29, జులై 2013, సోమవారం

ప్రథమస్కంధం: 05. నారదులవారు వేదవ్యాసులవారిని భాగవతరచన చేయమని ఆదేశించుట.

శ్రీనారదమునీంద్రులవారు వ్యాసులవారితో ఇంకా యిలా అన్నారు.

వ్యాసమహర్షీ, జ్ఞానం అనేదానికి దేహం అనేదానితో యదార్థంగా ఏ సంబంధమూ లేదు.  అలాగే దేహం ఉన్న కారణంగా దేహస్థుడైన జీవుడు అనేకానేకమైన కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ‌ కర్మలు వేటితోనూ కూడా జ్ఞానం సంబంధం లేనిదే. అలా జ్ఞానం ఏ విధమైన ఉపాధులూ (అంటే దేహాలూ) కర్మలూ అంటక నిర్మలంగా స్వయం ప్రకాశంగా ఉంటుంది.

అయితే ఈ జ్ఞానం అనేది హరిభక్తి అనేది లేని దేహంలో పెద్దగా శోభించదు!

ఏ‌ పని (కర్మ) చేసినా, దాని ఫలితం ఈశ్వరార్పణం చేయకపోతే అది అప్రశస్తమైన కర్మ అనిపించుకుంటుంది.  ఎందుకంటే, ఫలితాన్ని ఆశించి చేసే అన్ని రకాల కర్మలూ జీవులను బంధించి ఉంచేవే అవుతున్నాయి కదా.

ఈశ్వరభక్తిలేని వాడి వాక్కులయొక్క నేర్పరితనం కేవలం వాగాడంబరం. అలాంటివాడి చేత ఆచరించబడే కర్మలు అన్నీ కేవలం డాంబికాలు. అలా అటువంటివాడు ఈశ్వరుడి చేత అనుగ్రహించబడిన ఉపాధిని దుర్వినియోగం చేస్తున్నట్లవుతున్నది.

అటువంటివాడు వేదాధ్యయనం చేతా, గురుశుశ్రూష చేతా జ్ఞానం సముపార్జించినా అదీ‌ దండగే!  ఈశ్వరార్పణ చేసే మంచి బుధ్ధి లేని కారణంగా అ జ్ఞానం ప్రకాశించదు.

ఈశ్వరార్పణంగా లేని జ్ఞానం కాని, వాక్కులూ, కర్మలూ కాని అలా నిస్ప్రయోజనాలవుతున్నాయి!

వ్యాసా, నువ్వు మహానుభావుడివి. ఎంతో ప్రపంచానుభవమూ తత్వజ్ఞానవివేకమూ గల నీ కిదంతా తెలుసును.   ఉన్నది ఉన్నట్లు సర్వమూ తెలిసినవాడివి.  అందుకే నీకు ప్రపంచంలో గొప్ప కీర్తిప్రతిష్టలు కలిగాయి.

నాకు తెలుసు.  నువ్వు సత్యం మీద నిష్ఠ గలవాడివి. ఆ విషయంలో నీకు గల పట్టుదల అద్వితీయమైనది. 

అందుచేత నువ్వు సకల కర్మ బంధాల నుండీ విడిపించే మహానుభావుడైన శ్రీమహావిష్ణువు యొక్క లీలావిశేషాలను పరమభక్తితో వర్ణించు.ఆ లీలావిశేషాలు ప్రపంచానికి విశదీకరిస్తూ ఒక దివ్యమైన గ్రంథం ప్రకాశింపజేయి.

ఎంతగొప్ప గ్రంథమైనా హరికి సంబంధించిన విశేషాలతో కాక అన్యవ్యవహారాలతో‌ నడిపిస్తే లాభం ఏమిటి? అది కాస్తా అనవసరమైన రకరకాల సిథ్థాంతాల గందరగోళాల్లో ఇరుక్కుంటుంది. తుఫానుల్లో చిక్కుపడ్ద చిన్న నావలాగా అయిపోతుంది. అది అటూ ఇటూ తిరుగుతూ ఒక గమ్యం అంటూ చేరలేదు - అసలు గమ్యం అంటూ దానికి తెలిసే దారే లేదు కదా!

