సంతోషం కలిగిస్తుంది.  అయితే ఇలా ప్రసంగించే అధికారం శ్రీహరి నాకు పరమప్రేమతో అనుగ్రహం చేయటానికి పూర్వరంగం నీకు చెప్పాలనే సంకల్పం‌ కలిగింది నాకు.  అంటే నా పూర్వజన్మకు సంబంధించిన కథ అన్నమాట.

ఇది,  అంటే నా పూర్వజన్మ,  ఈ‌ శ్వేతవరాహకల్పం లోనిదే కాదు.  అంతకు ముందు జరిగిన లక్ష్మీకల్పం లోనిది.

నేను అప్పుడు ఒక పనిమనిషి కొడుకుని.  మా అమ్మకు నేను ఒక్కడినే బిడ్డను. నా యందు ఆమెకు వల్లమాలిన ప్రేమ.  చిన్నవాడినైన నన్ను ఒంటరిగా ఇంట్లో విడిచి పెట్టలేక, తనతో పాటే తన యజమానుల ఇంటికి కూడా తీసుకొని వెళ్ళేది మా అమ్మ.

మా యజమాను లెవరను కున్నావు.  వారు గొప్ప వేదవాదులు.  నిత్యం వేదాధ్యయనం చేస్తూ, శిష్యులకు వేదం చెబుతూ, యజ్ఞయాగాలు చేస్తూ ఉండేవారు మా యజమానులు.

చిన్నపిల్లవాడినైన నేనూ మా అమ్మకు వీలయినంతగా సహాయం‌చేస్తూ, ఇంట్లో వారికి కూడా ప్రీతి పాత్రుడుగా ఉండే వాడిని.

ఒకసారి మా యజమానుల ఇంటికి కొందరు గొప్ప యతీశ్వరులు వచ్చారు. వారు వచ్చింది చాతుర్మాస్యం (అంటే వానాకాలం నాలుగు నెలలు) మా యింట జరుపుకుందుకు.  మా యజమానులు వారికి తగిన వసతులు ఏర్పాటు చేసారు.  వారికి సేవచేయటానికి నన్ను ఆజ్ఞాపించారు.

వారి ప్రవర్తన కుర్రవాడినైన నాకు చిత్రంగా అనిపించి బాగా ఆకర్షించింది. వాళ్ళు నిత్యం శ్రీహరిని గూర్చి ప్రసంగించుకుంటూ, పాటలు పాడుకుంటూ, హరినామ జపం చేసుకుంటూ ఉండే వారు. 

నేను ఆ యతుల్ని పరమభక్తితో సేవించాను. బాల్యచేష్టలైన ఆటపాటలు వదిలిపెట్టేసాను. వారు చెప్పేపనులు ఎండావానా అనక ఓపిగ్గా చేసేవాడిని. వారు నాకు ఏదైన అనుగ్రహిస్తే తినటానికి అది ఎంగిలి అయినా సరే పరమపవిత్రం అనే‌ భావనతో ఆనందంగా స్వీకరించేవాడిని.

శా. వారల్ కృష్ణుచరిత్రముల్ చదువఁగా వర్ణింపఁగా బాడఁగా
నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం
దోరంబై పరిపూర్ణ మైన మది సంతోషించి నే నంతటం
బ్రారంభించితి విష్ణుసేవ కితరప్రారంభదూరుండనై

ఆ యతీశ్వరులు అలా శ్రీహరి కథలు చదువుతూ, వాటిని యథాశక్తి వర్ణిస్తూ, శ్రావ్యంగా మైమరచి పాటలుగా పాడుతూ ఉంటే అదంతా నాకు అమృతరసప్రవాహంలా తోచేది. నా మనస్సుకు పరిపూర్ణమైన ఆనందం కలిగేది.  దానితో‌ నేను కూడా అప్రయత్నంగా మనస్ఫూర్తిగా విష్ణుసేవ మొదలు పెట్టాను. ఇతరమైన సర్వవిషయాలూ వెనుకకు నెట్టి వేసాను.

