28, జులై 2013, ఆదివారం

ప్రధమస్కంధం: 04. శ్రీవేదవ్యాస భగవానులవారి వద్దకు శ్రీనారదులవారు వచ్చుట

శ్రీవేదవ్యాసమహర్షులవారికి పరమానందం కలిగిస్తూ వారి వద్దకు బ్రహ్మమానసపుత్రులూ, హరిభక్తాగ్రగణ్యులూ, త్రికాలవేదీ, త్రిలోకాసంచారీ అయిన శ్రీనారదులవారు విచ్చేసారు.  వారి రాకను గూర్చి పోతనగారి పద్యం
సీ. తన చేతి వల్లకీ తంత్రీచయంబున
      సతతనారాయణ శబ్దమొప్పఁ
నానన సంభూత హరిగీత రవసుధా
      ధారల యోగీంద్రతతులు సొక్కఁ
గపిల జటాభార కాంతిపుంజంబుల
      దిశలు ప్రభాతదీధితి వహింపఁ
దనులగ్న తూలసికాదామ గంధంబులు
      గగనాంతరాళంబు గప్పికొనఁగ
అ. వచ్చె మింతనుండి వాసవీనందను
కడకు మాటలాడఁ‌ గరుణ తోడ
భద్రవిమలకీర్తి పారగుఁ డారూఢ
నయవిశారదుండు నారదుండు

ఆ నారదమహర్షులవారి చేతిలోని వీణకు మహతి అని పేరు.  ఆ మహతీవీణ నుండి నిరంతరం నారాయణశబ్దం వినిపిస్తోంది.  ఆయను నారాయణుడి మీద కీర్తనలు గానం చేస్తూ వస్తుంటే, యోగీంద్రులందరికీ‌ ఎంతో‌ ఆనంద కలుగుతోంది వాటిని ఆలకిస్తూ.  రాగిరంగుకు తిరిగిన ఆయన జటాజూటపు కాంతులు దిక్కులను ఉదయారుణప్రభలతో‌ నింపివేస్తున్నాయి.  ఆయన దరించిన దివ్యమైన తులసిదండల నుండి వెలువడుతున్న సుగంధంతో భూమ్యాకాశాలూ అంతరాళమూ నిండిపోతున్నాయి.  అటువంటి దివ్యమైన ఆకారంతో, అద్భుతమైన కీర్తితో ప్రకాశిస్తున్న నారదమహర్షులవారు వ్యాసమహర్షిని చూడవచ్చారు.  ఆయన ఎంతో‌ కరుణతో వ్యాసులవారితో సంభాషించి వ్యాసులవారి చింత తీర్చాలన్న సదుద్దేశంతో వచ్చారు.

అల వచ్చిన నారదులవారు, దిగులుగా ఉన్న వ్యాసులవారిని చూసారు.  వారికి తెలుసు వ్యాసులవారు దేని గురించి చింతతో‌ ఉన్నదీ.  వ్యాసులవారి చేత సముచితమైన సత్కారాలు అందుకున్నారు.  ఆ తరువాత యథాప్రకారం చిన్నగా వీణానాదం చేస్తూ,  వ్యాసులవారి వంక చూసి ఇలా అన్నారు.

ఉ. ధాతవు భారతశ్రుతివిధాతవు వేదపదార్థజాల వి
జ్ఞేతవు కామముఖ్యరిపుట్క విజేతవు బ్రహ్మతత్వ ని
ర్ణేతవు యోగినేతవు వినీతుడ వీవు చలించి చెల్లరే
కాతరు కైవడిన్ వగవ కారణ మేమి పరాశరాత్మజా

ఓ వ్యాసా, ఏమిటయ్యా అలా దిగులు పడుతూ‌ కూర్చున్నావు?  ఇదేమన్నా బాగుందా?  అన్నీ తెలిసిన నీకు ఎందుకయ్యా ఈ విచారం? నీవు బ్రహ్మ అంతవాడివి కాదా - వేదాలను చక్కగా ఋక్, యజుస్, సామ, అధర్వ విభాగాలుగా నిర్ణయించి లోకానికి మహోపకారం చేసినవాడివి.  సకలవేదాలలోని సారభూతమైన సమస్తాన్ని నీ కన్నా చక్కగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతశ్శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యమూ అనే ఆరుగురు భయంకరమైన శత్రువులనూ జయించిన మహానుభావుడివి.  యోగులందరూ నాయకుడివి గురువు స్థానంలో‌ నిలబడిన వాడివి.  సకలనీతులనూ చక్కగా తెలిసినవాడివి.  అదేమిటయ్యా, నీ అంత వాడివి నువ్వే అనిపించుకున్న మహానుభావుడివి నువ్వేమిటీ, ఇలా దీనంగా ఉండటం యేమిటీ?  ఎందుకయ్యా నీకు విచారం?  కాస్త నాకు చెప్పు అసలు నీ‌ బాధ యేమిటో!

ఇలా శ్రీనారదులవారి సమాశ్వాసించటంతో శ్రీవేదవ్యాసులవారు మహదానందం చెందారు.