వ్యాసమహర్షీ, నువ్వు నిశ్చయంగా మంచి మంచి విషయాలతోనే అద్భుతమైన గ్రంధాలు తయారు చేసి జనాని కందించావు.  అందులో ఏమీ‌ సందేహం లేదు.  అనేక విధాలుగా ఇలా చెయ్యాలీ, ఇలా చెయ్యకూడదూ అంటూ ధర్మప్రబోధం చేసావు.  అదీ గొప్ప విషయమే.

కాని అమాయకంగా,  ఫలితాలను ఆశించి కర్మలు చేస్తూ బ్రతికే వాళ్ళకు కొత్తగా నువ్వు రకరకాల నియమాలు పెట్టి వాళ్ళను గందరగోళం లోనికి నెట్టివేసావు గదా!  అది మాత్రం ఉచితంగా లేదు.  

సామాన్యజనం ఏం చేస్తారో తెలుసునా వ్యాసా?  వాళ్ళు  నువ్వు చెప్పిన విధి - నిషేధాల స్వరూపంతో అందుకున్న ధర్మాలను పట్టుకుందామని ప్రయత్నిస్తారు. ఎంతోకొంత అందుకోగలిగి, ఆచరణలోకి తెచ్చుకున్న వాళ్ళలో, దాదాపు అందరూ తామేదో సాధించేసామని గర్వంతో మిడిసిపడుతూ ఉంటారు. అవికోరీ ఇవికోరీ కర్మలు ఆచరించేవాళ్ళు ఏదో సాధిస్తున్నా మనుకుంటున్నారు. అదే పారమార్థిక జీవనం అనుకుంటున్నారు.  ఇలా జుగుప్సాకరంగా ధర్మాన్ని అన్వయం చేసుకుంటున్నారు!

ఇక పోతే అలా నువ్వు చెప్పిన ధర్మాలు అర్థం చేసుకోవటమూ అందిపుచ్చుకోవటమూ చేయలేని వాళ్ళు మాత్రం నిరాశానిస్పృహలలో కూరుకు పోతారు.  తమకు అందకుండా పోయిన ధర్మపన్నాలగురించే చింతిస్తూ జీవితం వ్యర్థం చేసుకుంటున్నారు.

ఇలా రెండు రకాల మనుష్యుల మనస్సులూ‌ కలతచెందుతున్నాయి.  జనం అంతా ఈ‌ విధినిషేధాలు మాత్రమే పరమధర్మం అనుకుంటున్నారు!  ఇలా మనుష్యులందరూ ఈ‌విధులూ నిషేధాలూ కన్నా ఉన్నతమైన తత్వం ఒకటి ఉందనీ, దానిని గూర్చి జ్ఞానం సంపాదించవలసిన అవసరం అనేది ఒకటి ఉందనీ పూర్తిగా మరచి పోతున్నారు!

వ్యాసా, ఇప్పుడు నీ కర్తవ్యం స్పష్టం. మనుష్యుల బుధ్ధికి మోహం కలగకుండా ఆ బుధ్ధులకు తిన్నగా తత్వమార్గం పట్టించేందుకు అవసరమైన మంచి బోధను వారికి అందించటమే అది.

చ. ఎఱిగెఁడువాఁడు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్
నెఱయ నెఱుంగుఁ దాను మదినేరుపుఁ జూపు గుణానురక్తుఁడై
తెఱకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమానయుక్తుఁడై
యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరలీల మునీంద్ర చెప్పుమా

ఓ వ్యాసా, తెలిసినా వాడు సకలకర్మలనూ వదలి వేస్తాడు. ఆ కర్మల స్థానంలో భగవంతుడైన శ్రీహరి స్వరూపాన్ని తనయందు నిండుగా నింపుకొని సంతోషంగా ఉంటాడు.  అతడికి జీవులను బంధించే‌ త్రిగుణాలు కాక హరిగుణాల పట్ల అనురక్తి కలిగి ఉండే‌ నేర్పు వశమై ఉంటుంది.  కాని అందరూ అంత తెలివి గలవారు కారుగదా.  సామాన్యులు మాత్రం, నిర్విరామంగా త్రిగుణాత్మకమైన ప్రకృతికి వశుడై నా దేహమో, నా సంపదలో అంటూ నిత్యం లోకంలో తిరుగాడుతూ‌ ఉంటారు.  అలాంటి ఎరుకలేని వాడు తెలిసికొనేటట్లుగా నువ్వు ఈశ్వరుడైన శ్రీహరి యొక్క లీలలను తెలియ జెప్పాలి.