ఆ హరిసేవాభాగ్యం వలన నేను ప్రపంచానికి అతీతమైన పరబ్రహ్మతత్వం తెలుసుకోగలిగాను. ఈ‌ కనిపించే‌ దేహమే కాక దానిలో ఒక సూక్ష్మదేహం ఉందని అర్థమైంది.  ఈ‌ రెండు దేహాల వంటి వ్యవహారాలన్నీ ప్రకృతిమాయచే జీవుడనైన నేనే స్వయంగా కల్పించుకున్నానన్న సంగతి బోధపడింది. ఆ మహానుభావుల సాహచర్యం కారణంగా నాకు కలిగిన హరిభక్తి నాలోని రజోగుణాన్నీ తమోగుణ్నాన్నీ‌ సమూలంగా అణచి వేసింది.

అంతలోనే నేను ప్రీతితో సేవించుకుంటున్న యతీశ్వరుల చాతుర్మాస్యదీక్ష ముగిసింది.  నా యోగ్యతనూ, హరిభక్తినీ గమనించిన వారికి నా యందు మిక్కిలి ప్రేమభావం కలిగింది. అందుచేత వారు మా యజమానుల ఇంటిని విడిచి వెళ్ళే ముందు నాకు ఈశ్వరతత్వం గురించి చక్కగా ఉపదేశం చేసారు.

దానితో నాకు శ్రీహరి యొక్క మాయ గురించిన విజ్ఞానం కలిగింది. వాసుదేవునికి అర్పించిన కర్మము అన్ని తాపత్రయాలను మాన్పే మందు అని బోధపడింది.  దేని వలన రోగం వస్తుందో  దాన్ని మనం ఏ మోతాదులో సేవించినా అది మనకు రోగనివారణ చేయదు కదా. మరొక పదార్థమే ఆ రోగాన్ని కుదర్చాలి.  ఈ‌ ప్రపంచంలో మనని బంధించి ఉంచేవి కర్మలు.  ఆ కర్మలు ఎలా చేసినా ఏవి చేసినా అవి సంసారంలోంచి మనని బయటపడ వేయ లేవు.  దానికి  ఈశ్వరుడనే వైద్యుడు జ్ఞానం అనే మందు వేయవలసినదే. అన్ని కర్మలనూ ఈశ్వరుడికి అర్పించి వేయాలి. అప్పుడు ఈశ్వరుడు సంతోషించి మనకు తనయందు భక్తి కలిగిస్తాడు.  ఈశ్వరుడే మనకి కర్మబంధాలనుండి తప్పించే‌ జ్ఞానం అనుగ్రహిస్తాడు.  నిత్యం‌ భగవంతుని నామాలను ఓంకారపూర్వకంగా ధ్యానించాలి.  యతీశ్వరుల పుణ్యమా అని నాకు ఇదంతా బోధపడింది.

నేను కూడా అలా హరిని ఆరాధించటంతో ఆయన దయతో నాకు విజ్ఞానాన్ని ప్రసాదించాడు.   ఓ‌ వ్యాసా, నువ్వు కూడా అలాగే చేయవయ్యా.

అలా శ్రీనారదులవారు చెప్పగానే శ్రీవ్యాసులవారు ఒక ప్రశ్నవేశారు.  నారదమహర్షీ ఆ తరువాత ఏమి జరిగింది?  ఆనాటి జన్మలో పెరిగి పెద్దవారై ఎలా ప్రవర్తించారు? అసలు ఆ జన్మకు సంబంధించిన స్మృతి అంతా తమకు ఇలా విదితంగా ఎలా ఉంది? అని.  దానితో నారదులవారు చెబుతున్నారు, అనంతరకథను.  