ఓ నారదమహర్షీ, నీవు సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మకు కుమారుడివి.  సర్వేస్వరుడైన శ్రీహరికి అత్యంత ప్రియభక్తుడివి. సకలలోకాల వృత్తాంతాలూ నీకు తెలుసు. భూతభవిష్యత్తులూ వర్తమానమూ నీకు తెలుసు. సూర్యుడంత ప్రభావం కలవాడివి.  అందరి మనస్సులూ తెలిసినవాడివి. మహానుభావుడవు. సర్వజ్ఞుడివి.  నా బాధ నీవు తెలిసికోగలవు.  అయినా నా యందు అనుగ్రహం చూపటానికి దయతో నన్ను అడుగుతున్నావు.  స్వామీ‌, నారదమహర్షీ, నా యందు దయచూపి, నా మనస్సులో ఏర్పడిన కొరతను నివారించండి. అని ఈ విధంగా నారదులవారికి వ్యాసులవారి విన్నపం చేసుకున్నారు.

అప్పుడు నారదులవారు చిరునవ్వుతో వ్యాసమహర్షికి ఇలా బోధించారు.

ఉ.  అంచితమైన ధర్మచయ మంతయిఁ జెప్పితి వందులోన నిం
చించుక గాని విష్ణుకథ లేర్పడఁ జెప్పవు ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁ గాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా

వ్యాసా, నువ్వు నీ గ్రంధాలన్నింటిలో విస్తారమైన ధర్మవిషయాలన్నింటి గురించి చక్కగా, విపులంగా బోధించావు. చాలా బాగుంది. తప్పకుండా చాలా మంచిపని.
అలాగే నీ‌ గ్రంథాలలో అక్కడక్కడ సందర్భం వచ్చినప్పుడు ముక్తసరిగా భగవంతుడైన విష్ణుమూర్తిని గూర్చి చెప్పావు కూడా.  అదీ బాగానే ఉంది. 

కానీ, వ్యాసా, అలా ఊరికే ధర్మాలు ఏకరువు పెడితే లాభం ఏమిటీ?
కేవలం అక్కడక్కడా విష్ణుమూర్తిని గూర్చి ఒకటి రెండు ముక్కలు చెప్పి లాభం‌ ఏమిటీ?

ఊరికే ధర్మాధర్మాలగోలలో పడి విష్ణుగుణాను కీర్తనం చేయటం మీద మనసు పెట్టలేదు నువ్వు! గమనించావా?

ధర్మోపన్యాసాలతో భగవంతుడికి మెప్పు సంపూర్ణంగా కలుగుతుందటయ్యా? ఆయన అనంత కల్యాణగుణవిశేషాలను మనఃపూర్వకంగా స్తుతిస్తే కలుగుతుంది కానీ?

నీకు వచ్చిన ఈ‌ కొరత, ఈ‌ మానసిక గ్లాని అంతా నువ్వు కోరి శ్రీహరిని నుతించకపోవటం వల్లే వచ్చింది.

మరొకమాట. హరి నామ గానం చేసే కావ్యం ఏదైనా సరే, మానససరోవరంలా మహా పవిత్రమూ‌ సుందరమూ అవుతుంది.  హరినామం తలచని కావ్యం ఎంత గొప్ప కథా సంవిధానమూ, కవితా ప్రౌఢిమా, చమత్కారాలూ, అలంకారాలూ, శాస్త్రచర్చలూ వగైరా సరంజామాతో నిండి ఉన్నా అది చుట్టూ కాకులు మూగి రొదచేస్తున్న బురద గుంటలాంటి సుమా!

శ్రీహరి గుణనామ కీర్తనలతో శోభించే‌ కావ్యంలో ఒకవేళ ఇతరమైన గొప్పగొప్ప విషయాలు లేకపోయినా యేమీ ఫరవాలేదు.  చివరకు అక్కడక్కడా అపశబ్దాలు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అటువంటి కావ్యం నిస్సందేహంగా మంచి కావ్యమే. అలా హరినామోపేతమైన కావ్యంతో సర్వపాపాలూ ప్రక్షాళనం అయిపోతాయి. 

అదయ్యా హరినామం గొప్పదనం.  అందుకే, సాధువులైన వాళ్ళు ఆ శ్రీహరి నామం మననం‌ చేసుకుంటూ, ఆ హరి నామాన్ని ధ్యానం చేసుకుంటూ,  ఆ హరి నామం కీర్తనలుకట్టి పాడుకుంటూ, అ హరినామాన్ని మనసారా పరవశంతో వింటూ ఉంటారు.  నిరంతరం వాళ్ళిలాగే ప్రవర్తిస్తూ ధన్యులౌతున్నారు.  ఇది సత్యం. ఇదే సత్యం.

వ్యాసా, నీవు తత్వం అంతా తెలిసినవాడివే. ఒక్క సారి నీవే‌ అలోచించి చూడు.  నేను చేసిన బోధలో సత్యం అంతా నీకే స్వయంగా అవగతం అవుతుంది!

1 కామెంట్‌:

  1. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. మొదలు పెట్టేరనమాట. సంతసం.

    రిప్లయితొలగించండి