చ. తన కులధర్మమున్ విడచి దానవవైరి పదారవిందముల్
పనివడి సేవసేసి పరిపాకము నొందక  యెవ్వడేనిఁ జ
చ్చిన మఱుమేన నైన నది సిధ్ధి వహించుఁ దదీయ సేవ బా
సినఁ గులధర్మగౌరవము సిధ్ధి వహించునె మెన్ని మేనులన్

మనుష్యులందరికీ లోకసహజంగా తమమమ జన్మవంశాలకి అనుగుణమైన వృత్తులూ‌ ధర్మాలూ యేర్పడుతున్నాయి.  వాటిని అన్నిటినీ దాటి, యెవ్వడైనా సకల దుర్గుణాలను అణచే (దుర్గుణాశ్రయులైన జీవులే రాక్షసులు) శ్రీహరి పాదాలను పట్టుకున్నాడో వాడి పంట పండినట్లే.  హరిసేవ మాత్రమే‌ కర్తవ్యం చేసుకుని జీవితం గడిపిన వాడికి సిధ్ధి కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఒక జీవితకాలంలో సిధ్ది కలగక పోవచ్చును. అయితేనేం మరొక జన్మలో కలుగుతుంది.  అలా కాక కులధర్మాలు అంటూ‌ పట్టుకుని వేళ్ళాడుతూ కించిత్తూ భగవద్భక్తి లేకండా జీవించే వాడు ఎన్ని జన్మలు ఎత్తినా ఏమీ ముందుకు జరగడు.  వాడికి ఎన్నటికీ మోక్షమూ లేదు.  వ్యాసా, స్వధర్మాచరణమూ‌ భగవద్భక్తీ పరస్పర విరుధ్దాలు కావు. కర్మాచరణం చేసే వాడు తత్ఫలాలను తప్పక ఈశ్వరార్పణం చేయాలి కదా? భక్తి లేని వాడు ఈశ్వరార్పణం ఏం‌ చేస్తాడయ్యా?  భక్తి లభించిన వాడి వలన జరిగే కర్మలన్నీ ఈశ్వరారాధనలే అవుతున్నాయి కదా?  అందుచేత  జగదీశ్వరుని యందు అచంచలమూ నిష్కల్మషమూ అయిన భక్తి అన్నదే సర్వ ప్రధానమైనది.

అందుచేత ఏ మాత్రం ఎరుక కలిగినా, హరిసేవకోసం ప్రయత్నించాలి.  శరీరం అంటూ ప్రకృతిసిధ్ధంగా ఏర్పడినట్లే దానికి సుఖదుఃఖాలూ ప్రకృతిసిధ్దంగానే ఏర్పడుతున్నాయి.  బ్రహ్మలోకంలో ఉన్నా పాతాళంలో‌ ఉన్నా ఈ‌సుఖదుఃఖాలు తప్పవు కదా? అవునా?  అందుచేతా ఈ‌ సుఖదుఃఖాలను లెక్క చెయ్యకూదదు - హరిసేవనూ విడువకూడదు.  ఒకపట్టాన ఎరుక రానే‌ రాదు.  అతి కష్టం మీద లభించిన ఎరుకను హరిసేవకోసం వినియోగిస్తే కలిగే మేలే, జీవులకు అసలైన మేలు.  మనోవాక్కాయకర్మలా హరిసేవకుడై ఉండే వాడు అందరిలాగా ఈ‌ లోకంలో పుట్టి పెరుగుతూ ఉంటాడు.  కాని అందరిలా ప్రకృతిమాయకు వశం కాకుండా నిబ్బరంగా ఉంటాడు. హరిస్మరణంలో రుచి తెలుసుకున్న వాడు ఆ భక్తిరసప్రవాహంలో హాయిగా ఈదుతూ బయటకు రావటానికి ఇష్టపడనే పడడు.