వ్యాసా, చెబుతాను విను.  అలా అప్పటికి ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న నాకు హరిభక్తి గొప్ప మేలు చేసింది.  నాకు సంసారంతో‌ సమస్తబంధాలు తెగిపోయాయి.  అలా గని నేను మా అమ్మను విడిచి పెట్టి పోలేదు సుమా! ఆమె తన ప్రాణాలు నా మీదనే నిలుపుకుని ఉన్నదాయె.  నేను తప్ప ఆమెకు వేరు లోకమే లేదన్నట్లుండేది మా అమ్మ.  శ్రీహరి దయతో జ్ఞానినైన నాకు మా అమ్మ ప్రేమ ఒక బంధం కాలేదు.

ఇలా ఉండగా ఒకనాడు మా అమ్మ చీకటి వేళలో‌ పాలు పితకటానికి వెళ్ళి పాముకాటుకి గురియై మరణించింది.  అలా ఆ నామమాత్రపు బంధం కూడా తీరిపోయింది.

ఇక నిశ్చింతగా జనావాసాలకు దూరంగా పోయి విష్ణుధ్యానంలో కాలం గడుపుదామని నిర్ణయించుకున్నాను. ఊరు వదలి, అనేక ఊళ్ళూ, నగరాలూ దాటి, చిన్న చిన్న అడవులు దాటి ఒక కీకారణ్యం చేరుకున్నాను. అక్కడ ఒక జలాశయంలో స్నానం చేసి, దాహంతీర్చుకున్నాను.  ఒక రావిచెట్టు క్రింద కూర్చుని ధ్యానం‌ మొదలు పెట్టాను.

శా. ఆనందాశ్రులు కన్నులన్ వెడల రోమాంచంబుతో దద్పద
ధ్యానారూఢుడ నైన నాతలఁపులో నద్దేవుడుం దోఁచె నే
నానందాబ్ధిగతుండనై యెఱుఁగ లే నైతిన్ ననున్ న్నీశ్వరున్
నానాశోకహమైన యత్తనువు గానన్ లేక అట్లంతటన్

అలా ధ్యానం చేస్తూ ఉండగా. అపరిమితమైన ఆనందం‌ కారణంగా కళ్ళనుండి ధారాపాతంగా నీళ్ళు ప్రవహించాయి. శరీరంలోని రోమాలన్నీ‌ సంతోషాతిరేకంతో నిక్కపొడుచుకున్నాయి (రోమాలు నిక్కపొడుచుకోవటానికి పురుషుడిపరంగా రోమాంచం అనీ‌ స్త్రీలకైతే పులకరింత అనీ వ్యవహారం).  నిరంతరాయంగా అలా హరిధ్యానం చేస్తూ ఉండగా నా తలంపులో ఆ దేవదేవుడి దివ్యమంగళస్వరూపం గోచరించింది - అదీ‌ తృటి కాలం మాత్రమే.  ఆ పరమానందస్థితిలో మైమరచి ఉన్న నేను ఈశ్వరుణ్ణి గ్రహించలేకపోయాను. 

అయ్యో‌ కానవచ్చిన పరమేశ్వరుడైన శ్రీహరిని తెలుసుకోలేకపోయానే అని పరితపించాను.  ఆ చింతతో మతిస్థిమితం తప్పిన వాడిలాగా అయిపోయి అడవి అంతా తిరుగుతూ యెక్కడున్నావయ్యా ఎక్కడ అని పిలుస్తూ తిరుగుతున్నాను. అప్పుడు కరుణామూర్తి అయిన శ్రీమహావిష్ణువుకు నామీద దయపుట్టింది. ఆ మాటలకందని మహానుభావుడు, దయతో గంభీరంగా మధురంగా ఇలా అన్నాడు

ఉ. ఏల కుమార శోషిలఁగ నీ‌ జననంబున నన్ను గానఁగాఁ
జాలవు నీవు కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని
ర్మూలితకర్ముఁ డైన ముని ముఖ్యుడు గాని కుయోగి గానఁగాఁ
జాలఁడు నీదు కోర్కె కొనసాగుటకై నిజమూర్తి జూపితిన్

నాయనా, ఎందుకు విచారం? ఈ‌ జన్మలో నీవు నన్ను చూడలేవు.  అరిషడ్వర్గాలనూ‌ జయించి కర్మబంధాలు పూర్తిగా తెంచుకున్న యోగి తప్ప మరెవరూ నన్ను చూడలేరు. నీలో ఇంకా నేను అన్నభావన మిగిలే‌ ఉంది. అది కూడా నశించాలి. అయితే నన్ను చేరుకోవాలనే నీ‌ ఆశయం గొప్పది. అందుకోసం నీ ప్రయత్నం కొనసాగవలసి ఉంది.  కాబట్టి ఒకసారి నా నిజస్వరూపం నీకు చూపించాను.

ఒకసారి  నా పట్ల భక్తి కలగాలే కానీ‌ అది ఊరకే పోదు. అన్ని దోషాలనూ కర్మబంధాలనూ నశింపచేస్తుంది. ఇక నీకు కలిగిన ఈ భక్తి తప్పకుండా రాబోయే జన్మలోనూ కొనసాగుతుంది.

ఈ‌ సృష్టి త్వరలో అంతమై పోతుంది. ఆ తరువాత వెయ్యియుగాలపాటు బ్రహ్మకు రాత్రి సమయం.  ఆ తరువాత పునఃసృష్టి.  అందులో నువ్వు ఇంక యే దోషమూ లేని శుధ్ధసాత్విక స్వరూపంతో అవతరిస్తావు. అటువంటి వాళ్ళలో మొదటివాడివీ‌ అవుతావు. 

ఇలా ఆకాశవాణిగా శ్రీహరి పలుకులు విని సంతోషించాను. ఆనందంతో‌ హరినామస్మరణ చేసుకుంటూ కామం‌ క్రోధం వంటి అరిషడ్వర్గాలనూ వదలి పెట్టి నిర్మలమైన బుధ్ధితో కాలం కోసం ఎదురు చూసాను.  కాలం ఆసన్నమైనంతనే, ఆ కర్మస్వరూపమైన శరీరం వదలి, శుధ్ధసత్వస్వరూపమైన దేహం స్వీకరించాను. దానినే భాగవతదేహం అనీ అంటారు. 

అప్పుడు ప్రళయకాలం కాబట్టి నారాయణుడు సకల సృష్టినీ‌ ఉపసంహరించాడు. నేను బ్రహ్మలో ప్రవేశించాను.  ఆ బ్రహ్మ విష్ణువులో ప్రవేశించి నిద్రకు ఉపక్రమించాడు.  మరొక వెయ్యి యుగాల రాత్రికాలం పూర్తి అయ్యాక బ్రహ్మ నిద్రలేచి విస్ణుమూర్తి ఆదేశం మేరకు సృష్టి మొదలు పెట్టాడు.  ఆ బ్రహ్మ నుండి మరీచి మొదలైన సప్తమహర్షులూ నేనూ‌ సంభవించాము.

అఖండబ్రహ్మచర్యవ్రతం పూని విష్ణుదేవుని అనుగ్రహంతో ముల్లోకాల్లోనూ నిరాటంకంగా విష్ణుకీర్తనం చేస్తూ తిరుగుతుంటాను. ఇదిగో ఈ‌ దైవదత్తమైన వీణ నాకు తోడు. ఇందులో సప్తస్వరాలు తమంతతామే‌ కావలసినట్లు పలుకుతాయి.  ఇలా గానం చేస్తూ తిరిగే‌ నా మనస్సులో విస్ణుదేవుడు నిత్యం నాకు గోచరిస్తూనే ఉంటాడు.

ఓ వ్యాసమహర్షీ, సంసారం అనే సముద్రంలో మునిగి ఉన్నవాడికి విష్ణువే తీరానికి చేర్చే‌ నావ.  వేరే దారి అంటూ‌ లేనే లేదు.