సీ.  విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను
      వే ఱేమియును లేదు విశ్వమునకు
బవవృధ్ధిలయము లా పరమేశుచే నగు
      నీ వెఱుంగుదు గాదె నీ ముఖమున
నెఱిగింపబడ్డది యేక దేశమున నీ
      భువనభద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము
      రమణతో హరి పరాక్రమము లెల్ల
అ.  వినుతిసేయు మీవు వినికియు జదువును
దాన మతులవయముఁ దపము ధృతియుఁ
గలిమి కెల్ల ఫలము గాదె పుణ్యశ్లోకుఁ
గమలనాభు బొగడఁ గలిగెదేని

ఈ కనిపించే ప్రపంచం అంతా విష్ణువే. ఈ‌ విశ్వం అంతా ఆ విస్ణువు ఆకారమే.  ఈ విశ్వం అనేది పుట్టటం, పెరగటం, నశించటం అంతా ఆ పరాత్పరుడైన విస్ణువు జరిపించే పనులే.  ఇదంతా నీకు చక్కగా తెలిసిందే‌ కదా!  నువ్వే ఈ విషయాన్ని నీ గ్రంథాలలో ప్రపంచజనులకు విశదీకరించావు కూడా.

ఈ విశ్వంలో ఒకా నొక చోట,  విశ్వక్షేమం కోసం, విష్ణువు యొక్క అంశలో జన్మించిన మహానుభావుడవు నువ్వు!  ఈ విషయాన్ని చక్కగా మనస్సులో అనుసంధానం చేసుకో.

ఇంక విష్ణుదేవుని యొక్క గొప్పదనాన్ని స్తోత్రం చేయవలసి ఉంది నువ్వు.  నీ పాండిత్యంతోనూ అనుభవంతోనూ నువ్వు గ్రహించినవీ, పెద్దలనుండి శ్రథ్థగా విని తెలుసుకున్నవీ అయిన విషయాలను స్మరించు. నీతి, తపస్సు, ధైర్యం, సంపదా అన్నీ విష్ణువు లోనే ఫలిస్తున్నాయి.  అన్నింటి సారమూ విష్ణువే.  విష్ణువుని స్తుతించటంలోనే అన్నింటికీ సార్థకత.

శ్రీనారదమహర్షులవారు ఇలా చేసిన ఉపదేశం‌ యొక్క సారం యేమిటంటే, విష్ణు లీలా విశేషాలతో గ్రంథరచన చేసి ప్రజానీకాన్ని ఉధ్ధరించమని.

2 కామెంట్‌లు:

  1. బావుందండి, కొన సాగించ మనవి

    రిప్లయితొలగించండి
  2. ---------------------------------------------------------
    సామాన్యజనం ఏం చేస్తారో తెలుసునా వ్యాసా? వాళ్ళు నువ్వు చెప్పిన విధి - నిషేధాల స్వరూపంతో అందుకున్న ధర్మాలను పట్టుకుందామని ప్రయత్నిస్తారు. ఎంతోకొంత అందుకోగలిగి, ఆచరణలోకి తెచ్చుకున్న వాళ్ళలో, దాదాపు అందరూ తామేదో సాధించేసామని గర్వంతో మిడిసిపడుతూ ఉంటారు. అవికోరీ ఇవికోరీ కర్మలు ఆచరించేవాళ్ళు ఏదో సాధిస్తున్నా మనుకుంటున్నారు. అదే పారమార్థిక జీవనం అనుకుంటున్నారు. ఇలా జుగుప్సాకరంగా ధర్మాన్ని అన్వయం చేసుకుంటున్నారు!
    -------------------------------------------------
    చాలా బాగా చెప్పారండి.

    రిప్లయితొలగించండి