చ. యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ గామ రో
షములఁ బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణుసేవచే
గ్రమమున శాంతి గైకొనిన కైవడి నాదు శరీర జన్మ క
ర్మముల రహస్య మెల్ల ముని మండన చెప్పితి నీవు కోరినన్

ఆత్మకు యమనియమాదులైన నియమాల వలన జ్ఞానం కలిగినా శాంతి కలగదయ్యా. ఎందుకంటే కామం క్రోధంవంటివి నిత్యం అశాంతిని కలిగిస్తూనే ఉంటాయి కాబట్టి. విష్ణుసేవ వలన ఆ కామక్రోధాదులు అణగి నశించి క్రమంగా శాంతి కలుగుతుంది. నా పూర్వజన్మలో నేను చేసిన భాగవతసేవవంటి పుణ్యకర్మల గురించీ, అప్పటి నా కర్మశరీరం గురించీ నీ‌కు చెప్పాను.  అలాగే విష్ణుకృపవలన నాకు కలిగిన భాగవత దేహం‌ గురించీ‌ నీ‌కు వివరంగా చెప్పాను.  ఓ ముని శ్రేష్ఠుడవైన వ్యాసా, ఈ‌ రహస్యాలన్నీ నీవు అడగ్గానే ప్రేమతో తెలియజెసాను నీకు.  దీని వలన విస్ణుస్వరూపం పైన నీకు పూర్తి అవగాహన కలుగుతుందని భావించి చెప్పాను.

ఇలా కర్తవ్యబోధ చేసి, శ్రీమహావిష్ణుస్వరూపావబోధనం చేసి భగవత్స్వరూపుడైన శ్రీ నారదమహర్షులవారు వ్యాసుని వద్దనుండి బయలుదేరి వెళ్ళారు.

4 కామెంట్‌లు:

  1. భాగవత గంగ పొంగుతోంది, సాగించండి.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుందండి. దీని మూలానైనా మన యువతకి తెలుగు చదవాలని, మాట్లాడలని అనిపిస్తే మీ సంకల్పం నెరవేరినట్టే. పోతన భాగవతం అంతా రాయాలంటే చాలా కాలం పట్టొచ్చు. కానీ మంఛి కాలక్షేపం మీకూ మాకూను. పుణ్యం పురుషార్ధం కూడాను. నేనైతే ప్రతీ పోస్టు లోనూ ముందు, ఇంతవరకూ చెప్పినది (రెండు/మూడు లైన్లు), భగవత్ స్థుతి చేరిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను.. కింది విధంగా.. మీకు ఇష్టం లేకపోతే వద్దులెండి.


    శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః (లేకపోతే వేరేది ఏదో ఒకటి)

    (క్రితం పోస్టు లో.. నారదుల వారు వ్యాసుల వారిదగ్గిరకొచ్చి తన జన్మ వృత్తాంతం వినిపించారు (పాత పోస్టు లింకు పెట్టొచ్చు. ఆ విధంగా ఒక పోస్ట్ నుండి వెనకదానికి ఈజీ గా వెళ్ళొచ్చు). ఆ తర్వాత చదవండి...)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ‌ బ్లాగులో కేవలం భాగవతం మాత్రమే వ్రాస్తాను కాబట్టి బ్లాగువారిచ్చిన లింకుతో పాతటపాకు సులభంగా పోచచ్చును. భగవంతుని ప్రస్తుతిస్తూ ఒక మాట మున్నుడిగా వ్రాయటం‌ కష్టం కాదు. ఎలా చేస్తే బాగుంటుందో అలోచిస్తాను. ఈ‌భాగవతయజ్ఞం దీర్ఘసత్రమే. చూద్దాం ఎంతకాలం పడుతుందో. యథాప్రకారం, ఇలాంటి వస్తువును మన తెలుగుపాఠకలోకం ఏమంతగా పట్టించుకోవటం లేదు.

      తొలగించండి
  3. హల్లొ మాష్టారు,
    నేను ఇప్పుడే మీ భాగవతం చదవటం మొదలు పెట్టాను. మీరు వ్రాయటం ఆపవద్దు. మీరు చెసే ఈ మహా కార్యం ఎప్పటికీ ఉండిపొతుంది.
    ఆ దేవదేవుని కృప మీపై ఉండాలని కోరుతూ
    మహెష్

    రిప్లయితొలగించండి